పార్ధసారధి పోట్లూరి …………. అల్ ఖైదా చీఫ్ అల్ జవహరి ని CIA కి అప్పచెప్పినప్పుడే చెప్పాను పాకిస్థాన్ ని FATF నుండి బయటికి తెస్తుంది అమెరికా అని! నిన్న అదే జరిగింది ! FATF నుండి పాకిస్థాన్ కి ఉన్న గ్రే లిస్ట్ లో నుండి తీసేసింది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గా పిలవబడే టెర్రర్ ఫండ్ ని అడ్డుకునే సంస్థని అమెరికా శాసిస్తుంది అని! పేరుకే జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియాలతో పాటు భారత్ కి అందులో సభ్యత్వం ఉంది కానీ మిగతా దేశాల కంటే అమెరికా మాటకే FATF లో మాట చెల్లుబాటు అవుతుంది !
నాలుగేళ్ల నుండి FATF గ్రే లిస్ట్ లో కొనసాగుతున్న పాకిస్థాన్ నిన్నటివరకు అంతర్జాతీయ ఫైనాన్స్ సంస్థల నుండి ఋణం పొందడానికి వీలు లేకుండా పోవడంతో నానా అవస్థలు పడ్డది ! అమెరికా సహాయంతో నిన్న గ్రే లిస్ట్ నుండి తొలగించబడ్డది ! ఇక పాకిస్థాన్ కి అడ్డే ఉండదు !
డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే పాకిస్థాన్ ని FATF గ్రే లిస్ట్ లో పెట్టాడు! 2016 వరకు అమెరికా పాకిస్థాన్ కి ఇస్తున్న సైనిక, ఆర్ధిక సహాయంలో ట్రంప్ ముందుగా 50% కోత పెట్టాడు. 2018 లో ఆ ఇచ్చే సహాయాన్ని కూడా పూర్తిగా నిలిపివేశాడు. అమెరికా తీవ్రవాదాన్ని అణిచివేయడానికి గాను ఆయుధాలతో పాటు ఇబ్బడి ముబ్బడిగా ఆర్ధిక సహాయం చేస్తూ వచ్చింది. ట్రంప్ హయాంలో ఆయుధ, ఆర్ధిక సహాయం నిలిపివేయగానే పాకిస్థాన్ ఆర్ధిక వ్యవస్థ అసలు రంగు బయట పడ్డది.
Ads
పాకిస్థాన్ ఎత్తులు !
అమెరికాకి కావాల్సిన బిన్ లాడెన్ ని రహస్యంగా ఉంచడంలో పాకిస్థాన్ ISI విజయం సాధించింది. దాదాపుగా 10 సంవత్సరాలు బిన్ లాడెన్ ఆచూకీ దొరకలేదు అమెరికన్ ఇంటెలిజెన్స్ సంస్థ CIA కి… 10 ఏళ్ల పాటు కోట్ల కొద్దీ డాలర్ల ని ఇన్ఫార్మర్స్ కి ఖర్చు పెట్టినా బిన్ లాడెన్ ఆచూకీ కనిపెట్టలేకపోయింది అంటే ISI ఎంత పకడ్బందీగా బిన్ లాడెన్ ని దాచగలిగిందో అర్ధం చేసుకోవచ్చు !
పాకిస్థాన్ ISI తో కలిసి CIA దాదాపుగా 10 ఏళ్లు పనిచేసింది. కరాచీ లోని CIA ఆఫీసులోకి ISI నేరుగా వెళ్ళగలిగేది! ఇంటెలిజెన్స్ సమాచారం కోసం CIA ISI మీద ఆధారపడేది ఆఫ్ఘనిస్తాన్ లో సోవియట్ సైన్యం పోరాడుతున్న సమయంలో! కాబట్టి CIA ఎలాంటి ఎత్తులు వేస్తుందో ISI దగ్గర ఉండి మరీ చూసి నేర్చుకున్నది ! అందుకే తనకి కావాల్సిన వాళ్ళ కోసం CIA ఎలాంటి ప్లాన్స్ వేస్తుందో ISI కి తెలుసు కాబట్టి బిన్ లాడెన్ ని 10 ఏళ్ల పాటు సిఐఏ నుండి కాపాడగలిగింది !
