నటుడు, దర్శకుడు సూర్యకిరణ్ యాభై ఏళ్ల వయస్సులోనే అనారోగ్య కారణాలతో మరణించడం దురదృష్టకరం… అంతకుమించి చెప్పడానికి ఏమీలేదు నిజానికి… అబ్బే, చెప్పడానికి ఏమీ లేదని ఊరుకుంటారా ట్యూబర్లు… నో, నెవ్వర్… ఆయన ప్రేమ పెళ్లి కథను బయటికి లాగారు మరోసారి… విడాకుల దగ్గర నుంచే మానసికంగా కుంగిపోయి, చెడు అలవాట్లకు లోనయ్యాడనీ, అదే చివరకు ఆయన ప్రాణం తీసిందని గగ్గోలు పెట్టారు…
సూర్యకిరణ్ సొంత చెల్లెలు సుజిత… బాలనటి/నటుడిగా/టీవీ స్టార్‌గా/సినిమా నటిగా ఆమె తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు… అన్నాచెల్లెళ్లిద్దరూ మలయాళ, తమిళ, తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం… అన్న మరణం తరువాత ఆమె ఎక్కడో మాట్లాడుతూ సినిమా నిర్మాణంలో వేలుపెట్టిన అన్న విపరీతమైన అప్పుల కారణంగా చాలా నష్టపోయాడనీ, ప్రేమపెళ్లి కూడా విడాకుల దాకా పోయిందని చెప్పింది… అన్న అంటే ఆమెకు బాగా ప్రేమ…
ఆ వ్యాఖ్యలను పట్టుకుని… కల్యాణి అలియాస్ కావేరిని కూడా సీన్‌లోకి లాగిన రచ్చ కథనాలు బోలెడు కనిపించాయి… కల్యాణితో సూర్యకిరణ్ ప్రేమ పెళ్లి నిజమే, ఆరేడేళ్ల క్రితమే విడాకులూ నిజమే, సూర్యకిరణ్ అప్పులూ నిజమే… కానీ సుజిత నేరుగా కల్యాణిని నిందించినట్టుగా ఎక్కడా మాట్లాడినట్టు చూడలేదు, చదవలేదు… నిజానికి మొదట సుజిత ద్వారానే కల్యాణి సూర్యకిరణ్‌కు పరిచయం… ఆ పెళ్లికి పెద్ద సుజితే… (కల్యాణి కూడా బాలనటే…)
Ads
ఇక్కడ మనం చెప్పుకునేది ఏమిటంటే… కల్యాణి (ఈమె కూడా తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులందరికీ పరిచయమే) విడాకుల తరువాత నుంచి ఈరోజు వరకూ తమ వివాహబంధం, విడాకులు, అప్పులు ఎట్సెట్రా ఏ విషయం మీదనైనా మీడియా ముందుకు రాలేదు… చివరకు సూర్యకిరణ్ మరణం మీద కూడా నిశ్శబ్దం… అంత్యక్రియలకు హాజరైందో లేదో కూడా ఎవరికీ తెలియదు… ఒకసారి దూరమైంది, అంతే… దూరంగానే ఉండిపోయింది… చివరి దాకా…!! (కల్యాణిని తను జీవితంలో మరిచిపోలేననీ, తన మరణం దాకా ప్రేమిస్తూనే ఉంటానని సూర్యకిరణ్ ఏదో ఇంటర్వ్యూలో చెప్పినట్టు గుర్తు)…
ఈమధ్య సుజిత ఇన్‌స్టాలో ఓ వీడియో పెట్టి ఓ కథ చెప్పుకొచ్చింది… ‘‘నేను ఒక బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు అందులో ఓ పెద్దావిడ కూర్చుని ఉంది. ఆమె పక్కనే మరో సీటు ఖాళీగా ఉంది. అప్పుడు సడెన్ గా ఓ అమ్మాయి వచ్చి వచ్చి ఆ పెద్దావిడ పక్కన కూర్చుంది. చేతిలో ఎక్కువ లగేజీ పట్టుకుని అందరిని తోసుకుంటూ వచ్చి.. ఆ పెద్దావిడ పక్కన చాలా రాష్ గా కూర్చుంది. ఆ సమయంలో ఆ పెద్దావిడకు ఈ యువతి చేతిలోని వస్తువులు గట్టిగా తాకాయి.. అయినా ఆమె ఆ అమ్మాయిని ఏమి అనకుండా కూర్చుంది. ఇక కొద్ది సమయం తర్వాత నేను కంగారులో వచ్చి ఈ పెద్దావిడను పట్టించుకోకుండా కాస్త రాష్ గా బిహేవ్ చేసి వచ్చి కూర్చున్నాను అంటూ ఫీల్ అవుతుంది. కానీ ఆవిడ మాత్రం అసలు ఏమి అనకుండా సైలెంట్ గా ఉంటుంది. దీంతో ఆ అమ్మాయి మాట్లాడుతూ.. నేను మిమ్మల్ని పక్కకు నెట్టేసి మరీ కూర్చున్నాను.. ఇలా రాష్ గా బిహేవ్ చేసినందుకు మీకు కోపం రాలేదా అని అడుగుతుంది. మీరు నాతో ఎందుకు గొడవ పడలేదు అని అడుగుతుంది. దీంతో ఆ బామ్మ మాట్లాడుతూ.. మన ప్రయాణం చాలా చిన్నది. తక్కువ సమయమే. నేను మరో రెండు స్టాపుల తర్వాత దిగిపోతాను. ఈ కొద్ది సమయానికి నీతో గొడవ పడితే నాకేం వస్తుంది ? ఇప్పుడు నిన్ను తిడితే నేనేం పొందుతాను ? అని చెప్పింది.
ఆ బామ్మ మాట్లాడిన మాటలు చిన్నవే.. కానీ అందులో ఎంతో పెద్ద అర్థం దాగివుంది. మనది చిన్న ప్రయాణం.. ఈ జర్నీ ఎప్పుడు ముగుస్తుందో.. ఎక్కడ ముగుస్తుందో తెలియదు.. అలాంటి ఈ చిన్న జీవితంలో ఏవో చిన్న చిన్న కారణాలకు.. కోపాలకు పోయి మాటలు అనడం అనవసరం. లేదా ఎవరో మనల్ని బాధపెడుతున్నారని ఫీల్ అవ్వడం వృథా. మనది చాలా చిన్న ప్రయాణం.. ఉన్నంతకాలం ప్రతి క్షణాన్ని ఆస్వాదిద్ధాం. ” అంటూ ఈ వీడియోలో చెప్పుకొచ్చింది సుజిత… నిజానికి ఈ వీడియో ఓ మంచి నీతి కథ…
నిజానికి ఈ వీడియోకు సూర్యకిరణ్ మరణానికీ, అప్పులకూ, కల్యాణికీ, వాళ్ల విడాకులకూ ఏం సంబంధం ఉంది..? కానీ ఈ సమయంలో ఆమె ఆ వీడియో పెట్టడం పరోక్షంగా కల్యాణిని ఉద్దేశించే అనేది ట్యూబర్ల బాష్యం… ‘‘నిన్ను తిడితే నాకు ఏమొస్తుంది’’ అని కల్యాణిని ఉద్దేశించి ఈ వీడియో పెట్టినట్టుగా మళ్లీ బోలెడు కథనాలు… సుజిత కల్యాణి మీద విడాకుల తరువాత కూడా ఎప్పుడూ హార్ష్ కామెంట్స్ చేసినట్టు చదవలేదు, చూడలేదు… ప్చ్, మనవాళ్లు ఊరుకోరు కదా… ఏదీ లేకపోయినా సరే, ఏదో గాలి పోగేసి, ఏదో వండేసి, ఏదో వార్చేసి, ఏదో ఉన్నట్టు థంబ్ నెయిల్స్ పెట్టేసి, ఏదో కనికట్టు చేసేస్తారు కదా… ఎస్, మరోసారి అనిపించింది… నోరు కట్టేసుకున్న కల్యాణి అలియాస్ కావేరి మౌనం అభినందనీయమే..! ఆమె ఏం మాట్లాడినా ఇంకెన్ని కథలు అల్లేవారో..!!
Share this Article