Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వందేళ్లుగా లెనిన్ ‘అలాగే ఉన్నాడు’… ఆయన సిద్ధాంతాలే గల్లంతు…

March 17, 2025 by M S R

.

Bhandaru Srinivas Rao ………. మేము మాస్కోలో వున్న అయిదేళ్ళ కాలంలో గమనించింది ఏమిటంటే, వానయినా, ఎండయినా (ఎండలకు చాన్స్ లేదనుకోండి) వానయినా వంగడి అయినా, మంచు అయినా, మైనస్ డిగ్రీల టెంపరేచర్ లో గడ్డకట్టే చలి అయినా, అయినా కొనుగోళ్ల కోసం, జనాలు క్యూల్లో వుండడం చూశాను కానీ, కావాలని వెళ్లి, ఆరుబయలు మంచు మైదానంలో గంటల తరబడి క్యూలో నిలబడి తమవంతు కోసం వేచి చూసే సీను ఒక్క చోటే కనబడింది. అది రెడ్ స్క్వేర్ లోని లెనిన్ సమాధి దగ్గర.

1924 జనవరి 21 వ తేదీన సోవియట్ వ్యవస్థ నిర్మాత, అక్టోబర్ విప్లవ సారధి అయిన వ్లాదిమిర్ లెనిన్ మరణించారు. స్టాలిన్ ఆదేశాలపై ఆయన శరీరాన్ని రసాయనిక ప్రక్రియల ప్రకారం భద్రపరచి ప్రత్యేకంగా నిర్మించిన మసోలియంలో ప్రజల సందర్శనార్ధం వుంచారు.

Ads

ఆ రోజుల్లో ఈ సమాధి చెంత సైనికులు నిర్వహించే గార్డ్ ఆఫ్ ఆనర్ (గౌరవ సూచకమయిన కవాతు)ని చూడడానికి జనం ఎగబడేవారు. సుశిక్షితులయిన సైనికులు, చేతుల్లో తుపాకులతో మసోలియం ప్రధాన ద్వారం వద్ద పోతపోసిన విగ్రహాల్లా నిలబడి వుండేవారు.

వంతులవారీగా విధి నిర్వహణ సమయం ముగిసిన తరువాత వారినుంచి బాధ్యతలు స్వీకరించడానికి వచ్చిన వారి సహచరులు మరబొమ్మల మాదిరిగా దూరం నుంచి కవాతు చేస్తూ వచ్చేవారు. కనుమూసి తెరిచేటంతలో వారి స్థానాలకి వీళ్ళు, వీళ్ళ స్థానాలలోకి వాళ్లు తటాలున మారిపోయే దృశ్యాన్ని రెప్పలార్పకుండా చూడడానికి సందర్శకులు చలినీ, మంచునీ లెక్కచేయకుండా అధిక సంఖ్యలో గుమికూడేవారు.

సోవియట్ యూనియన్ విచ్చిన్నం తరువాత ఏర్పడ్డ కమ్యూనిస్టేతర ప్రభుత్వాలు ఈ సైనిక కవాతుకు స్వస్తి చెప్పాయి. అంతేకాదు, రష్యన్ ప్రభుత్వం 1991 నుంచి లెనిన్ మసోలియం నిర్వహణ వ్యయంకోసం ఇచ్చే నిధులను నిలుపు చేసింది కూడా. తదాదిగా, అభిమానుల విరాళాలతోనే నెట్టుకు వస్తున్నారు.

మసోలియం తెరిచి వుంచే సమయాన్ని కూడా బాగా తగ్గించారు. అయినా సందర్శకుల సంఖ్య తగ్గలేదు. భద్రతా కారణాల రీత్యా, రెడ్ స్క్వేర్ లోకి ప్రజలను అనుమతించడంపై తరచుగా విధిస్తున్న ఆంక్షల వల్ల కూడా లెనిన్ మసోలియం సందర్శన అనేది ఇప్పుడంత సులువయిన వ్యవహారం కాదు.

గత వంద సంవత్సరాల నుంచి మసోలియంలో లెనిన్ శరీరాన్ని భద్రపరుస్తూ వస్తున్న తీరే అపూర్వం.
ఇన్నేళ్ళ నుంచి, క్రమం తప్పకుండా ప్రతివారం నిపుణులు లెనిన్ పార్ధివ శరీరాన్ని ప్రత్యేకించి చర్మాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. చర్మం ఏమాత్రం పొడిబారకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు.

