.
నో, నో, ఈ ప్రచారాలన్నీ అబద్ధం… ఈనెల 18 జూనియర్ ఎన్టీయార్ పొలిటికల్ ఎంట్రీ అనేది అసత్యం… ఉత్త ప్రచారమే… ‘ఊరు- వాడ’ పేరుతో నిర్వహించనున్న కార్యక్రమానికి జూనియర్ ఎన్టీయార్‌కూ ఏ సంబంధం లేదు… అంతేకాదు, జూనియర్ ఫ్యాన్స్ అసోసియేషన్‌కు అధికారికంగా ఎలాంటి కార్యవర్గమూ లేదు, ఏం చెప్పినా జూనియర్ తనే స్వయంగా చెబుతాడు… లేదా తన టీమ్ చెబుతుంది… అంతే…
…. ఇదీ జూనియర్ ఎన్టీయార్ టీమ్ ప్రకటన… గుడ్… ఐతే ఇక్కడ కొన్ని సందేహాలు బ్రదర్… మరి ఈ ‘ఊరు- వాడ’ కార్యక్రమం ఎవరిది..? జూనియర్ పేరు ప్రచారంలోకి ఎలా వచ్చింది..? ఎవరు తీసుకొచ్చారు..? జూనియర్‌కు పొలిటికల్ యాంబిషన్స్ ఉన్నాయనేది నిజం, ప్రస్తుతం ఏపీలో మంచి పొలిటికల్ స్పేస్ ఉందనేదీ నిజం, తనకు ఇది సరైన సమయమనేదీ నిజం… ఎందుకు వెనుకంజ వేస్తున్నట్టు..?
Ads
ఇప్పుడప్పుడే రాజకీయాల్లోకి రాకూడదు అనేదే తన నిర్ణయమైతే, దాన్ని స్వయంగా చెబితే బాగుండేది ఏదైనా వీడియో ద్వారా… సరే, తన ఇష్టం కానీ… NTR టీమ్ ఖండన ప్రకటన చూశాక సీఎం విజయ్ రాజకీయ రంగప్రవేశానికి ముందు ఏం జరిగిందో గుర్తొచ్చింది… నేరుగా రాజకీయాల్లోకి రాలేదు, ప్రజాసేవ పేరిట పునాదులు వేసుకుంటూ వచ్చాడు… ‘గ్రాస్ రూట్’ లెవల్ ప్లానింగ్….

నిజానికి విజయ్ తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్ మొదట్లో అభిమాన సంఘాల ద్వారా ‘ఆల్ ఇండియా దళపతి విజయ్ మక్కల్ ఇయక్కం’ అనే పేరుతో ఒక వేదికను ఏర్పాటు చేశాడు… ఆ తర్వాత విజయ్ దానిని రద్దు చేయించి, సొంతంగా ‘దళపతి విజయ్ మక్కల్ ఇయక్కం’ (TVMI – Thalapathy Vijay Makkal Iyakkam) అనే పేరుతో ప్రజాసేవ కార్యక్రమాలను ప్రారంభించాడు. ఏదైనా సరే, తను చెప్పినట్టు నడవాలని శాసించాడు.
అదే వేదికను పునాదిగా చేసుకుని, జనంలోకి వెళ్లి, తరువాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి, తమిళగ వెట్రి కళగం (TVK – Tamizhaga Vettri Kazhagam) అనే పార్టీని స్థాపించాడు… గోల్ కొట్టాడు… ఇప్పుడు అన్నామలై కూడా అదే బాటలో, అదే తరహాలో ప్రయాణిస్తున్నాడు…
వీటితో సంబంధం లేదు గానీ, ఏదో బాదరాయణ సంబంధం ఉన్నట్టుగా అనిపించే మరో సరదా సినిమా ముచ్చట ఉంది… జూనియర్ ఎన్టీయార్ భార్య పేరు లక్ష్మి ప్రణతి… ఆమె కాబోయే ఏపీ సీఎం… (విజయ్ – త్రిష పోలిక ఇక్కడ అక్కర్లేదు… జయలలిత- ఎంజీఆర్ ప్రస్తావన అస్సలు అక్కర్లేదు…) మరి ఆమె ఏపీ సీఎం ఏమిటి అంటారా..?
యామినీ ఈఆర్ లీడ్ రోల్‌లో నటిస్తున్న మూవీ పేరు ‘క్వీన్’… (కంగన రనౌత్ ‘క్వీన్’తో సంబంధం లేదు) ఇందులో ఓ పవర్ ఫుల్ పాత్రను రమ్యకృష్ణ పోషించనుంది… ఆమె పాత్ర పేరు లక్ష్మి ప్రణతి… సినిమాలో ఏపీ సీఎం పాత్ర పేరు ఇది… రమ్యకృష్ణ గతంలో కూడా ‘క్వీన్’ పేరుతోనే వచ్చిన ఓ వెబ్ సీరీస్‌లో తమిళనాడు సీఎం జయలలితగా నటించింది…

2006-10 మధ్యకాలంలోని రియల్ ఇన్సిడెంట్స్, రియల్ కేరక్టర్స్ స్పూర్తితో ఓ ఫిక్షనల్ స్టోరీ తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు రతన్ రిషి చెబుతున్నాడు… నిజానికి ఆ కాలంలో ఏపీలో (అప్పటి ఉమ్మడి రాష్ట్రం) పెద్ద విశేషమైన రాజకీయ పరిణామాలేమంటే… చిరంజీవి ప్రజారాజ్యం స్థాపన, 2009 శాసనసభ ఎన్నికలు, వైఎస్ రెండోసారి గెలుపు, మరణం, తెలుగు రాజకీయాల్లో సంక్షోభాలు, మలుపులు… ఎగిసిన తెలంగాణ ఉద్యమం…
ఆ కాలంలోని పరిణామాలే తెలుగు జాతి చరిత్రను మార్చాయి… కానీ ఈ మొత్తం ఎపిసోడ్లలో ఏపీ రాజకీయాల్లో పవర్ ఫుల్ లేడీ లీడర్ పాత్ర ఏమీ లేదు… మరి రియల్ ఇన్సిడెంట్స్, రియల్ కేరక్టర్లు ఏముంటాయబ్బా..! పైగా ఫస్ట్ లుక్‌లో ఏపీ అసెంబ్లీ బొమ్మనూ పెట్టారు..!!
Share this Article