Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కిిం కర్తవ్యం..? బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం మల్లగుల్లాలు..!!

October 9, 2025 by M S R

.

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇచ్చింది… ఐతే ఇది పొలిటికల్, లీగల్ సర్కిళ్లకు పెద్ద ఆశ్చర్యం ఏమీ కల్పించలేదు… చాలామంది ఊహించిందే ఇది… కొందరు నాయకులైతే త్వరపడి స్థానిక ఎన్నికల మీద ఆశలతో అప్పుడే ఖర్చులు పెట్టకండి అనీ వారించారు కూడా..!

అవును, కాంగ్రెస్ పార్టీ కూడా ఓ స్ట్రాటజీగా బీసీ చాంపియన్లం అని చెప్పుకోవడానికి రకరకాలుగా తన వంతు ప్రయత్నాలు తాను చేసింది… కులగణన నుంచి చట్టం దాకా… మరెందుకు హైకోర్టు అభ్యంతర పెడుతోంది..?

Ads

రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దని రాజ్యాంగంలో రాసి ఉందా..? ఒకసారి నోటిఫికేషన్లు జారీ చేశాక కోర్టులు స్టే ఇవ్వలేవు కదా… సంబంధిత జీవో9 గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది చాన్నాళ్లుగా, మొన్నటి సుప్రీం బిల్లుల ఆమోదానికి పెట్టిన 6 నెలల గడువు తీరితే మేం ఇక అమలు చేసుకోవచ్చు కదా…. EWS 10 శాతం రిజర్వేషన్లు కలిపితే ఆల్రెడీ 50 శాతం పరిమితి దాటినట్టే కదా…

రిజర్వేషన్లు మొత్తం కలిపి 67% పోగా.. మిగతా 33 శాతం సీట్లు రిజర్వేషన్ల పరిధిలో లేని 15% జనాభాకు అవకాశం కల్పిస్తున్నాయి కదా …. ఇలాంటి వాదనలు ఎన్నో వచ్చాయి, బయటా, కోర్టులో… కోర్టు వాటిని పరిగణనలోకి తీసుకోలేదు…

50 శాతం రిజర్వేషన్లు దాటకూడదని 1992లో ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (మండల్ కేసు) లో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది… సో, సుప్రీం కోర్టు తీర్పును దాటి హైకోర్టు పోలేదు… నోటిఫికేషన్లు వచ్చాక కోర్టు స్టే ఇవ్వకూడదనీ లేదు… అది న్యాయబద్దం కాదని భావిస్తే నిలిపేయగలదు… EWS రిజర్వేషన్లకు కులం ప్రాతిపదిక కాదు… మిగిలిన 15 శాతం కేవలం ఓసీలకు కాదు, అవి ఓపెన్ సీట్లు..! గతంలో బీఆర్ఎస్ కూడా ఈ 50 శాతం పరిమితిని, లీగల్ చిక్కుల్ని దృష్టిలో పెట్టుకునే 2018లో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చింది…

కొందరు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం మేరకు… కాంగ్రెస్ పాత జీవోకు ప్రాణం పోసి, పార్టీపరంగా 42 శాతం రిజర్వేషన్లను బీసీలకు ఇచ్చి… బీజేపీని, బీఆర్ఎస్‌ను కూడా అటు వైపు డిఫెన్స్‌లోకి నెడితే… కాంగ్రెస్ పార్టికి రాజకీయంగా ఫాయిదా…! ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి… ఆల్రెడీ సుప్రీం కోర్టే హైకోర్టుకు వెళ్లాలని చెప్పింది కదా… సో, సుప్రీంలో తదుపరి పోరాటానికి చాన్సుంటుందా లేదానేదీ సందేహమే…

