ఏమో అనుకున్నాం… హమ్మయ్య అయిపోయింది అనుకున్నాం… తలస్నానం కూడా కొందరు చేశారు… ఒకాయన తిలోదకాలు అంటుంటే వారించాను… కానీ కరోనా ప్రమాదం దూరం కాలేదు… సారీ, కార్తీకదీపం ప్రమాదం పొంచే ఉన్నది… బహుపరాక్… మళ్లీ దానికి ఏవో వేరియంట్ పుట్టుకొచ్చి, కేరళ నోరోవైరస్‌లాగా కలవరం కలిగించవచ్చు… అవునూ, కార్తీకదీపం ఒరిజినల్‌గా ఉత్పత్తయింది కేరళ వుహాన్ లేబులోనే కదా… దానికి తెలుగు వేరియంటుకు మనం బలైపోయాం…
ఇప్పటిదాకా సోకింది ఒమిక్రానే కదా… నాలుగుసార్లు తుమ్మితే, నలభైసార్లు ముక్కుచీదితో, కళ్లు తుడుచుకుని మొహం కడుక్కుంటే కరోనా పని ఖతం అనుకుంటున్నాం… కానీ మళ్లీ ఓ స్ట్రాంగ్ డోస్ గనుక చైనావాడు మళ్లీ వదిలితే, మళ్లీ కల్లోలమే… కాకపోతే భస్మాసుర హస్తంలా అది వాడినే కబళించేస్తోంది కాబట్టి విష్ణుదేవా రక్ష రక్ష అని మొత్తుకుంటున్నాడు… కానీ కార్తీకదీపం సోకితే నిష్కృతి కూడా ఉండదు…
ఎందుకంటే..? ఏడాదికాలంగా సదరు దర్శకుడు ఎవరో గానీ ప్రేక్షకులను చావదొబ్బాడు… ఎంచక్కా ఒక దీప, ఒక కార్తీక్, ఒక మోనిత, ఒక లవ్వు, ఒక అనుమానప్పక్షి, ఓ సతీ ప్రేమి విశ్వనాథ్, ఇద్దరు ముదురుపిల్లలు, అందమైన అత్త, ఎటూ కొరగాని మామ… ఇలా హాయిగా నడుస్తున్న సీరియల్‌ను హీరోహీరోయిన్లను చంపేసి, రేటింగులు కూడా చచ్చిపోయాక, మళ్లీ వాళ్లను బతికించి, బతికిన ఆ ఆత్మలతో కథ ఎలా నడపాలో తెలియక… తను జుత్తు పీక్కుంటూ, ప్రేక్షకులను కూడా గొరిగిన మహానుభావుడు…
Ads
సరే, అయిపోయింది కదాని ఊపిరి పీల్చుకునేలోపు… అయిపోలేదు, మిమ్మల్ని వదిలిపెడతానా అంటూ అదేదో టీవీ ప్రోగ్రాంలో ప్రేమి విశ్వనాథ్ గ్లిజరిన్ లేకుండానే అలవాటైన రీతిలో కన్నీళ్లు పెట్టుకుని… త్వరలో వస్తా అని బెదిరించింది… ఇది సెకండ్ ప్రమాద హెచ్చరిక అయితే… మొన్న సీరియల్ ఒడిశిపోయిన చివరి (?) ఎపిసోడ్‌లో శుభం కార్డు వేయకుండా, మళ్లీ కలుస్తాం అంటూ కార్తీక, దీప కలిసి మూడో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు…
ఇన్నిరోజులూ తలతిక్కగా కథను నానా వంకర్లూ తిప్పిన దర్శక మహాశయుడు చివరి ఎపిసోడ్ అనగా క్లైమాక్స్‌ను కూడా ప్రేక్షకుల మీదకు మహా కసిగా వదిలాడు… ఆడ విలన్ మోనితను ఆడ హీరోయిన్ దీప కాల్చేస్తుంది… తుపాకులు, రివాల్వర్లు, బాంబులు, కాల్పులు, పేలుళ్లు మన ఆడ సీరియళ్లలో, అంటే ఫ్యామిలీ సీరియళ్లలో కామనే కదా… ఆ కాల్పుల నుంచి సినిమా విలన్‌లా బయటపడిన మోనిత మరింత కసిగా ఓ బాంబును దీపిక కారులో పడేస్తుంది… కాలకేయ తరహాలో నవ్వుతుంది…
చనిపోతున్నాను కార్తీక్ అంటూ దీప తెలుగు సినిమా సెంటిమెంట్ సినిమాలో హీరోయిన్ తరహాలో ఏడుస్తూ (సీరియల్ అంతా ఏడుపే కదా…) హీరోకు వీడ్కోలు పలికితే… హీరో కూడా బాలకృష్ణ తరహాలో చావైనా, బతుకైనా నీతోనే అంటాడు… ఇద్దరూ మళ్లీ కలుద్దాం అని వెళ్లిపోతారు… అంటే ఇక్కడ కొన్ని ప్రశ్నలు… ఆ దర్శక ఘనుడికి…
- ఇంతకీ దీప బతికిందా..?
- అసలు కథను నెక్స్ట్ జనరేషన్‌లోకి తీసుకుపోయి, గడియారం వెనక్కి తిప్పావు కదా, వాళ్ల రీఎంట్రీ లేకుండా కథకు ముగింపెలా ఇచ్చావు..?
- హిమపై శౌర్యకి కోపం పోయిందా లేదా..? పోతే ఎలా పోయింది..?
- నిరుపమ, శౌర్య… హిమ, ప్రేమ్ పెళ్లిళ్లు జరిగాయా..?
- చారుశీల ఏమైంది..? దీప అనారోగ్యానికి తానే కారణం అని పండరి తెలుసుకుందా..?
- తరచూ కనిపిస్తూ, మాయమవుతూ ఉండే దుర్గ జైలులోనే ఉండిపోయాడా..?
- సౌందర్య ముసలిదానిలా కనిపిస్తోంది, అంటే అర్థమేమిటి..?
సమాధానాలు కావాలంటే… కార్తీకదీపం సీక్వెల్ తీయాలి… జనం మీదకు వదలాలి… తప్పదు, బ్రహ్మముడి సీరియల్ గనుక క్లిక్ కాకపోతే, కార్తీకదీపం ముడినే మరింత కొత్తగా, బలంగా బిగిస్తాడు దర్శకుడు… అసలు సీరియల్ కథలకు కూడా రాష్ట్ర స్థాయిలోనైనా ఓ టీవీ సెన్సార్ బోర్డు ఏర్పాటు చేస్తే బాగుండు… #యాణ్నుంచి వస్తర్ర భయ్…
Share this Article