नकल मारने को भी अकल चाहिए।
నకల్ మార్నే కో భీ అకల్ చాహియే… హిందీలో పాపులర్ సామెత… అంటే కాపీ కొట్టడానికి కూడా కాస్త తెలివి ఉండాలి… లేదా కాపీ కొట్టడం కూడా ఓ కళ… ఈ మాటను నిన్న టీఆర్ఎస్ సోషల్ శ్రేణులు బాగా పాపులర్ చేశాయి… ఎందుకంటే, బీజేపీ విడుదల చేసిన గ్రేటర్ మేనిఫెస్టోలో కొన్ని అంశాలు… ఒక లేడీ టాయిలెట్, ఒక డంపింగ్ యార్డు, ఒక వుమెన్ పోలీస్ స్టేషన్, ఓ హౌసింగు కాలనీ ఫోటోలు ఆల్రెడీ టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి, అమలు చేసి చూపించిన కార్యక్రమాల ఫోటోలే వాడుకుని, మళ్లీ మేనిఫెస్టోలో అవే కొత్త వాగ్దానాలు ఏమిటోయ్, మరీ ఎటకారం కాకపోతేనూ… అని బీజేపీ టీంను వెక్కిరించే ఆ ట్వీటును కేటీయార్ కూడా రీట్వీట్ చేశాడు…
Ads
ఎహె, ఊరుకొండి, వాటిని సింబాలిక్‌గా వాడుకుంటే తప్పేమిటి..? అవి హైదరాబాద్ ఫోటోలే… వాటిని విస్తృతంగా అమలు చేస్తామని చెబితే తప్పేమిటి..? అయినా నకల్ కొట్టడం మాకు పెద్దగా తెలియదులే, మీరు అందులో నిష్ణాతులు కదా… అని బీజేపీ టీం ఉల్టా వెక్కిరించింది… దీన్ని కాసేపు వదిలేద్దాం… ఆ ఫోటోలు వాడుకోవడం తప్పేమీ కాదు కాబట్టి… అయితే అంతకుమించి కాస్త దూరం వెళ్దాం…
ఎల్ఆర్ఎస్ రద్దు… అదెలా బీజేపీ చేయగలదు..? బల్దియా మేయర్ పీఠాన్ని గెలుచుకున్నా సరే, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాత్మక పరిధిలోని ఒక అంశంలో ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఎలా నిర్ణయం తీసుకోగలదు..? సంకల్పం మంచిదే, ఎల్ఆర్ఎస్ మీద జనంలో విపరీతమైన వ్యతిరేకత ఉన్నమాట నిజమే… కానీ అది బల్దియా పరిధిలోనిదే కాదు కదా… బల్దియా బడ్జెట్ ఎక్కువ కావచ్చుగాక, కానీ అదీ ఓ స్థానిక సంస్థ మాత్రమే… సరే, ఎల్ఆర్ఎస్ అంశాన్ని డిబేట్ చేయడమే బీజేపీ ఉద్దేశం అనుకుందాం…
మొన్నటికిమొన్న కరోనా ఫ్రీ వేక్సిన్ అనే హామీ కూడా డిబేటబులే… గ్రేటర్ పరిధిలో గెలిస్తే, ఆ పరిధిలోని ప్రజలకు మాత్రమే కరోనా వేక్సిన్ ఫ్రీగా వేస్తారా..? మరి మిగతా తెలంగాణ ప్రజల మాటేమిటి..? వాళ్లకు అక్కర్లేదా..? ఈ భారం ఎవరు భరించాలి..? మొన్నటికిమొన్న బీహార్ ఎన్నికల్లో ఈ వాగ్దానం చేస్తే బోలెడంత చర్చ జరిగింది… ఐనా మళ్లీ ఇప్పుడు, అదీ ఓ స్థానిక సంస్థ ఎన్నికల్లో…!!! ఎవరు బాబూ, మీకు సలహాలు ఇస్తున్నది…?!
ఇలాంటి పరిధేతర హామీలను వదిలేస్తే… రెండుమూడు అంశాలు మాత్రం బీజేపీ మేనిఫెస్టోలో ఇంట్రస్టింగు… మెట్రో, సిటీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ… అదెలా సాధ్యం అనవద్దు… ఆ భారాన్ని భరించడానికి జీహెచ్ఎంసీ సిద్ధపడితే సాధ్యమే… ఇప్పుడు ఐదు రూపాయల భోజనం భారాన్ని భరించడం లేదా ఏం..?
నిజానికి అనేక అంశాల్లో బీజేపీ విడుదల చేసిన గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో ఆచరణ సాధ్యమా, కాదా అనే కోణంలో కాదు చూడాల్సింది… అది ఓ ఎత్తుగడ…. కొన్ని అంశాలను ప్రజల్లో బాగా చర్చకు పెట్టడమే ఆ మేనిఫెస్టో ఉద్దేశం… మామూలుగా అయితే పార్టీల మేనిఫెస్టోలను ఎవరూ పట్టించుకోరు, చదవరు, అవి వోట్లను ప్రభావితం చేసేది తక్కువ… ఎందుకంటే, పార్టీల మేనిఫెస్టోలకు క్రెడిబులిటీ ఏమీ ఉండదు… అంతెందుకు..? పాత మేనిఫెస్టోలను ఇదే టీఆర్ఎస్ తమ సైట్ల నుంచి తొలగించేసింది… కానీ బీజేపీ మేనిఫెస్టోకు వెక్కిరింపుతో కూడిన ప్రాధాన్యం ఇచ్చి, కేటీయార్ అనుకోకుండా దాన్ని చర్చనీయాంశం చేస్తున్నాడు… డియర్ సర్, బీజేపీ ట్రాపులోకి పయనించకండి… ఇప్పటికే మతం, రోహింగ్యాలు అని బీజేపీ విసిరిన ట్రాపుల్లో పడిపోయారు కూడా… !!
Share this Article