మొన్నటి నవంబరులో మనం ఓ కథనం చదువుకున్నాం ‘ముచ్చట’లోనే…. ‘‘సమాజ్‌వాదీ సుగంధ్’’ పేరిట తయారైన పర్‌ఫ్యూమ్ బాటిళ్లను ఆవిష్కరిస్తూ అఖిలేషుడు ఏమన్నాడో తెలుసా..? ‘‘22 సుగంధాలతో సెంట్ తయారు చేయించేశా, దానికి ఓ పేరు కూడా పెట్టేశా, సెంట్ ఆఫ్ సోషలిజం… ఈ సెంట్ తయారు చేయించిందే పార్టీ కోసం, 2016లోనే తాజ్ మహల్, బెనారస్ ఘాట్, రుమి దర్వాజ, కన్నౌజ్ పేర్లతో నాలుగైదు రకాల సెంట్ బాటిళ్లను విడుదల చేశాను… 5 వేల బాటిళ్లను పంచిపెట్టాం… లక్షలాదిగా పంచిపెట్టే టైం లేకపోయింది… ఇక ఈ 2022 ఎన్నికల్లో మ్యాజిక్ తప్పదు…’’ ఈ పర్‌ఫ్యూమ్ బాటిళ్ల పంపిణీ ఏమిటి..? వోట్ల సాధించడం ఏమిటి..? అంతా అయోమయంగా ఉందా..? యూపీ రాజకీయాలు అలాగే ఉంటయ్, అఖిలేషుడి రాజకీయాల స్థాయి అలాగే ఉంటుందని ఒకేసారి అంచనాకు రాకండి… సమాజ్‌వాదీ సెంట్ సీసాలకు యోగీ భయపడిపోయి, మోడీకి చెప్పి, ఐటీ దాడులు చేయించాడనీ, ఆ సెంట్ల సీసాలు తయారు చేసే పీయూష్ జైన్ వ్యాపారి ఇంట్లో ఒకేసారి 150 కోట్ల డబ్బు అందుకే దొరికిపోయిందనీ మీకు మీరే అంచనాలు వేసుకోకండి…
ఇదేమీ సమాజ్‌వాదీ పార్టీ గుప్పిస్తున్న పరిమళాల దెబ్బకు మోడీ భయపడిపోవడం కాదు… అసలు కథలు వేరే ఉంటయ్… అవి బీజేపీకి కూడా తెలుసు… రాబోయే యూపీ ఎన్నికలు తమకు ఎంత కీలకమో కూడా బాగా తెలుసు… అఖిలేష్ డబ్బు పంపిణీ ఎవరెవరి ద్వారా సాగుతుందో అంచనా వేసింది… ఏ వ్యాపారుల ఇళ్లల్లో, ఏ నాయకుల ఆఫీసుల్లో సొమ్ము దాచారో ఆరా తీసింది… నిజమే కదా, వర్తమాన రాజకీయాల్లో మనం ఎంత డబ్బు పంచామని కాదు, ప్రత్యర్థి పంచకుండా ఎంతమేరకు అడ్డుపడ్డామనేది కూడా ముఖ్యమే కదా… గత ఎన్నికల్లో బీజేపీ, కేసీయార్ కలిసి చంద్రబాబుకు ఈ కోణంలో ఎలా ‘నట్లు బిగించారో’ తెలుసు కదా… ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే, బీజేపీది ఇదే అస్త్రం… డబ్బు నిల్వ కేంద్రాలు, ప్రత్యర్థి పార్టీల ఆర్థికస్థంభాలపై దాడులు… డిస్టర్బ్ చేయడం, డబ్బు పంపిణీ నెట్‌వర్క్‌ను చెల్లాచెదురు చేయడం… యూపీలోనూ అదే…
Ads
నిన్న దాడుల్లో 150 కోట్లు దొరికిన వ్యాపారి పేరు పీయూష్ జైన్… ఈ సెంట్ సీసాలు తయారు చేసేది తనే… సమాజ్‌వాదీ పార్టీ నేత… ఎన్నికల్లో పంచడానికి డబ్బును ఈ వ్యాపారి ఇంట్లో దాచిపెట్టారనే సమాచారం తెలిసే కేంద్ర అధికారులు (సీబీఐసీ) దాడులకు దిగారు… దెబ్బకు 150 కోట్లు దొరికాయి… ఎన్నికల్లోపు ఇంకా చేపలు కొన్ని పడతాయి… లేదా ఇప్పటికే ఎస్పీ నేతలు అలర్ట్ అయిపోయి, స్థావరాలు మార్చేసి ఉంటారు… నిజానికి ఆమధ్య ఎస్పీ నేతల ఇళ్లు, ఆఫీసుల్లో దాడులు చేశారు కానీ ఏమీ దొరకలేదు… ఈసారి ఎస్పీ అనుకూల వ్యాపారులపై కన్నేసి, ఈ దాడులు స్టార్ట్ చేశారు… ఈ సెంట్ వ్యాపారి (త్రిమూర్తి ఫ్రాగ్రెన్సెస్) మాత్రమే కాదు, శిఖర్ పాన్ మసాలా వ్యాపారి (గుట్కా) ప్రవీణ్ జైన్ ఆస్తులపైనా ఐటీ దాడులు సాగుతున్నయ్…
సమాజ్‌వాదీ పార్టీకి ఆర్థికస్థంభాలుగా ఉన్న కంపెనీలను కూడా టార్గెట్ చేస్తారు… భయపెట్టడం కాదు, ఈ ఐటీ దాడులతో అంతిమంగా ఎవరికీ జరిగే నష్టం ఏమీ ఉండదు… కానీ ఎన్నికలవేళ వాళ్లందరినీ సొంత తల్నొప్పులకు గురిచేయడం బీజేపీ ఉద్దేశం… (బీజేపీ చెప్పగానే ఐటీ అధికారులు దాడులు చేస్తారా అనే అమాయకపు ప్రశ్నలు దయచేసి వేయకండి)… పీయూష్ జైన్ ఇంట్లో భారీగా డబ్బు దొరకగానే ఇక వెంటనే బీజేపీ ‘‘సెంట్ సీసాల ఎస్పీ అసలు కంపు వాసన చూస్తున్నారు కదా’’ అని పొలిటికల్ దాడి స్టార్ట్ చేసింది… ఇప్పటివరకైతే అఖిలేష్ పార్టీ నుంచి ఎదురుదాడి లేదు… కక్కలేక, మింగలేక, పీయూష్‌కు రాజకీయంగా మద్దతు పలకలేక కిక్కుమనడం లేదు..!!
Share this Article