మరి తమిళనాడులో ప్రస్తుతం 69 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి కదా… అక్కడెలా సాధ్యమవుతున్నాయనేది ఓ కీలక ప్రశ్న చాలామందిలో… నిజమే, అక్కడ బీసీలకు 30, ఎంబీసీలకు (అత్యంత వెనకబడిన తరగతులు) 20 శాతం, ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు ఒక శాతం… అంటే మొత్తం 69 శాతం రిజర్వేషన్లు… బీసీల రిజర్వేషన్లలోనే అంతర్గతంగా ముస్లిం రిజర్వేషన్లు 3.5 శాతం…

కానీ సుప్రీంకోర్టు గత తీర్పు పరిమితి దాటి 69 శాతం రిజర్వేషన్లు ఉండకూడదు కదా… అందుకని జయలలిత ప్రభుత్వం ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒకరకంగా బెదిరించి మరీ, ఈ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో పెట్టించింది… అంటే న్యాయసమీక్షలకు తావు లేకుండా..!

అప్పటి ముఖ్యమంత్రి జయలలిత, కేంద్రంలో పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై గట్టి రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చింది… 1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ – అన్నాడీఎంకే తమిళనాడులో పొత్తు పెట్టుకుని అద్భుత ఫలితాలను సాధించాయి… ప్రధాని పీవీ పార్లమెంట్‌లో తన ప్రభుత్వ మెజార్టీ కోసం అన్నాడీఎంకే మద్దతుపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది…

జయలలితకు కోపమొస్తే పీవీ ప్రభుత్వం కూలిపోయే దురవస్థ… అందుకే జయలలిత ఒత్తిడికి పీవీ తలొగ్గి ఆ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాడు… అదీ దాని నేపథ్యం… మరి అలాంటిది ఇప్పుడు మళ్లీ సాధ్యమేనా..? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంగీకరించదు… దాని మెడ మీద కత్తి పెట్టి, నిర్ణయం తీసుకునేలా చేయగల పరిస్థితులు లేవు కదా…

మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకి… పైగా కాంగ్రెస్ పార్టీకి ఫాయిదా వచ్చే పనిని అది అస్సలు చేయదు… మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ కర్తవ్యం..? కాలం చెబుతుంది..!! కానీ ఒక్కటి మాత్రం నిజం… స్థానిక ఎన్నికల్లో తమ జనాభాకు తగిన ప్రాతినిధ్యం లభిస్తుందని ఆశించిన బీసీలకు నిరాశే ఇది..!! ఇంకోవైపు స్థానిక ఎన్నికలకు హైకోర్టు పెట్టిన గడువు తరుముకొస్తోంది..! పార్టీపరంగా ముందుకు పోవాలంటే పాత జీవో, రీనోటిఫికేషన్లు తప్పవా..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • స్టార్ హీరో ఇమేజ్, డాన్సులు, ఫైట్లు, ఎలివేషన్లు ఉండగానే సరిపోదు..!!
  • కాంగ్రెస్‌తోపాటు బీజేపీ కూడా..! తెలంగాణకు కేసీయార్ జలద్రోహం- నిజాలు..!!
  • ‘ట్రంపరితనం’… ప్రపంచానికే వినాశకరం… ఏదో ముంచుకొస్తోంది…
  • వ్యాపిస్తున్న దుర్గంధం… తిట్ల పర్వంలో జాతీయ నేతలనూ వదలడం లేదు…
  • ఒకటి బాసట…! మరొకటి కబళింపు..! ఇదే అమెరికాకూ ఇండియాకూ తేడా..!!
  • శివశంకర ప్రసాద్ గారు… మీ ‘గెస్చర్’ మనసుని గెలుచుకుంది..!
  • సంక్రాంతి ఎప్పుడు..? ఎందుకు మీమాంస..? మళ్లీ సందిగ్ధత..!!
  • వాటిని గజల్స్ అంటారా..? నీ సారస్వత సేవ ఏమిటి శ్రీనివాసులూ…?
  • వెనెజులా..! ట్రంపుదే కాదు… మన చమురూ ఉంది అక్కడ… తవ్వాలి..!!
  • అవునూ, ఇంతకీ ఈ ‘తెలుగు గజల్ శ్రీనివాస్’ పాత కేసు ఏమైనట్టు..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions