తెలంగాణ వచ్చాక తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ భాష మీద, యాస మీద, సంస్కృతి మీద వివక్ష, వెక్కిరింపు తగ్గిపోయినయ్… తెలంగాణ కళాకారులకు అద్భుతమైన ప్రాధాన్యం లభిస్తోంది… తెలంగాణ కథ, తెలంగాణ పాట, తెలంగాణ ఆట, తెలంగాణతనానికి మస్త్ విలువ పెరిగినయ్… దుమ్మురేపుతున్నారు, తెలంగాణ ప్రతిభ వెలుగుతోంది……….. ఇది కదా ఇప్పుడిప్పుడే అందరూ వ్యక్తపరుస్తున్న భావన… నిజమేనా..? తెలంగాణ భాష పట్ల ఏహ్యమైన వెక్కిరింపు, తూష్ణీభావం, చిన్నచూపు పోయినట్టేనా..? కోట్ల మందికి రీచయ్యే దిక్కుమాలిన తెలుగు టీవీ సీరియళ్ల మాటేమిటి..? ఇప్పటికీ తెలంగాణతనం లేని బుర్రలతో డైలాగులు రాయించి, ఆ పదాల్ని పలకలేని వాళ్లతో కృతకంగా పలికించి భాషను ఖూనీ చేయించడం లేదా..? జుత్తు పీక్కోకండి… మీకు ఉదాహరణ కావాలి, అంతే కదా… జీతెలుగు టీవీ చానెల్లో ప్రేమఎంతమధురం అనే ఓ సీరియల్ వస్తుంది… అది ఆ టీవీ ప్రోగ్రాముల్లోనే టాప్ సీరియల్…
నిజానికి కార్తీకదీపం వంటి దిక్కుమాలిన కథతో పోలిస్తే ఇది సూపర్ హిట్ కాగలిగిన కథ… అన్నిరకాల షేడ్స్ ఉన్నయ్… కానీ చెత్తాకథనం, దర్శకత్వలోపాలతో సగటు తెలుగు టీవీ సీరియల్ చేసేశారు… కాకపోతే ఈ సీరియల్లో నటీనటుల పర్ఫామెన్స్ ఎక్సలెంట్… ఐనా ఆ రేంజ్లోనే వాడుకునే తెలివితేటలు ఎవరికేడ్చాయి..? సరే, ఆ సీరియల్ మంచీచెడూ ఇక్కడెందుకులే గానీ… నిన్నటి ఎపిసోడ్… భజరంగ్ దళ్ కార్యకర్తలు ఎవరైనా చూశారో లేదో తెలియదు కానీ… మరీ చిల్లర గల్లీ రౌడీ పాత్రల్లాగా చిత్రించారు… ఈరోజు ఎపిసోడ్లో కూడా ఉంటారట… ప్రతి ప్రేమికుల రోజూ పార్కుల్లో ప్రేమికులను పట్టుకుని బెదరగొట్టి పెళ్లిళ్లు చేస్తుంటారు కదా… అదుగో దాన్ని బేస్ చేసుకుని రెండుమూడు సీన్లు వండారు సీరియల్లో… వండితే వండారు, మరి ఒకవైపు వాళ్లను బజారు రౌడీల్లా చిత్రించడం ఏమిటి..? ఆ పాత్రలకు కావాలని తెలంగాణ యాసను పెట్టడం ఏమిటి..?
Ads
అదే ధోరణి… విలన్లకు, క్షుద్రపాత్రలకు, కమెడియన్లకు కావాలని తెలంగాణ యాసను పెట్టడం… ఈ సీరియల్లో కూడా అంతే… అన్ని పాత్రలూ ప్యూర్ ఆ రెండున్నర జిల్లాల భాషలోనే మాట్లాడుతుంటయ్… ఇదుగో, ఈ కేరక్టర్లు రాగానే తెలంగాణ యాసలో మాట్లాడుతుంటయ్… పోనీ, ఆ డైలాగులైనా సరైన తెలంగాణంలో రాశారా..? అదీ లేదు… డైలాగులు రాసేవాడికి తెలియదు, నిర్మాతలకు, దర్శకుడికి, నటులకు అస్సలు తెలియదు… గట్లనా, గిట్లనా అని రాస్తే చాలు, ప్రతి పదానికీ ముందు గ గుణింతం చేరిస్తే చాలు, అదే తెలంగాణ భాష అనుకునే దరిద్రం ఇప్పటికీ… మళ్లీ అందులో కల్తీ… ఓ పాత్రధారి అంటుంటాడు… గా మాదిరి… నాయాల్ది… ఓహ్, ఏం తెలివిరా బాబూ… అవునూ, భజరంగదళ్ యాక్టివ్గా ఉందా ప్రస్తుతం..? ఆఫ్టరాల్, ఒక సీరియల్లో నాలుగైదు సీన్లకు ఈ కోణంలో పరీక్ష, విమర్శ అవసరమా అంటారా..? ఇలాంటి మెతుకులు చాలా కనిపిస్తున్నయ్… ప్రస్తుతం టీవీ, సినిమా ఇండస్ట్రీల్లో తెలంగాణతనం వెలిగిపోతున్నదహో అనే భ్రమల్లో ఉన్నవారికి ఒకటీరెండు గుర్తుచేద్దామని… అంతే…!!
Share this Article