హమ్మయ్య, కరోనా గండం నుంచి ఇక బయటపడ్డట్టే… ప్రింట్ మీడియా, అంటే పత్రికలు మెల్లిగా కరోనా కాలపు కష్టాల నుంచి గట్టెక్కుతున్నట్టే… ఏ పత్రిక చూసినా బోలెడు యాడ్స్, పేజీలకొద్దీ కనిపిస్తున్నయ్… ఇక జర్నలిస్టులు, ఇతర పత్రికా సంస్థల సిబ్బంది కొలువులకు ఢోకా లేనట్టే….. అని ఈమధ్య ఓ మిత్రుడు తన జ్ఞానాన్ని నామీద గుమ్మరించాడు… నవ్వొచ్చింది… ఈ రంగంలో రూపాయి ఖర్చుకు పదిరూపాయల లాభాన్ని తవ్వుకునే టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపే ఊగుతోంది… 60 నుంచి 70 శాతం ఆదాయం కోల్పోయింది… ఖర్చుల్ని తగ్గించుకునే పనిలో పడింది… ఇక వేరే పత్రికల గురించి చెప్పడానికి ఏముంది..? అనేక పత్రికలు తమ ఎడిషన్లను క్లోజ్ చేసుకున్నయ్… ఆఫీసులు మూసేసినయ్… న్యూస్ ప్రింట్ ఆర్డర్లు తగ్గించుకున్నయ్… డిజిటల్ ఎడిషన్ వైపు వేగంగా అడుగులేస్తున్నయ్… పెద్ద పెద్ద మీడియా ప్లేయర్లు సైతం ఇప్పుడు డిజిటల్ రాగాన్నే ఆలపిస్తున్నారు… ప్రాంతీయ భాషల్లోకి కూడా జొరపడుతున్నారు…
ఇది రియాలిటీ… ఒకప్పుడు కార్డు టారిఫ్ (వాళ్లు ఖరారు చేసుకున్న యాడ్ రేట్స్)కు పైసా తగ్గని ఈనాడే అడ్డగోలు రిబేట్లు ఇస్తోంది… అదొక అనివార్యత… టైమ్స్ కూడా భారీ రిబేట్లు ఆఫర్ చేస్తోంది… ఇక సర్క్యులేషన్ విషయానికి వస్తే, ఇప్పుడు ఎవడికీ సర్క్యులేషన్ మీద ధ్యాస లేదు, పెంచుకోవాలనే తహతహ లేదు… ఇప్పుడు ఫీల్డ్‌లో ఎవరైనా ఎక్కువ కాపీల కోసం ఆలోచిస్తున్నాడంటే అది జస్ట్, మూర్ఖత్వమే… మన తెలుగులో ప్రింట్ మీడియాను ఓసారి పైపైన పరిశీలించినా సరే, చిన్న పత్రికలు కొన్ని, నామ్‌కేవాస్తే ప్రభుత్వ యాడ్స్ కోసం కొన్ని కాపీలు ప్రింట్ చేస్తూ, వాట్సప్ ఎడిషన్లు, వెబ్ ఎడిషన్లకు పరిమితమవుతున్నయ్… లేదంటే ఫ్రాంచైజీ ఇచ్చేసి, వచ్చిన కాడికి డబ్బులు ఏరుకుంటున్నయ్… (ప్రభుత్వ ప్రకటనలు, ఆ రేట్లు, చూపే సర్క్యులేషన్ పెద్ద దందా…) మరి పెద్ద పత్రికలు..? ఓసారి ఇది చూడండి…
Ads
ఈ దేశంలో టాప్ టెన్ పత్రికల్లో ఒకటిగా చెప్పబడిన ఈనాడు తన ముంబై, న్యూఢిల్లీ ఎడిషన్లకు సంబంధించి ఏబీసీ సభ్యత్వాన్నే రద్దు చేసుకుంది… అంటే అక్కడ మాకు ఏమీ లేదు, ఆ ఎడిషన్ల పేరిట సభ్యత్వమూ వద్దు అని చెప్పేసింది… (ఎడిషన్లవారీగా సభ్యత్వ ఫీజు కట్టాల్సి ఉంటుంది, ఏమీ లేనప్పుడు ఆ ఎడిషన్లకు ఇక సభ్యత్వ ఫీజు దేనికి అనుకుని తనే రద్దు చేసుకుంది…) అసలు ఈ కరోనా కారణంగా ఏబీసీ 2021 ప్రథమార్థం లెక్కల మదింపునే జాతీయ స్థాయిలో రద్దు చేసేసుకుంది… బహుశా ఈ జూలై-డిసెంబరు కాలానికి మదింపు పునరుద్ధరించే ఆలోచనలో ఉన్నట్టుంది… ఈనాడు తన ఎడిషన్లకు మంగళం పాడటం అంటే, ఇక ఈ సర్క్యులేషన్ పోటీలు, కాపీలు పెంచుకునే తాపత్రయం నుంచి బయటపడ్డట్టే… క్రమేపీ తనను తాను కుదించుకుంటోందన్నమాట… ‘నష్టదాయక ఎడిషన్ల’ గుర్తింపు, మూసివేత ఇకపై అన్ని పత్రికలకూ ఓ నిరంతర ప్రక్రియే…
ఇప్పటికే జనానికి పత్రిక ఫిజికల్‌గా ఇంటికి తెప్పించుకోవడం మీద ఆసక్తి చచ్చిపోయింది… అన్నీ చద్దివార్తలు, డప్పులు… నాణ్యత లేదు, పైగా కవర్ ప్రైస్ పెరిగింది, ఇంకా పెంచితే కుదిరేట్టు లేదు… సోషల్ మీడియా, వెబ్ మీడియా ప్రతిక్షణం వార్తల్ని ప్రసారం చేస్తోంది… టీవీలకన్నా వేగంగా…! టీవీవాడు స్క్రోలింగ్ వేసేలోపు, వాడికి ఏదో వీడియో ఫీడ్ దొరికేలోపు సోషల్ మీడియా కుమ్మిపారేస్తోంది… ఇక తెల్లారేదాకా ఆగి ఆ చద్ది వార్తల్ని, ఫోటోల్ని పత్రికలో చూడాలని, చదవాలని ఎవడికి ఉంటుంది..? అదీ ప్రింట్ మీడియాకు ఇప్పుడు ప్రధానశాపం… ‘‘క్రెడిబులిటీ’’ అనే ఓ బ్రహ్మ పదార్థాన్ని, భ్రమపదార్థాన్ని కూడా ఇప్పుడెవడూ నమ్మడం లేదు… ఎందుకంటే, క్రెడిబులిటీకి పత్రికలు ఇప్పుడు అనేక మైళ్ల దూరంలో ఆగిపోయాయి కాబట్టి… సో, ప్రింట్ మీడియా గట్టెక్కలేదు… గడ్డుకాలంలోనే ఊపిరాడక కొట్టుకుంటోంది… ఇదీ రియాలిటీ…!!
Share this Article