తెలంగాణ సిద్ధించాక మస్తు మారిపోయింది మామా అన్నాడో మిత్రుడు మొన్నొకసారి… వాడి అల్పసంతోషం చూసి కాస్త ఆనందం వేసినా, తెలంగాణ భాష పట్ల, సంస్కృతి పట్ల వాళ్లలో పేరుకున్న వెక్కిరింపుతనం అలాగే ఉందిరా నాయనా అని చెప్పాలనిపించింది… ఆ ఒరిజినాలిటీ దాక్కునే ఉందిరా, బయటపడుతూనే ఉంటుంది అనాలనిపించింది… కానీ వాడు చెప్పనిస్తేగా… ‘‘మస్తు మారిపోయింది మామా, మన పాటకు కిరీటాలు, మన మాటకు మకుటాలు, మన భాషకు గౌరవం, మన సంస్కృతికి, మన కట్టుకు, మన బొట్టుకు విలువ పెరిగిపోయాయి మామా’’ అని చెబుతూ పోతున్నాడు… కేసీయార్ భీకరరూపాన్ని, ఉక్కుపాదాన్ని తలుచుకుని మీడియా, ఆ గ్యాంగులు కాస్త అదుపాజ్ఞల్లో ఉందిగానీ అవేమైనా పూర్తిగా మారాయా..? మారుతాయా..? అవే కాదు..? ప్రతిదీ అంతేగా… ప్రత్యేకించి టీవీ చానెళ్లు, ఆ నీచ స్థాయి సీరియళ్లు, వాటి దర్శకులు మరీ సిగ్గూశరం లేకుండా అప్పుడప్పుడూ తెలంగాణ భాష పట్ల వెక్కిరింపు ధోరణిని ప్రదర్శిస్తూనే ఉంటారు… అలాంటిదే ఒకటి అనుకోకుండా కంటపడింది… ఇలాంటివి ఎన్నో… అంతటా ఆంధ్రమే పెత్తనం చేసే చానెళ్ల యాజమాన్యాలు చెప్పాలి…
జీతెలుగు అనబడే ఓ వినోద చానెల్లో వచ్చే సీరియళ్లు అన్ని చానెళ్ల సీరియళ్లలాగే పరమనీచమైన అభిరుచితో సా-గు-తూ ఉంటయ్… సరే, చూసేవాడు చూస్తాడు… కానీ ప్రేమ ఎంత మధురం అనే ఓ సూపర్ చెత్తా సీరియల్ వస్తుంది ప్రైమ్ టైమ్‌లో… ఆ రచయిత, ఆ దర్శకుడి ఇష్టం… కథ అష్టవంకర్లు తిరుగుతూ, ప్రేక్షకులు ఎర్రి ఎదవలు సుమా అని ప్రతి సీన్లోనూ పరోక్షంగా వెక్కిరిస్తున్నట్టుగానే ఉంటుంది… నటుల ప్రతిభ గురించి తప్పుపట్టడం లేదు, ఎక్సలెంట్ యాక్టర్స్, ఎటొచ్చీ ఆ దర్శకుడు ఎవరో, ఆ నిర్మాత ఎవరో, ఆ డైలాగ్ రైటర్ ఎవరో… వాళ్లలో కరడుగట్టిన తెలంగాణ వ్యతిరేక ధోరణి గురించే ఇది… అప్పట్లో మనమే ఓ పోస్టులో ముచ్చటించుకున్నాం… భజరంగదళ్‌ను చిచోరా గ్యాంగుగా చూపించారు… మిగతా అన్ని పాత్రలు శుద్ధమైన ఆంధ్రాన్ని మాట్లాడతయ్… ఈ చిచోరా గ్యాంగు మాత్రం తెలంగాణ భాషలో మాట్లాడుతుంది… సో, ఈరోజుకూ చిల్లర రౌడీలకు, వెకిలిపాత్రలకు తెలంగాణతనాన్ని ఆపాదించే నీచమైన కల్చర్‌ను ఈ చెత్తా దర్శకులు వదులుకోలేదు అన్నమాట… ఆ అడ్డమైన డైలాగులు రచయిత ఎవడో గానీ, వాడికి తెలంగాణ భాష కూడా రాదు, మధ్యమధ్యలో నాయాల్ది వంటి ఆంధ్రా తిట్లనూ కలిపేసి, నానా పెంట చేసి వదిలాడు ప్రేక్షకుల మీదకు…
Ads
ఇదే టీవీలో త్రినయని అని మరో సీరియల్ వస్తుంది… అందులో కూడా ఓసారి హీరోయిన్ రాత్రిపూట, బజారులో వర్షంలో తడుస్తూ ఉంటుంది… కథ ఏమైనా గానీ… అక్కడికి ఓ రౌడీ గ్యాంగ్ వస్తుంది, అదీ తెలంగాణ భాషనే అందుకుంటుంది… సీరియల్లో అన్ని పాత్రలూ మంచి ప్యూర్ ఆంధ్రాన్నే మాట్లాడుతుంటయ్… ఇలా చాలా సీరియళ్లలో చాలా పాత్రలు… అదే తెలంగాణ భాష పట్ల వెక్కిరింపు… హైదరాబాదులో బతుకుతూనే ఈ నేలను, ఇక్కడి జనాన్ని, ఇక్కడి కల్చర్‌ను గేలిచేసే బరితెగింపు… ఇప్పుడుంటే కేసీయార్ అన్నీ ఉడిగిపోయినట్టు వ్యవహరిస్తున్నాడు గానీ… ఇవన్నీ పట్టించుకునేదెవరు..? తాజాగా నిన్న రాత్రి మరో ఎపిసోడ్… అదే ప్రేమ ఎంత మధురం సీరియల్… యాదగిరి అని ఓ పాత్ర, కాస్త చిచోరా కేరక్టర్… ఇంకేముంది..? తెలంగాణ భాషను పెట్టేశాడు ఆ మెంటల్ దర్శకుడు… ఎంత కసిగా ఉన్నాడో తెలంగాణతనం మీద… హీరోయిన్ పేరెంట్స్ బస్తీలో బతికినా సరే ఆంధ్రమే మాట్లాడతారు, కానీ చిచోరా పాత్రలు అనగానే యాదగిరి, నర్సింహ వంటి పేర్లు పెట్టేసి, చెత్తా డైలాగులు రాసేసి, తమలో దాగిన కసినంతా బయటపెట్టుకుంటూనే ఉన్నారు… సినిమాలకు కాస్తోకూస్తో కంట్రోల్, భయం ఉంటది… టీవీలకు, సీరియళ్లకు ఏముంది..? అదే వీళ్ల తెగింపు కారణం… అరే, ఏందిరభయ్… బొక్కలిరుగుతయ్ బిడ్డా అని అదే భాషలో చెప్పేవాడు లేకపోవడం కూడా…!!
Share this Article