బిన్ లాడెన్ ని 2011 లో సిఐఏ పట్టుకొని చంపిన తరువాత అల్ ఖైదా పగ్గాలు అల్ జవహరి తీసుకున్నట్లు ఆలస్యంగా తెలుసుకున్న సిఐఏ అల్ జవహరి కోసం మళ్ళీ వేట మొదలుపెట్టింది, కానీ షరా మామూలుగా ఐఎస్ఐ అల్ జవహరిని రహస్యంగా దాచిపెట్టింది!
డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడయితే ఆయుధాలు, ఆర్ధిక సహాయాన్ని పూర్తిగా నిలిపివేశాడో దిక్కు తోచని పాకిస్థాన్ ఈసారి గండం గట్టెక్కాలి అంటే అల్ జవాహారి ని తురుపు ముక్కగా వాడుకోవాలనే ప్లాన్ వేసింది. ట్రంప్ అధికారం కోల్పోగానే బిడెన్ యంత్రాంగం ఆఫ్ఘనిస్తాన్ నుండి వెనక్కి వచ్చే సమయంలో అల్ జవహరి బ్రతికి ఉంటే ముందు ముందు చాలా కష్టాలు ఉంటాయనే ఉద్దేశ్యంతో ఈ సారి ISI తో బేరానికి దిగింది సిఐఏ !
కానీ పాకిస్థాన్ సైన్యం మాత్రం ఈ సారి పెద్ద బేరమే ఆడాలని నిర్ణయించుకుంది ! రెండు ప్రధాన కండిషన్స్ పెట్టింది ISI. మొదటిది FATF లో ఉన్న గ్రే లిస్ట్ నుండి బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళకుండా ఏకంగా గ్రే లిస్ట్ లో నుండి బయట పడేయాలి. రెండవది ఆపేసిన ఆర్ధిక, సైనిక సహాయాన్ని మళ్ళీ పునరిద్దరించాలి! ఈ డిమాండ్ల మీద నిర్ణయం తీసుకోవడానికి బిడెన్ యంత్రాంగం చాలా సమయం తీసుకుంది. రెండు నెలల క్రితం సిఐఏ డీల్ కి ok చెప్పింది !
మాకు నెల రోజుల సమయం కావాలని అడిగినది ఐఎస్ఐ ! నిజానికి పాక్ ఆఫ్ఘన్ సరిహద్దులలో ఉండే గిరిజన ప్రాంతంలో అల్ జవహరిని దాచిపెట్టింది ఐఎస్ఐ. ఆ ప్రాంతానికి ఇటు పాక్ సైన్యం కానీ లేదా సిఐఏ ఇన్ఫార్మర్స్ కానీ వెళ్లలేరు ! ఒప్పందాన్ని అమెరికా గౌరవిస్తుందో లేదో అన్న అనుమానంతో నెల రోజులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు ఐఎస్ఐ సిఐఏ కి. అనుమానం వచ్చి మనం అనుకున్న డీల్ ని యధాతధంగా అమలుచేస్తామని సిఐఏ మళ్ళీ హామీ ఇవ్వడమే కాక ఐఎంఎఫ్ దగ్గరికి రుణం కోసం వెళ్ళమని సలహా ఇచ్చింది. పాక్ అధికారులు ఐఎంఎఫ్ కి వెళ్ళి రుణం కావాలని అప్లికేషన్ పెట్టగానే వెంటనే దానిని ఆమోదించి కొన్ని షరతులు విధించింది !
So ! FATF గ్రే లిస్టు లో ఉన్నా కూడా ఐఎంఎఫ్ తమ ప్రతిపాదనని ఆమోదించింది అని నమ్మకం కుదిరాక అల్ జవహరి భార్యా,పిల్లలని రహస్యంగా కాబూల్ లో ధనవంతులు ఉండే ప్రాంతానికి మార్చింది. అడ్రస్ వివరాలు సిఐఏ కి ఇచ్చింది ఐఎస్ఐ. అప్పటి నుండి సిఐఏ ఆ బిల్డింగ్ మీద డ్రోన్ల ద్వారా నిఘా పెట్టింది. వారం తరువాత అల్ జవహరిని కూడా కాబూల్ లో ఉన్న భార్యా పిల్లల దగ్గరికి పంపించింది ఐఎస్ఐ. తన పని పూర్తయ్యింది ! అల్ జవహరి డ్రోన్ దాడిలో చనిపోయాడు ! విషయం తాలిబన్ల కి తెలియకుండా ఉంచడంలో ఐఎస్ఐ విజయం సాధించింది. అల్ జవహరి చనిపోయింది కాబూల్ లో కాబట్టి ఐఎస్ఐ చేతికి తడి అంటలేదు కానీ తాలిబన్లు జరిగిన మోసం గ్రహించారు !
1. జులై నెల 31న అల్ జవహరి సిఐఏ డ్రోన్ దాడిలో చనిపోయాడు.
2. ఆగస్టు నెలలో అమెరికన్ కాంగ్రెస్ పాకిస్థాన్ కి ఇస్తూ మధ్యలో నిషేధం విధించిన సైనిక, ఆర్ధిక సహాయాన్ని పునరిద్దరించాలి అని నిర్ణయం తీసుకుంది.
3. సెప్టెంబర్ 27 న $450 మిలియన్ డాలర్ల F-16 అప్ గ్రెడేషన్ పాకేజీ ని ప్రకటించింది అమెరికా.
4. అక్టోబర్ 21 న అంటే నిన్న FATF లో ఉన్న గ్రే లిస్ట్ నుండి పాకిస్థాన్ ని తొలగించింది.
అమెరికా ఒప్పందం ప్రకారం మాట నిలబెట్టుకుంది! సెప్టెంబర్ 27 న అమెరికా $450 మిలియన్ డాలర్ల F-16 అప్ గ్రెడేషన్ పాకేజీ ని ప్రకటించినప్పటి నుండి కాశ్మీర్ లో రెండు రోజులకి ఒకసారి ఎక్కడో ఒక చోట ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. అమెరికాకి కావలసింది ఇదే ! అంటే ఇక నుండి ప్రతి సంవత్సరం అమెరికా నుండి ఆర్ధిక సహాయం అందుతూ ఉంటుంది, వాటిని భారత్ లోకి చొరబాటు చేసేందుకు ఉగ్రవాదుల శిక్షణ కోసం ఉపయోగిస్తుంది ! వాళ్ళకి ఆయుధాలు, డబ్బు ఇవ్వడానికి ఇక నుండి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అన్నమాట !
దక్షిణాసియాలో భారత్ కి మరియు చైనాకి చెక్ పెట్టాలి అంటే అణ్వస్త్రదేశం అయిన పాకిస్థాన్ కావాలి అమెరికాకి, యూరోప్ కి ! చైనా నుండి క్రమంగా దూరం జరిపి మళ్ళీ తమ వైపు లాక్కోవాలంటే పాకిస్థాన్ కి ఆర్ధికంగా, సైనిక పరంగా సహాయం చేయాలి. ఇదీ మొదటి నుండి అమెరికా అనుసరిస్తున్న విధానం. రష్యా ఉక్రెయిన్ మీద చేస్తున్న యుద్ధం విషయంలో భారత్, చైనాలు ఎలాంటి మద్దతు ఇవ్వడం లేదు అమెరికాకి… కానీ యూరోపు కి కానీ… ! ఇక గల్ఫ్ దేశాలు కూడా పరోక్షంగా అమెరికా, యూరోపుల నుండి క్రమంగా దూరంగా జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు పాకిస్థాన్ అవసరం ఉంది అమెరికాకి !
గత నెలలో ఉక్రెయిన్ రష్యా భూభాగంలోకి ప్రయోగించిన మోర్టార్ రాకెట్లు పాకిస్థాన్ లో తయారు చేసినట్లుగా రష్యా నిర్ధారించింది. అంటే రహస్యంగా పాకిస్థాన్ ఉక్రెయిన్ కి సహకరిస్తున్నది మందు గుండు సామాగ్రి సప్లై చేస్తూ !
జర్మనీ కపట నాటకం !
ఈ నెల మొదటి వారంలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మరియు పాకిస్థాన్ పప్పు గా పిలవబడే బిలావల్ భుట్టో జర్మనీ లో పర్యటించాడు. ఆ సందర్భంలో జర్మనీ విదేశాంగ మంత్రి అన్నాలెనా బేర్‌బాక్ తో కలిసి విలేఖరుల సమావేశంలో ప్రసంగించారు. ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకి బదులు ఇస్తూ బిలావల్ భుట్టో కాశ్మీర్ సమస్య మీద జర్మనీ మద్దతు కోరడానికే ఇక్కడికి వచ్చాను అన్నాడు. అయితే అదే విలేఖరి జర్మనీ విదేశాంగ మంత్రి అన్నాలెనా బేర్‌బాక్ ని కాశ్మీర్ మీద మీ స్టాండ్ ఏమిటి అని అడిగాడు… దానికి అన్నలేనా స్పందిస్తూ ప్రపంచంలో ఏ దేశానికి అయినా సరిహద్దు సమస్య ఉంటే అన్ని దేశాలు కలిసి పరిష్కరించాల్సి ఉంటుంది అలాగే కాశ్మీర్ విషయంలో జర్మనీకి కూడా పరిష్కరించే హక్కు ఉంది అని జవాబు ఇచ్చింది. అంటే పరోక్షంగా కాశ్మీర్ ఇష్యూ లో జర్మనీ కల్పించుకుంటుంది అనే మెసేజ్ వెళ్ళిపోయింది. బిలావల్ భుట్టో జర్మనీ నుండి పాకిస్థాన్ వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి కాశ్మీర్ విషయంలో జర్మనీ పాకిస్థాన్ వైపే మొగ్గు చూపుతున్నది అంటూ గొప్పలు పోయాడు.
దాంతో స్పందించిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్ న్యూ ఢిల్లీ లోని జర్మన్ రాయబారిని పిలిచి వివరణ అడిగారు. దానికి బదులుగా జర్మన్ రాయబారి బదులిస్తూ మా విదేశాంగమంత్రి అన్నాలేనా కాశ్మీర్ సమస్యని ఐక్యరాజ్య సమితిలో శాంతియుతంగా పరిష్కరించుకోవాలి అని మాత్రమే అన్నారు కానీ మీడియా దానిని వక్రీకరించింది అంటూ సమర్ధించుకున్నాడు ! జై శంకర్ కాశ్మీర్ లో టెర్రరిజం కి కారణం ఎవరో మీ దేశానికి తెలియదా ? అని ప్రశ్నించారు. FATF లో పాక్ ని గ్రే లిస్ట్ లో పెట్టినప్పుడు మీ దేశం సమర్ధించింన విషయం మీకు తెలియదా అని గట్టిగానే ప్రశ్నించారు !
గత కొంత కాలంగా పశ్చిమ దేశాల మీడియా సంస్థలు జై శంకర్ ని ప్రశ్నలు వేయడానికి జంకుతున్నాయి, ఎందుకంటే జై శంకర్ నుండి ఊహించని సమాధానాలు వస్తున్నాయి వాళ్ళకి !
జర్మనీ కుట్ర కోణం !
ఈ నెల మొదటి వారంలో బాల్టిక్ సముద్రగర్భంలో రష్యా నుండి యూరోపుకి న్యాచురల్ గ్యాస్ సప్లై చేసే పైప్ లైన్ ని పేల్చివేశారు ! అమెరికా మాత్రం పుతిన్ కావాలనే పైప్ లైన్ ని పేల్చి వేయించాడు అని ఆరోపణ చేసింది. కానీ నిజం ఏమిటో బయట పడింది : బాల్టిక్ సముద్ర గర్భంలో ఉన్న న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్ నిర్వహణ బాధ్యత జర్మన్ సంస్థకి అప్పచెప్పింది జర్మనీ ! పైప్ లైన్ పేల్చివేతకి గురవడానికి వారం ముందు ఆ కాంట్రాక్టర్ కారు ప్రమాదంలో మరణించాడు అనూహ్యంగా ! కాంట్రాక్టర్ మరణానికి వారం ముందు సిఐఏ పైప్ లైన్ రష్యా పేల్చివేయవచ్చు అంటూ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది ! ఇంతకీ ఆ పైప్ లైన్ ఎవరు పేల్చి వేయించారో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు అనుకుంటా !
తమ వెంట రాని దేశాలని ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం మొదటి నుండి అమెరికాతో పాటు యూరోపు కూడా చేస్తూ వచ్చాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. భారత్, చైనా, గల్ఫ్ దేశాలు, ఆఫ్రికా లు ఎవరూ కూడా రష్యాకి వ్యతిరేకంగా లేరు. ఏదన్నా ఉంటే మీరు మీరు చూసుకోండి అన్నట్లుగా ఉన్నాయి…
Share this Article