టీవీ9 నుంచి వెళ్లిపోయిన మురళి మళ్లీ వచ్చాడట… అవున్నిజమే… వెళ్లిపోయిన మరికొందర్ని కూడా రమ్మంటున్నారట… అవున్నిజమే… కానీ ఎందుకు..? అనవసరంగా వర్కర్లను పంపించేశామనే ఆత్మమథనం ఏమైనా ఉందా యాజమాన్యంలో..? ఇప్పటిదాకా అనవసరంగా కొందర్ని నమ్మి, టీవీ9ను రెండో ప్లేసుకు పడేశామా అనే బాధ ఉందా..? చక్కదిద్దుకుంటోందా..? నిజానికి ఇదేనా చక్కదిద్దుకునే మార్గం..? ఇంతకుమించి యాజమాన్యానికి సమర్థ నిర్వహణ దిశలో ఇంకేమీ చేతకాదా..? రకరకాల కారణాలతో టీవీని వీడివెళ్లిపోయినవాళ్లు అదే వ్యవస్థ నడుస్తుంటే మళ్లీ ఎందుకు వస్తారు..? ఏం మార్పులు జరిగాయని రావాలి..?
ఈ ప్రశ్నలన్నీ ముప్పిరిగొంటుంటే, ఓ మిత్రుడి నుంచి ఓ ప్రశ్న… మీరు సినిమాలు, టీవీ సీరియళ్ల రేటింగ్స్ గురించి రాస్తుంటారు కదా అప్పుడప్పుడూ… అసలు న్యూస్ చానెళ్ల పరిస్థితి ఏమిటి..? ఇదీ ప్రశ్న… నిజానికి టీవీ రేటింగ్స్ అంటేనే ట్యాంపరబుల్… మీటర్లు ఉన్న ఇళ్లు మూణ్నాలుగు దొరికితే చాలు, రేటింగ్స్ ఝయ్ అని పైకి లేస్తాయి… బార్క్ రేటింగ్స్ పెద్ద నమ్మబుల్ కాదు… కానీ విశ్లేషణలకు ఏదో ఓ దిక్కుమాలిన ప్రామాణికం ఉండాలి కదా… వాటిని తీసుకుంటుంటాం…
సరే, వాటినే పరిగణనలోకి తీసుకుందాం… కరోనా తరువాత న్యూస్ చానెళ్ల బార్క్ రేటింగ్స్ కొన్నాళ్ల క్రితం స్టార్టయ్యాయి… తెలుగు చానెళ్ల సంగతికొస్తే ఇన్నేళ్లూ ఫస్ట్ ప్లేసులో ఉండి, కోట్ల రూపాయల యాడ్స్ కుమ్మేసిన టీవీ9 సెకండ్ ప్లేసులోకి జారిపోయి, ఎన్టీవీ ఫస్ట్ ప్లేసులోకి వచ్చింది… కారణాల లోతుల్లోకి వెళ్లడం లేదు ఇక్కడ… కానీ మళ్లీ టీవీ9 తెలుగు చానెల్ పికప్ కాలేదు అప్పటి నుంచీ… మిగతా గ్రూపు చానెళ్ల సంగతి ఇక్కడ అనవసరం…
Ads
జనం ఈటీవీ బూతుల షో జబర్దస్త్‌ను తిట్టుకుంటూనే చూస్తుంటారు… టీవీ9ను కూడా అలాగే తిడుతూనే చూస్తుంటారు… అదిప్పుడు బ్రేక్ అయిపోయింది… కీలక స్థానాల్లో ఉన్నవాళ్లకే భాష తెలియదు, సబ్జెక్టు తెలియదు, ప్రజెంటేషన్‌లో తిక్క ధోరణులు… అదేనా టీవీ9 బలహీనత..? హైదరాబాదులో మాత్రం ఈరోజుకూ టీవీ9 చానెలే ఫస్ట్ ప్లేసు… దాన్ని కొట్టినవాడు లేడు… మరి మిగతావి..?
నిండా పసుపు రంగు పూసుకుని, పోతరాజులాబజారులో నిలబడి, పచ్చ కొరడాతో కొట్టుకునే టీవీ5 నాలుగో ప్లేసులోకి జారిపోయింది… ఒకప్పుడు ఎన్టీవీ, టీవీ9తో పోటీపడేది ఫాఫం… ఐనా అందులో డిబేట్లు చూస్తుంటేనే ఓ కంపరం… (పాపం శమించుగాక)… కాస్త ప్రొఫెషనలిజం ఒంట బట్టించుకుంటే మళ్లీ రెండో ప్లేసు కోసం కొట్లాడే చాన్సుంది… కానీ దానిపట్ల ఆసక్తి లేనట్టుంది… ఏదో ఆ బాబు గారి సేవలో పునీతమైతే సరి అనే ఆత్మసంతృప్తి…
విచిత్రంగా ఏబీఎన్ అయిదో ప్లేసులో ఉండటం… అంత పెద్ద సాధనసంపత్తి ఉన్న సాక్షి టీవీ మరీ ఆరో ప్లేసులోకి ఢామ్మని పడిపోయింది… మరీ లైగర్ సినిమా అయిపోయింది దాని బతుకు… జగన్ పత్రికను, టీవీని పట్టించుకోకుండా వదిలేశాడు కదా, అదీ ఫలితం… పైగా టీవీ5 యెల్లో చానెల్ అయితే, ఏబీఎన్ దాని తోక అయితే… సాక్షి వైసీపీ… తేడా ఏముంది..? ఈనాడు పేరుకు పెద్ద పత్రిక, మోతుబరి మీడియా సంస్థ… కానీ దాని న్యూస్ చానెళ్లను ఎవడూ దేకడు… టేబుల్ చూస్తే అర్థమవుతుంది… రాత్రి 9 గంటలకు వచ్చే బులెటిన్ మాత్రమే బాగుంటుంది… అంతే… అది ఈటీవీ వినోద చానెల్‌ను కూడా ఆక్సిజెన్‌లా కాపాడుతోంది… హెచ్ఎంటీవీ, రాజ్‌న్యూస్, ఐన్యూస్ ఉన్నాయంటే ఉన్నాయి లిస్టులో…!!
మరి టీవీలో చానెళ్లు మార్చేకొద్దీ బోలెడు కనిపిస్తుంటాయి కదా… వాటి మాటేమిటి అంటారా..? అవి బార్క్ రేటింగులకు అతీతం… వాటికీ యూట్యూబ్ చానెళ్లకూ పెద్ద తేడా ఏమీ ఉండదు… అలాగని బార్క్ జాబితాలో ఉన్నవి తోపులేమీ కావు… పైన చెప్పుకున్నాం కదా…!!
Share this Article