పద్దెనిమిది నెలలకు ఒక పర్యాయం లెనిన్ కాయానికి రసాయనాలతో ప్రత్యేక శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందుకోసం రెండు నెలలపాటు దాన్ని మూసివేస్తారు. ఆ సమయంలో లెనిన్ భౌతికకాయాన్ని నెల రోజులపాటు ప్రత్యేక ద్రావణంలో ముంచి వుంచుతారు. చర్మం నెమ్మది నెమ్మదిగా ఆ ద్రావణాన్ని పీల్చుకుని మళ్ళీ సరయిన రీతిలో తేమను పొందేలా చేయడం ఈ శుద్ధి తతంగం ఉద్దేశం.

డాక్టర్ ఇల్యా జబ్రస్కీ అనే 90 సంవత్సరాల నిపుణుడు 1934 నుంచి 1952 వరకు లెనిన్ భౌతిక కాయాన్ని కనిపెట్టుకుని వున్నవారిలో వున్నారు. ఆయన తండ్రి బోరిస్, 1924 లో లెనిన్ మరణించినప్పుడు ఆయన శరీరాన్ని భవిష్యత్ తరాలకోసం భద్రపరచిన తొలి బృందంలో పనిచేశారు.

ఈ డాక్టర్ చెప్పిన దాని ప్రకారం లెనిన్ భౌతిక కాయంలో పైకి కనిపించే చర్మం తప్ప వేరే శరీర భాగాలు ఏవీ లేవు. మొదటిసారి ఎంబామింగ్ (embalming – రసాయనిక పూత) చేసినప్పుడే వాటినన్నింటినీ తొలగించారు. కాకపొతే కనుబొమలు, మీసకట్టు, తల వెంట్రుకలను మాత్రం యధాతధంగా వుంచేశారు.

పోతే, లెనిన్ శరీరాన్ని మసోలియం నుంచి తొలగించి వేరేచోట ఖననం చేయాలన్న డిమాండ్ ఇటీవలి కాలంలో పెరుగుతూ వస్తోంది. ఈ విషయంపై ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరిపారు. యాభయ్ ఏళ్ళకంటే తక్కువ వయసున్న రష్యన్లలో అరవై శాతం మంది ఈ ప్రతిపాదనను బలపరుస్తూవుండడం విశేషం.

లెనిన్ ని ఆరాధ్య దైవంగా కొలుస్తున్న రోజుల్లో కూడా ఒకసారి మసోలియం నుంచి లెనిన్ భౌతిక కాయాన్ని తొలగించి సైబీరియా ప్రాంతానికి తరలించారు. కాకపొతే, ఆ కారణం వేరు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో నాజీల నుంచి బాంబు దాడి ముప్పు వుండగలదన్న భయంతో ఆ పని చేశారు.

‘లెనిన్ మసోలియం నుంచి ఆయన శరీరాన్ని తొలగించాలి. ఆ ప్రదేశాన్ని ఒక ఆరాధనీయ స్థలంగా పరిగణించడాన్ని ఇక ఎంత మాత్రం అనుమతించకూడదు’ అనేవారి సంఖ్య ఇప్పుడు ఆ దేశంలో క్రమంగా పెరుగుతోంది.

నిజానికి లెనిన్ కూడా తన తదనంతరం తన భౌతికకాయాన్ని ఇలా భద్రపరచాలని ఎన్నడు కోరుకోలేదు. లెనిన్ చనిపోయిన వెంటనే ఆయన భార్య నదేజ్డా కృపస్కయా చేసిన విజ్ఞప్తి కూడా అదే. లెనిన్ పేరు మీద ఏవిధమయిన స్మృతి కట్టడాలు నిర్మించవద్దని ఆనాటి ప్రభుత్వ పెద్దలను ఆవిడ కోరారు.

కానీ, అప్పటి సోవియట్ అధినేత జోసెఫ్ స్టాలిన్ మాత్రం లెనిన్ భౌతికకాయాన్ని భద్రపరిచే ప్రతిపాదన పట్లనే మొగ్గు చూపారు. దానితో ఆవిడ సూచనలను ఎవరూ పట్టించుకోలేదు. స్టాలిన్ చొరవతో పనులు శరవేగంతో సాగాయి. ముందు రెడ్ స్క్వేర్ లో చెక్కతో ఒక మసోలియాన్ని తాత్కాలికంగా నిర్మించారు.

