పార్ధసారధి పోట్లూరి ………. ఇప్పటికే పలు సార్లు తమ ఆదాయపన్ను వివరాల మీద బిబిసికి నోటీసులు ఇచ్చింది ఆదాయపన్ను శాఖ ! మీ ఆదాయ, వ్యయ వివరాల మీద మీరే ఇంకోసారి సమీక్షించుకొని అన్నీ సరిగా ఉన్నాయని సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వమని… సహజంగానే బిబిసి ఆదాయపన్ను శాఖ ఇచ్చిన నోటీసులని విస్మరించింది ! అసలు నిజం ఇది అయితే బిబిసి మీద ఆదాయపన్ను శాఖ దాడులు చేసింది అనే వార్తని వ్యాపింప చేయడంలో అన్ని మీడియా హౌస్ లు విజయవంతం అయ్యాయి.
**************************
ఇక బిబిసి మాత్రం తాము ఆదాయపన్ను శాఖ అధికారులకి సహకరిస్తున్నామని కొద్ది రోజుల్లో అంతా కుదురుకుంటుంది అని ఆశిస్తున్నామని ఒక ప్రకటన విడుదల చేసింది ! అంతే కానీ …. పలు సార్లు ఆదాయపన్ను శాఖ ఇచ్చిన నోటీసులని తాము విస్మరించామని అందుకే అధికారులు సర్వే కోసం తమ కార్యాలయాలకి వచ్చారని నిజం చెప్పదు…
Ads
***************************
బిబిసి భారత ప్రధాని నరేంద్ర మోడీ మీద విడుదల చేసిన డాక్యుమెంటరీ మీద ప్రతీకారంగా ఆదాయపన్ను శాఖ దాడులు చేసింది అనే విషయాన్ని బాగా ప్రచారం చేసుకుంది కానీ ఆ డాక్యుమెంటరీ విడుదలకి ముందు ఎన్ని నెలల క్రితం ఆదాయపన్ను శాఖ ఎన్ని నోటీసులు ఇచ్చిందో చెప్పలేదు ! నోటీసులకి తాము ఎందుకు ప్రతిస్పందించలేదో చెప్పదు…
****************************
పత్రికా స్వేచ్చ- వాక్ స్వాతంత్ర్యం !
ఇలాంటి పడి కట్టు పదాలని తరుచూ మీడియా వాడుతూ ఉంటుంది. పత్రికా స్వేచ్చ అంటే పన్నులు ఎగవేసినా అడగకూడదు! అబద్ధపు వార్తలని వండి వార్చినా ప్రజలతో పాటు ప్రభుత్వాలు కూడా మౌనంగా ఉండాలి ! ఆదేమిటని అడిగే వాళ్ళని మా వాక్ స్వాతంత్ర్యం హరిస్తున్నాయి ప్రభుత్వాలు అంటూ ఎదురు దాడి చేస్తాయి.
ఆదాయపన్ను శాఖ సర్వే చేస్తున్న విషయం మీద బిబిసి విడుదల చేసిన ప్రకటనలో పత్రికా స్వాతంత్ర్యం మీద మరియు మానవహక్కుల సంఘాల మీద భారత ప్రభుత్వం అణచివేత ధోరణిని అవలంబిస్తున్నది అని పేర్కొంది. మానవ హక్కుల సంఘాలు అనే పదం వాడింది బిబిసి.
బిబిసికి ఒక సూటి ప్రశ్న !
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనే ఒక ప్రైవేట్ NGO ని ఎవరు స్థాపించారు ? ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కి నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయి ? ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఏమన్నా అన్ని దేశాల ఆమోదంతో స్థాపించిన సంస్థనా? ఇరాన్, ఇరాక్, లిబియా, ఆఫ్ఘనిస్తాన్, సిరియా, యెమెన్ లాంటి దేశాలలో ఉండేది ప్రజలు కారా ? వాళ్ళు మానవులు కాదా ? గత దశాబ్దాలుగా అక్కడ మానవ హక్కులని కాల రాచింది ఎవరు ? ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మానవ హక్కుల పేరుతో ఆయా దేశాల స్వంత విషయాలలో కలుగచేసుకుంటూ సమస్యలు సృష్టించించింది నిజం కాదా ? ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భారత దేశంలో పన్నుల ఎగవేతకి పాల్పడింది నిజం కాదా ? ఒక ప్రైవేట్ NGO మానవహక్కుల పేరుతో అరాచకాలకి పాల్పడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా ?
*********************************
ఎడిటర్స్ గిల్డ్ సంతాపం !
మన దేశంలో కులానికో సంఘం ఉన్నట్లే పత్రికలకి కూడా ఒక సంఘం ఉంది, దాని పేరు ఎడిటర్స్ గిల్డ్ ! పత్రికల సంఘానికి ఒక సాఫీస్ట్కేటెడ్ అల్ట్రా మోడర్న్ పేరు ఎడిటర్స్ గిల్డ్ ! పత్రికల పేరుతో రియల్ ఎస్టేట్ మరియు ఇతర వ్యాపారాలు చేసుకుంటూ వాటిలో జరిగే అవకతవకలని కాపాడుకునేందుకు ఒక రక్షణ కవచంగా ఉంటూ వస్తున్నది ఎడిటర్స్ గిల్డ్ !
మన తెలుగుతేజం రామోజీ రావు కూడా ఇదే ఎడిటర్స్ గిల్డ్ కి ఛైర్మన్ గా పనిచేశాడు ! ప్రభుత్వాలకి సహకరిస్తూ తిరిగి ప్రభుత్వాలనుండి రిటర్న్ గిఫ్ట్ లు అందుకుంటూ పది కుంభకోణాలు జరిగితే ఒక దానిని బయటపెట్టి దానినే హై లైట్ చేస్తూ మిగతా వాటిమీద దృష్టి పడకుండా కాపాడుతూ వస్తున్నాయి. మార్గదర్శి విషయంలో ఏం జరిగిందో, ఇప్పుడు దాని విషయం ఎంత వరకు వచ్చిందో రామోజీ రావు కానీ ఇతర పత్రికలు మాట్లాడవు.
పత్రికా స్వేచ్చ అంటే ?
మార్గదర్శి ఫైనాన్స్ విషయంలో రామోజీ రావు నేరుగా కోర్టు కే డైరెక్షన్ ఇస్తాడు .. మార్గదర్శి డిపాజిటర్లు అందరూ కలిసి కోర్టులో ఛాలెంజ్ చేయాకూడదు అంటూ. అంటే ఒక్కో డిపాజిటర్ వేరే వేరేగా కేసులు దాఖలు చేస్తే వాటిని ఎదుర్కొంటాడుట రామోజీ రావు. అవి ఎప్పటికీ విచారణ వచ్చేదీ ? అవి విచారణ పూర్తయ్యే లోపు ఎవరు బ్రతికి ఉంటారు ? ఎవరు వయసు మీరి చనిపోతారు ? అసలు మార్గదర్శి ప్రజల నుండి డిపాజిట్లు వసూలు చేయడం నేరం. కానీ వాటి గురించి మాట్లాడరు, ఎవరినీ మాట్లాడనివ్వరు. మరి పత్రికా స్వేచ్చ కదా ? వీళ్ళు చెప్పినట్లు నడుచుకుంటే అది మంచి ప్రభుత్వం. కాదూ ! రోజూ ఏదో ఒక ఆరోపణలని ప్రచారం చేస్తూ ఫ్రంట్ పేజీలో వార్తలు వండి వారుస్తారు. అవి నిజమా అబద్ధమా అనే విషయం బయటపడే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంటుంది.
ఇక లక్ష నాగళ్ళతో ఫిల్మ్ సిటీ ని దున్నేస్తాను అని అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 9 ఏళ్లు అయ్యింది. ఏం జరిగి ఉంటుంది ? పత్రిక స్వేచ్చా కదా ? బహుశా లక్ష నాగళ్ళు కొనడానికి డబ్బు రామోజీ రావు ఇచ్చి ఉండడు. మన ముఖ్యమంత్రి గారి దగ్గర లక్ష నాగళ్లు కొనడానికి కూడా డబ్బు ఉండి ఉండకపోవచ్చు ! కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన ఎలాంటి కుంభకోణాలు లేకుండా సజావుగా సాగుతున్నది పాలన ! ఇక్కడ పత్రికా స్వేచ్చ ఉంది వాక్ స్వాతంత్ర్యం భేషుగ్గా ఉంది ! పచ్చళ్లు, సినిమా స్టూడియో, వంట నూనెలు ఇలా ఈనాడు గ్రూప్ వ్యాపారాలు చేసుకుంటుంది కానీ ఆదానీ ఆ పని చేయకూడదు ఎందుకంటే ఆదానీకి ఎలాంటి మీడియా సంస్థ లేదు కాబట్టి. ఆఫ్ కోర్స్ NDTV ని టేక్ ఓవర్ చేయడం సదరు ఎడిటర్ గిల్డ్ కి ఇష్టం లేదు కాబట్టి రోజూ ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ఆదానీ మీద పుంఖానుపుంఖాలుగా వ్రాసేస్తూ ఉంటారు! ఆర్నాబ్ గోస్వామి అరెస్ట్ అవడం మీద మాత్రం ఎడిటర్స్ గిల్డ్ ఎలాంటి విచారమూ వ్యక్తం చేయలేదు మరియు చేయదు కూడా. అదే తెల్ల జాతి చానెల్ మీద సానుభూతి, విచారం వ్యక్తం చేస్తుంది.
**************************************
బిబిసిని రెండుసార్లు భారతదేశం నుండి వెళ్ళగొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం !
1970 వేసవి కాలంలో బిబిసి ఫ్రెంచ్ ఫిల్మ్ మేకర్ అయిన లూయిస్ మల్లె [Lous Malle] తీసిన డాక్యుమెంటరీ కలకత్తా మరియు ఫాంటమ్ ఇండియాలను ప్రసారం చేసింది. ఈ డాక్యుమెంటరీ ప్రసారం కావడం వలన అటు బ్రిటన్ లోని భారతీయులు, ఇటు భారత్ లో కూడా తీవ్ర నిరసనలు తెలిపారు అప్పట్లో. ఫ్రెంచ్ ఫిల్మ్ మేకర్ తీసిన డాక్యుమెంటరీ పూర్తిగా భారత వ్యతిరేకతతో, అవాస్తవాలతో నిండి ఉండింది. ఈ రెండు డాక్యుమెంటరీలని భారత ప్రభుత్వం నిషేధించడమే కాకుండా బిబిసిని రెండేళ్ల పాటు భారత్ లో కార్యకలాపాలు జరపకుండా నిషేధం విధించింది ఇందిర.
రెండేళ్ల నిషేధం తరువాత 1972 లో మళ్ళీ భారత్ లో తన కార్యకలాపాలని ప్రారంభించింది బిబిసి. 1975 లో ఇందిర ఎమర్జెన్సీ విధించడం తెలిసిందే ! మళ్ళీ ఇదే బిబిసి భారత వ్యతిరేక వార్తలని వండి వార్చింది. దాంతో 41 మంది కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు కలిసి బిబిసిని భారత్ నుండి వెళ్ళ గొట్టాలని డిమాండ్ చేస్తే, దానికి అంగీకరించిన ఇందిర మళ్ళీ నిషేధం విధించింది బిబిసి మీద !
ఇక పన్నులు ఎగవేసే అలవాటు ముందు నుండి ఉంది బిబిసికి. 2018 లో బ్రిటన్ లోనే పన్నులు ఎగవేసిన కేసులో రాయల్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ కి…. బిబిసి 12 మిలియన్ పౌండ్లు రిజర్వ్ లో ఉంచింది, ఒకవేళ పన్ను శాఖ అధికారులు పట్టుకుంటే కట్టడానికి అంటూ! కానీ పన్ను ఎగవేసిన ఈ కేసులో బిబిసి ఎలాంటి జరిమానా కట్టలేదు. 2019 లో బిబిసి ఉద్యోగులు నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీకి చెల్లించాల్సిన ప్రీమియం ఎగవేసేందుకు గాను కొత్త మార్గాలని కనిపెట్టి మరీ ఉద్యోగులు ఇన్స్యూరెన్స్ ప్రీమియం ఎగవేసింది. దీనివల్ల బిబిసి 10 మిలియన్ పౌండ్లు ఆదా చేసుకుంది అక్రమ మార్గంలో.
బ్రిటన్ లో తాను అనుసరించిన పద్ధతిలోనే మన దేశంలో కూడా పన్ను ఎగవేతలకి పాల్పడి, తీరా ఆదాయపన్ను శాఖ నోటీసులు ఇచ్చినా స్పందించకుండా ఊరుకొని, ఇప్పుడు సర్వే చేయడం మొదలు పెట్టగానే తామేదో అత్యంత నిజాయితీ పరులమనే బిల్డ్ అప్ ఇస్తున్నది బిబిసి. కాంగ్రెస్ గతంలో తాము రెండు సార్లు బిబిసి ని నిషేధించిన సంగతిని మరిచి అవాకులు చవాకులు పేలుతున్నది !
2021 లో చైనా కూడా తమ దేశ వ్యతిరేక వార్తలని అబద్ధాలని ప్రసారం చేస్తున్నది అంటూ బిబిసిని నిషేధించింది ! ఆ నిషేధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్ అయితే ఏకంగా బిబిసితో పాటు ఇతర వెస్ట్రన్ మీడియాకి షాక్ ఇచ్చాడు. రష్యా మీద ఎలాంటి ఆధారాలు లేకుండా వార్తలని ప్రచురించినా లేదా ప్రసారం చేసినా ఆ మీడియా సంస్థని ప్రాసిక్యూట్ చేసి జైల్లో పెడతాను అంటూ హెచ్చరిక జారీ చేశాడు… దాంతో రష్యా నుండి ఈ మీడియాలు భయంతో వాటంత అవే పలాయనం చిత్తగించాయి. రష్యన్ జైళ్లు ఎలా ఉంటాయో మనకంటే ఈ వెస్ట్రన్ మీడియాకి బాగా తెలుసు, అందుకే వెళ్లిపోయాయి.
**************************************
NDTV కమ్యూనిస్టుల చేజారి పోవడం, నరేంద్ర మోడీ మీద బిబిసి డాక్యుమెంటరీ, హిండెన్బర్గ్ Vs ఆదానీ ఉదంతం, అమెరికన్ కాంగ్రెస్ లో ‘ది స్క్వాడ్’ గా పేరుపొందిన బృంద సభ్యురాలు ‘ఇల్హాన్ ఒమర్ ‘ ని బలవంతంగా బయటికి పంపించడం, అదీ స్వంత పార్టీ సభ్యులే ఆ పని చేయడం, ఇలా పలు సంఘటనలు ఒక దానితో ఇంకొక దానికి సంబంధం ఉన్నట్లు కనిపించకపోయినా గూఢంగా ఒక దానితో ఇంకొకటి పెనవేసుకున్న విషయం ఏమిటో తెలుసుకుందాము ! టార్గెట్ మోడీ 2024…!
Share this Article