మీరు ప్రపంచంలోని ఏ మూలలో ఉన్న ఏ దేశమైనా వెళ్లండి…. అక్కడ ఓ పంజాబీ దాబా, ఓ గుజరాతీ వ్యాపారి ఉంటాడని ఓ అభిప్రాయం వినిపిస్తూ ఉంటుంది… వాళ్లు ఉంటారో ఉండరో గానీ… ప్రపంచంలోని ఏ దేశం వెళ్లినా సరే ఓ కేరళైట్ ఉంటాడు… డిగ్నిటీ ఆఫ్ లేబర్… ఏ పనైనా చేస్తాడు… ఊరికి, కుటుంబానికి దూరంగా ఏళ్ల తరబడీ బతికేస్తాడు… ఓ సగటు కేరళీయుడికి ప్రపంచమంటే ఓ కుగ్రామం… నిజమైన గ్లోబల్ మ్యాన్…
ఓ అంచనా ఏమిటంటే..? 207 దేశాల్లో కేరళైట్ల ఉనికి ఉంది… కేరళ ప్రభుత్వ పోర్టలే చెబుతుంది ఈ నిజాన్ని… గల్ఫ్ దేశాలకు సగటు కేరళీయుడికి రెండో ఇల్లు… కాగా దక్షిణ పసిఫిక్ సముద్రంలోని ఓ చిన్న ద్వీపదేశం NIUE లో కూడా కేరళైట్స్ ఉన్నారు… ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామో తెలుసా..? లక్షల మంది ఇతర దేశాల్లో పనిచేస్తున్నారు కదా… కొన్నిసార్లు అక్కడ మరణిస్తే శవాన్ని కేరళకు తీసుకురావడం ఓ పెద్ద ప్రయాస… ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవు… పనిచేయించుకునే యజమానులు ఎంత వేధించినా, పీడించినా, హింసించినా ఆ కథలు బయటికి రావు… కానీ..?
Ads
ఇప్పటికీ ఓ ఆశ్చర్యం వెంటాడుతూనే ఉంది… అదే ఇజ్రాయిల్‌లో హమాస్ ఉగ్రవాదుల రాకెట్ దాడిలో మరణించిన సౌమ్య సంగతి..! ఇజ్రాయిల్‌లో వేలమంది కేరళైట్లు పనిచేస్తున్నారు,.. వ్యవసాయ పనుల్లోనే కాదు, ఇళ్లల్లో నర్సింగ్, పనిమనుషులుగా కూడా పనిచేయడానికి వెళ్తుంటారు… సౌమ్య కూడా తొమ్మిదేళ్ల తన బాబును భర్త దగ్గర వదిలేసి గాజా సరిహద్దుల్లోనే ఏడేళ్లుగా ఓ ఇంట్లో పనిచేస్తోంది…
ఓ ముసలావిడకు సౌమ్యే అధారం… త్వరలోనే కేరళకు వాపస్ వెళ్లిపోవాలని కూడా నిర్ణయించుకుంది… ఆమె పనిచేసేది ఓ పాత ఇల్లు… నిజానికి సరిహద్దుల్లోని ప్రతి ఇంటిలోనూ పాలస్తీనా బాంబు దాడుల నుంచి రక్షణకు ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంది… లేదంటే, సైరన్ మోగగానే దగ్గరలోని ప్రభుత్వ కేంద్రానికి చేరుకోవాలి… హమాస్ ఉగ్రవాదులు ఉధృతంగా రాకెట్ల దాడి స్టార్ట్ చేసే సమయానికి సౌమ్య భర్త సంతోష్‌తో వీడియో కాల్ మాట్లాడుతోంది…
ఇజ్రాయిలీ రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ దాదాపు 90 శాతం రాకెట్లను మధ్యలోనే ధ్వంసం చేయగలదు… కానీ సౌమ్య దురదృష్టం ఏమిటంటే..? సైరన్ మోగగానే ప్రభుత్వ రక్షణ కేంద్రానికి తన యజమానురాలిని తీసుకుని వెళ్లలేకపోయింది… సరిగ్గా ఒక నిమిషం దూరంలో ఉంటుంది అది… అన్ని వందల రాకెట్లలో ఆ ఒక్కటీ ఈ ఇంటినే ధ్వంసం చేయాలా..? యజమానురాలు ఎలాగోలా బచాయించింది… సౌమ్య ప్రాణాలు కోల్పోయింది…
ఇక్కడ మనం చెప్పుకునేది ఏమిటంటే..? ఒక పనిమనిషి పట్ల అంతటి దయను, ‘విలువ’ను ఇజ్రాయిల్ ప్రదర్శించిన తీరు…!! ఆఫ్టరాల్, వేల మంది జీతం కోసం వస్తారు, పనిచేస్తారు, పోతారు, సోవాట్ అని వదిలేయలేదు… చాలా దేశాలు అలాగే వదిలేస్తాయి… పట్టించుకోవు… ఒక ఫైటర్ విమానానికి ఆమె పేరు పెట్టడం, స్వదేశానికి శవం పంపించడం, ఏకంగా ఆ దేశ కాన్సుల్ జనరల్ ఆమె అంత్యక్రియలకు వెళ్లి, ఆ కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించడం… అంతా ఆశ్చర్యమే… ఇప్పటికీ…!!
ఆమె మరణం విషయంలో ఆ దేశం నిర్లక్ష్యం గానీ, తప్పు గానీ లేవు కూడా…!! అయితే ఎంతసేపూ ఓట్ల లెక్కలు, సమీకరణాలు తప్ప మన నాయకులకు ఇంకేమీ పట్టవు కదా… ఒక వర్గానికి కోపం వస్తుందనే భయంతో… కేరళ సీఎం సైతం సౌమ్య మృతికి సంతాపం ప్రకటించాడే తప్ప ఖండించలేదు… ఒక సోషల్ పోస్టు పెట్టడానికి నానా ప్రయాసపడ్డాడు… సేమ్, అక్కడి కాంగ్రెస్ కూడా… ఒక పనిమనిషి మరణం పట్ల ఒక విదేశం స్పందించిన తీరుకూ, మరణించింది మన మనిషే అయినా సరిగ్గా ఖండించలేని మన నాయకుల అకశేరుక ధోరణికీ నడుమ ఎంత తేడా..?!
Share this Article