ఇందుకోసం ఒక స్పెషల్ కమిషన్ ఏర్పాటు చేశారు. జర్మనీ నుంచి ఫ్రీజర్ సదుపాయం కలిగిన ఒక పెద్ద పేటికను తెప్పించడానికి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. అయితే ఇందుకు చాలా సమయం పట్టేట్టు వుండడం, లెనిన్ భౌతిక కాయం శిధిలం అయ్యే సూచనలు కానరావడంతో ఆ ప్రయత్నం మానుకున్నారు.

ఎంబామింగ్ చేసి, రసాయనిక చర్యల ద్వారా శరీరాన్ని భద్రపరిచే పనికి పూనుకున్నారు. కొద్ది రోజులపాటు మృత శరీరాన్ని చెడిపోకుండా చూడడం ఈ విధానం ద్వారా సాధ్యం. ఇది అప్పటికే తెలిసిన ప్రక్రియ. కానీ రసాయనిక చర్యల ద్వారా మరణించిన వ్యక్తి శరీరాన్ని శాశ్వత ప్రాతిపదికపై ఏళ్ళ తరబడి పాడయిపోకుండా చేయడం ఎలా అన్నది ఆనాటికి కనీవినీ ఎరుగని విషయం.

ఉక్రెయిన్ లో (అప్పటికి సోవియట్ యూనియన్ లో భాగం) అనాటమీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ వ్లాదిమిర్ వోరోబియోవ్ నాయకత్వంలోని ఒక నిపుణుల బృందం ఈ బృహత్తర కార్యక్రమాన్ని తలకెత్తుకుంది. అంతేకాదు, అసాధ్యం అనుకున్న ఈ పనిని జయప్రదంగా పూర్తిచేసింది.

అనితర సాధ్యం అనుకున్నది సాధ్యపడడంతో ప్రభుత్వం చురుగ్గా కదిలింది. సోవియట్ సైనికులు నిరంతరాయంగా శ్రమించి అరుణవర్ణం కలిగిన చలువరాతితో మరో మసోలియాన్ని క్రెమ్లిన్ గోడ దాపునే ఆఘమేఘాలమీద నిర్మించారు. లెనిన్ భౌతిక కాయాన్ని అందులోకి తరలించారు.

1953 లో స్టాలిన్ మరణించినప్పుడు ఆయన శరీరాన్ని కూడా ఎంబామింగ్ చేసి లెనిన్ మసోలియంలోనే ఆయన దేహం సరసనే భద్రపరిచారు. ఆ తరువాత కృశ్చేవ్ హయాంలో స్టాలిన్ భౌతికకాయాన్ని అక్కడనుంచి తొలగించి క్రెమ్లిన్ గోడ పక్కన ఖననం చేశారు.

గోర్భచెవ్ తరువాత అధికారానికి వచ్చిన బోరిస్ ఎల్త్ సిన్, ‘రెడ్ స్క్వేర్ అనేది ఒక శ్మశాన వాటికను తలపించేదిగా వుండరాదని’ అభిప్రాయపడ్డారు. అయితే, లెనిన్ శరీరాన్ని అక్కడనుంచి తొలగించడం అప్పట్లో సాధ్యం కాలేదు.

2024 సంవత్సరానికి కామ్రేడ్ లెనిన్ కన్ను మూసి వందేళ్ళు పూర్తయ్యాయి. పుతిన్ హయాములో లెనిన్ భౌతిక కాయాన్ని అక్కడ నుంచి తొలగించే ఆలోచనలు జరిగాయి కానీ ప్రయత్నాలు మొదలుకాలేదు. లెనిన్ నాయకత్వం వహించిన కమ్యూనిస్ట్ పార్టీకి ప్రస్తుతం రష్యన్ పార్లమెంటులో ప్రాతినిధ్యం తక్కువ.

‘ కామ్రేడ్ లెనిన్ చల్లని గుండె కొట్టుకోవడం ఆగిపోయి వందేళ్ళు గడిచాయి. కానీ, అజరామరుడయిన లెనిన్ కు సంబంధించి మరో శతాబ్ది మొదలయింది” అని కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు గెన్నడి జుగనోవ్ అన్నారు.
లెనిన్ చనిపోయినప్పుడు, వ్లాదిమిర్ మయాకోవిస్కి అనే కవి ఇలా రాశారు. “లెనిన్ వున్నాడు, ఉంటాడు, ఇక ముందు కూడా వుంటాడు” ఆ కవి అన్నట్టే లెనిన్ భౌతిక కాయం ఇంకా వుంది. ఆయన సిద్ధాంతాలే ఆ దేశంలో లేకుండా పోయాయి.

lenin
ఫోటో: మాస్కోలో లెనిన్ మసోలియం వద్ద క్యూలో జనం…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions