.
Prasen Bellamkonda …… కొత్త శివర్మ కోసం….
.
అదొక సినిమా రాజ్యాంగం. అదొక సెల్యూలాయిడ్ పీనల్ కోడ్. ఆనాటికి రేపటి మూవీ మేనిఫెస్టో. వ్యాపార చిత్రాలకు అదొక కొత్త భగవద్గీత.
అదే శివ. అంతా తిరగరాయడం. పాతదాన్ని వెనక్కు తోసెయ్యడం. అదే శివ.
Ads
ఫైట్స్ లో డిష్యుమ్ ను చెరిపేసి థడ్ అనే కొత్త శబ్దం. టైటిల్స్ లో మొట్టమొదటి కార్డుగా డైరెక్టర్ ఆఫ్ ఆడియోగ్రఫి దీపన్ చటర్జీ అని పడే సరికొత్త గౌరవం. నిర్మలమ్మ పోలీస్ అధికారిని చెంపదెబ్బ కొట్టే నిశ్శబ్ద విషాదం.
అప్రధాన మిత్రుడి పాత్ర హత్యకూ మనసు గగుర్పొడిచే ఛేజ్ ప్రాధాన్యతనివ్వడం అనే ధైర్యం. పాప మరణ విషాదాన్ని మృతదేహాన్ని చూపడంలో కాక నాగార్జున మొహంలో, క్రూరత్వాన్ని కత్తిపోట్లు నెత్తుటి వరదలతో కాక గొల్లపూడి కడుపులో దిగుతున్న కత్తికోతను చేతి కదలికతో కలిపి రఘువరన్ మొహంలో పలికించడం…
ఏ డాల్బీ లు లేని రోజుల్లో వర్షం థియేటర్ లోనే కురుస్తున్న ఫీల్ రాబట్టడం, చిన్నా రాడ్డందుకో
సీన్లో ఉరుములు మెరుపుల నడుమ జరిగే సంభాషణలో పాత్ర వాక్యాన్ని ఆపి ఆకాశం వైపు ఒకసారి చూసి మాటల్ని కంటిన్యూ చేయడం…
పాతబస్తీ సందుల్లో స్టడికామ్ ముందు ప్రాణభయం ఒగర్చడం, నగర వీధుల్లో పాప ప్రాణాలకు సైకిల్ వేగాన్ని అడ్డుపెట్టినప్పటి వణికించే మ్యూజిక్, దృశ్యంలోని అవ్యయాలను తొలగించడం, మాటల్లో వదరుబోతుతనం తీసేయ్యడం..
ఇంతేనా… ఇంకా వెయ్యి చెప్పొచ్చు..
అదే శివ
‘నేనీ యుద్ధంలో గెలుస్తానో లేదో కానీ నా విజయం ప్రయత్నంలో వుంది’ అంటుంది శివ లో నాగార్జున పాత్ర. బహుశా అప్పటిదాకా సినిమా నిర్మాణంలో వున్న ప్రతి సాంప్రదాయన్నీ చెరిపి రాసిన రాంగోపాల్ వర్మ తన అనుభవాన్నే ఈ డైలాగ్ గా చెప్పించి ఉంటాడు.
విజయం సాధించిన ప్రయత్నం శివ.
నావరకైతే.. శివ రిలీజ్ రోజు ఖమ్మం సుందర్ టాకీస్ లో కొన్ని పనుల వత్తిడి మధ్య నేల క్లాస్ లో చూసా. భవాని మనుషులు కాలేజ్ ముందు ఒక విద్యార్ధిని కొట్టిపడేసి అంబాసిడర్ ఎక్కి వెళ్లి పోయేపుడు కారు సైలెన్సర్ లోంచి ఒక తెల్లటి పొగ వచ్చి నల్లగా మారి అందులోంచే శివ అనే టైటిల్ పడడం, అప్పుడు వినిపించే బీజీఎమ్, వెంటనే డైరెక్టర్ అఫ్ ఆడియోగ్రఫీ అనే సింగిల్ కార్డు.. అన్నీ, అంతా షాకింగ్. వీడెవడో చాలా పెద్ద డైరెక్టర్ అయిపోతాడన్న నమ్మకం ఇచ్చిన సిగ్నేచర్.
అదే ఆర్జీవీ.
ఇంతచేసినా అప్పటి ప్రముఖ దర్శకుల మీద శివ ప్రభావం పెద్దగా పడలేదు కానీ ఫీల్డ్ లో ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్లందరూ శివ మోహంలో పడిపోయారు. వాళ్ళందరూ ఆ మోహంతోనే స్టార్ డైరెక్టర్లయారు. అందుకే అందరికీ ఇప్పుడు rgv ఒక ఐకన్.
తిరగరాయడం అనే వ్యసనం ఉన్న రాము ఆ తరవాత తనను తాను కూడా తిరగరాసుకున్నాడు. శివ టేకింగ్ కో శివ పాటర్న్ కో బానిస అవలేదు. క్షణక్షణంది మరో రూపం. కంపెనీది మరో ఫాం. సత్య ఒక సిద్ధాంత గ్రంధం. సర్కార్ ఫ్రేమ్ ల లేవెలే వేరు. రక్త చరిత్ర టేకింగ్ అల్టిమేట్. తనను తాను చెరుపుకుని ప్రతిసారీ కొత్తగా గీసుకున్నాడు. మధ్యలో ఐస్ క్రీమ్ పైత్యాలు ఆఫీసర్ వెర్రిలు ఉన్నాయి.
నేనైతే బారా కూన్ మాఫీ అంటాను. మనకొక శివను ఇచ్చినందుకు ఇంకా ఇంకా చాలా చాలా వాటికి క్షమించొచ్చు వర్మని.
అతనంటే నాకు చాలా ఇష్టం.
అతన్నిష్టపడే వాళ్ళలో నేనే నంబర్వన్ అంటే పోటీకి వచ్చే వాళ్ళు చాలా మంది వుండడమూ సంతోషమే.
వర్మ తనను తాను రివైండ్ కొట్టుకుని శివ, క్షణంక్షణం సత్య సర్కార్ లాంటివే తీస్తే బాగుండనిపించినా, అతని తాత్వికత మీది ప్రేమ చావడం లేదు.
నేను రాసే ప్రతి సినిమా రివ్యూలో ఎక్కడో ఒక దగ్గర వర్మ పేరుండేది. నా మిత్రులైతే ఒక దశలో ” నువు దమ్ముంటే వర్మ పేరు లేకుండా రివ్యూ రాయి చూద్దాం ” అని సవాళ్ళు కూడా విసిరారు. నా వల్ల కాలే.
అన్నింటికంటే హైట్ ఏంటంటే,
ఆర్జీవీ ” నా ఇష్టం ” పుస్తకం రిలీజ్ అయినప్పుడు ఒకళ్ళతో ఒకళ్ళు పరిచయం లేని ఆరు వేర్వేరు రంగాలకు చెందిన నా ఆరుగురు మిత్రులు నాకు ఆ పుస్తకాన్ని గిఫ్ట్ ఇచ్చారు.
ఆశ్చర్యం, ఆ ఆరుగురూ రాసిన వేర్వేరు వాక్యాల అర్ధం ఒకటే
” ప్రసేన్.. నీలాంటోడు ప్రపంచంలో ఇంకొకడున్నాడని ఈ పుస్తకం చదివాకే తెలిసింది” అని.
ఇంకా హైటెస్ట్ ఏంటంటే … మా అమ్మ వయసు 85 కి పైనే. తను ఇప్పటికీ పుస్తకాలు చదువుతుంది.
ముఖ్యంగా నాన్న చనిపోయినపుడు ఆర్జీవి వ్యవహరించిన తీరుకీ నేను మా నాన్న చనిపోయినపుడు వ్యవహరించిన తీరుకీ చాలా సిమిలారిటీస్ వున్నాయి.
అందుకే అయుంటుంది అమ్మ
“నా ఇష్టం” చదివి
” యెవడ్రా వీడు, అచ్చం నీలాంటోడే ” అంది.
ఛీ, అతడ్ని నువ్వు ఇష్టపడతావా అని నన్ను ఈసడించుకునేవాళ్ళకు థాంక్స్లు.
అతడ్ని ఇష్టపడ్డం నా ఇష్టం.
శివ తెలుగు సినిమాకి బ్యాక్ గ్రవుండ్ మ్యూజిక్ విలువను తెలియచెప్పింది నిజమే కానీ శివలో చాలా సన్నివేశాల్లో సవుండ్ ఎంత ప్రభావం చూపుతుందో మరికొన్ని చోట్ల నిశ్శబ్దం కూడా అంతే ప్రభావం చూపుతుంది.
ఎక్కడ ఏ శబ్దం అవసరమో ఎక్కడ ఎంత నిశ్శబ్దం అవసరమో ఖచ్చితంగా తెలిసిన వర్మ తన సినిమాల ఎంపికలో గత పదిహేనేళ్లుగా మాత్రం ఏది మంచో ఏది కాదో తెలుసుకోలేకపోయాడు.
తన కేరీర్ లో చెరపాల్సిందాన్ని చెరుపుకోలేదు.
అదొక్కటే లోపం.
శివకు రి రిలీజ్ ఉన్నట్టే వర్మకూ రి రిలీజ్ ఉంటే బావుండ్ను….
Share this Article