మీరు ఏ ఊరిలోని ఏ చిన్న కిరాణా కొట్టుకైనా వెళ్లండి… ఉద్దెర రేపు అని రాసి ఉంటుంది… రోజూ రేపే… ఈ వాక్యాన్ని కాయిన్ చేసినవాడెవడో గానీ అద్భుతం… మన సినిమా నటుల పార్టీల యవ్వారమూ అంతే… ప్రత్యేకించి రజినీకాంత్… నా పార్టీ ప్రకటన రేపు అంటాడు… మీరు ఎప్పుడు అడిగానా ఆ డైలాగులో మాత్రం తేడా రాదు… సారు గారి వయస్సు 70 ఏళ్లు… ఇప్పటికీ స్టెప్పులు వేస్తూనే ఉంటాడు… సినిమాలు తీస్తూనే ఉంటాడు… ఇదుగో పార్టీ అంటాడు, అదుగో పార్టీ అంటాడు…
అన్ని జిల్లాల తన అభిమాన సంఘాల నాయకులను వెంటనే రమ్మన్నాడు… మీటింగు పెట్టాడు, తాడోపేడో తేల్చేస్తాడు అనుకున్నారు అందరూ… అసలే ఆమధ్య తన ఆరోగ్య స్థితి దృష్ట్యా రాజకీయాలు వద్దు అని డాక్టర్లు సలహాలు ఇచ్చారనే వార్తలు కూడా వచ్చాయి… ఆశలు పెట్టుకున్న బీజేపీ కూడా ఏదో ఒకటి తేల్చవోయ్ అని ఒత్తిడి తీసుకొస్తోంది… మరోవైపు వచ్చే మే లోపు కొత్త అసెంబ్లీ కొలువు తీరాల్సి ఉంది… అంటే ఎన్నికలు తరుముకుని వస్తున్నయ్…
ఇప్పుడు కూడా తను ఏమని ప్రకటించాడో తెలుసా..? సరైన సమయంలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తాడు అట…. టైంపాస్ పల్లీ బఠానీ తరహా పాలిటిక్స్… వీళ్లకు రాజకీయ కార్యాచరణ పట్ల నిబద్దత ఉండదు… అప్పుడెప్పుడో రెండు దశాబ్దాల నుంచీ చెబుతూనే ఉన్నాడు… చివరకు అదేదో రజనీ మక్కల్ మండ్రం పార్టీని ప్రకటించినా సరే, ఇప్పటికీ దానికి జెండా లేదు, ఎజెండా లేదు… అసలు తను ఒక్కసారి కూడా జనంలోకి వెళ్లిందీ లేదు, జనానికి సంబంధించిన ఏ సమస్యపైనా ఏమీ మాట్లాడింది లేదు… చివరకు ఇప్పుడుె ఎన్నికలు ముంగిట్లో వచ్చి నిల్చున్నా సరే, త్వరలో చెబుతాడట…
Ads
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక, తాపీగా పార్టీని ప్రకటించి, అప్పటికిప్పుడు ఎవరో ఒకరికి టికెట్లు ఇచ్చేసి… లక్ పరీక్షించుకోవచ్చులే బాసూ… అప్పుడే తొందరేముంది..? మనమేమైనా ఫుల్ టైం పొలిటిషియన్స్మా..? సినిమా హిట్టయితే వోకే, లేకపోతే పోనీ… ఇంత డోలాయమానులు రాజకీయాల్లో ఉంటే ఆ ప్రజలకు ఒరిగేది ఏమిటీ అనేది మరో పెద్ద ప్రశ్న…
దాదాపు పది పార్టీలు… లెఫ్ట్, కాంగ్రెస్ సహా డీఎంకే కూటమిటో ఉన్నయ్… రేప్పొద్దున అధికారంలోకి వస్తుందని అందరూ నమ్ముతున్న పార్టీ… అర్జెంటుగా శశికళ జైలు నుంచి బయటికి వచ్చినా ఇప్పటికిప్పుడు ఆమె చేసేదేమీ లేదు… అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ, పీఎంకే, టీఎంసీ తదితరాలు ఉన్నా ఎవరికీ ఇప్పుడు పెద్ద బలమేమీ లేదు… కమలహాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం అని ఏదో ఉంది గానీ, అదే రజినీకాంత్ తరహా పార్టీయే… చాయ్బిస్కట్ టైపు…
నిష్ఠురంగా ఉన్నా ఒక నిజం చెప్పుకోవాలి… పార్టీ అంటే, నాయకుడు అంటే… జనంలో ఉండాలి, జనం సమస్యలతో మమేకం కావాలి… అండగా ఉండాలి… గెలుపో ఓటమో జానేదేవ్… పాలిటిక్స్ అనేది ఓ సీరియస్ వ్యవహారం… టైంపాస్ యవ్వారం కాదు… జనానికి కూడా ఈ క్లారిటీ వస్తే ఎంత బాగుండు..?!
Share this Article