.
బీహార్‌లో ఆర్జేడీకి వచ్చిన వోట్లు 1.154 కోట్ల వోట్లు… అంటే 23 శాతం… కానీ వచ్చిన సీట్లు 25 మాత్రమే…
బీజేపీకి వచ్చిన వోట్లు 1.008 కోట్ల వోట్లు… అంటే 20.08 శాతం… కానీ వచ్చిన సీట్లు 89…
Ads
అలాగే జేడీయూకు వచ్చిన వోట్లు 96.67 లక్షలు, అంటే కేవలం 19.25 శాతం… కానీ వచ్చిన సీట్లు 85 సీట్లు…
.
…….. ఎవరు గెలిచినట్టు..? ఆర్జేడీయా..? బీజేపీయా..? అన్ని పార్టీలకన్నా ఎక్కువ వోట్లు గెలుచుకున్న ఆర్జేడీయే అసలైన విజేత అనే శుష్క విశ్లేషణలు కనిపిస్తున్నాయి… ఆ విశ్లేషకులకు మన దేశ ఎన్నికల తీరు మీద అవగాహన లేదన్నమాట…
ఖచ్చితంగా గెలిచింది బీజేపీ, జేడీయూ కూటమే… ఎందుకంటే..? ఆర్జేడీ 243 సీట్లకు గాను 143 సీట్లలో పోటీచేసింది… కానీ బీజేపీ, జేడీయూ 101 చొప్పున సీట్లలోనే నిలబడ్డాయి… సో, ఎక్కువ సీట్లలో పోటీచేసిన పార్టీకి సహజంగానే ఎక్కువ వోట్లు పడతాయి కదా…
బీజేపీ, జేడీయూ పోటీచేసిన స్థానాలతో సాధించిన వోట్లను పోల్చి లెక్క తీస్తే… అప్పుడు అర్థమవుతుంది అసలైన విజేతలు ఎవరో..!
- 143 సీట్లలో పోటీచేసి ఆర్జేడీ 23 శాతం వోట్లు సంపాదించింది… సగటున ఒక్కో సీటుకు 16 శాతం మాత్రమే…
- కానీ బీజేపీ 101 సీట్లలో పోటీచేసి 20 శాతం వోట్లు సంపాదించింది… సగటున ఒక్కో సీటుకు 19 శాతానికి పైగా వోట్లు…
- జేడీయూ కూడా అంతే… 101 సీట్లలో పోటీ చేసి 19.25 శాతం వోట్లు సంపాదించింది… సగటున ఒక్కో సీటుకు 19 శాతం వోట్లు…
మరి ఎవరు ఎక్కువ వోట్లు సంపాదించినట్టు… లోకజనశక్తి పార్టీ అయితే కేవలం 28 సీట్లలో పోటీచేసి ఏకంగా 5 శాతం వోట్లు సంపాదించింది… దాని స్ట్రయిక్ రేటు చాలా ఎక్కువ… సేమ్, అదే కూటమిలోని HAM, RLM కూడా అంతే…
ఒక్కసారి కాంగ్రెస్ దీనావస్థ చూద్దాం… దీంతో పోలిస్తే ఆర్జేడీ చాలా నయం… (అడిగినన్ని సీట్లు ఇవ్వకపోతే కూటమిలో ఉండబోం అని బెదిరించి మరీ కాంగ్రెస్ 61 సీట్లలో పోటీచేసింది… అంతగా తనకు ఆదరణ లేకపోయినా సరే…)
దానికి వచ్చిన వోట్లు 8.7 శాతం… పోటీచేసిన 61 సీట్లతో లెక్కేస్తే ఒక్కో సీటుకు సగటున కేవలం 14 శాతం… సేమ్, సీపీఐ… అది 9 సీట్లలో పోటీచేస్తే 0.7 శాతం వోట్లు మాత్రమే వచ్చి, ఒక్క సీటు కూడా గెలవలేదు.,. సీపీఎం నయం… 4 సీట్లలో పోటీచేసి 0.6 శాతం వోట్లు తెచ్చుకుని, ఒక సీటు గెలిచింది… కూటమిలో సీపీఐఎం లిబరేషన్ పార్టీ 20 సీట్లలో పోటీచేసి 2.85 వోట్లు సాధించింది… గెలిచింది రెండు సీట్లు…
ఎన్డీయే కూటమిలోని పార్టీల మధ్య వోట్ల మార్పిడి సజావుగా జరిగింది… ఒకరి వోట్లు మరొకరికి ట్రాన్స్‌ఫర్… కానీ ఆర్జేడీ కూటమిలో అది సజావుగా జరగలేదు… అది మరో కారణం… బీఎస్పీ అయితే 130 సీట్లలో పోటీచేసింది… దానికి సగటున ఒక్కో సీటుకు వచ్చిన వోట్లు కేవలం 600… గెలిచింది ఒక్క సీటు…
…….. బీహార్‌లో యాంటీ ఇన్‌కంబెన్సీ వోటు పెరగకపోగా… ఇన్‌కంబెన్సీ వోటు విపరీతంగా పెరిగింది… దానికి కారణాలు అనేకం… మళ్లీ లాలూ మార్క్ జంగిల్ రాజ్, మాఫియా రాజ్ రావద్దని బీహార్ వోటరు బలంగా కోరుకున్నాడేమో… లేక పదివేల చొప్పున మహిళలకు ఖజానా నుంచి పంచిన పసుపు కుంకుమ పైసలు పనిచేశాయేమో… మొత్తానికి ఏ ఎగ్జిట్ పోల్ అంచనా వేయలేని రీతిలో… వోట్లు సునామీ తేజస్వి యాదవ్ కలల్ని తుడిచిపెట్టేసింది..!!
Share this Article