వావ్… నెల రోజుల సునిశిత పరిశోధన… కోవర్టులు, గూఢచారులు, ప్రత్యేక బలగాలు అన్నీ రంగంలో దిగాయి… మూడు ప్రభుత్వ విభాగాలు ఈ కేసులోనే తలమునకలయ్యాయి… ఇదీ స్పిరిట్… ఇంకా మన మోడీ వందేమాతరం రైళ్లు, బుల్లెట్ రైళ్లు అంటూ జపిస్తున్నాడే గానీ.., తమ రైల్వే విభాగాల అధికారులు, సిబ్బంది అంకితభావాన్ని ఇంకా సరిగ్గా గుర్తిస్తున్నట్టు లేదు…
గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) విభాగాలు సాధించిన ఈ ఘనత వివరాల్లోకి వెళ్దాం… ఓ సీనియర్ రైల్వే ఆఫీసర్ బిడ్డ… వయస్సు 20 ఏళ్లు… లక్నో మెయిల్‌లో ఆమె బూట్లు పోయాయి… అదీ విపత్తు… అయ్యో, అయ్యో, మన సార్ బిడ్డ బూట్లు పోతే ఎలా అనుకుంటూ అర్జెంటుగా అందరూ రంగంలోకి దిగారు…
‘‘మీకేం తెలుసు మా కష్టాలు… ముందుగా జనవరి 4న బరేలీ స్టేషన్ ఎగ్జిట్, ఎంట్రీ గేట్ల సీసీటీవీ ఫుటేజీ మొత్తం క్షుణ్నంగా పరిశీలించాం… ప్చ్, ఏ అనవాలూ దొరకలేదు… ఆ బూట్లు ఎవరు ఎత్తుకుపోయారో అంతుపట్టలేదు… తరువాత ఐఆర్సీటీసీ రికార్డుల్లోని రిజర్వేషన్ వివరాలు శోధించాం… అందులోనూ ఏసీ ఫస్ట్ క్లాసు రిజర్వేషన్లు… ఇది కాస్త పనిచేసింది… ఒక మహిళపై మా సందేహాలు బలపడ్డాయి…’’ అని బరేలీ జీఆర్పీ డిప్యూటీ ఎసపీ దేవి దయాల్ అంటున్నాడు…
Ads
చివరకు ఏం తేల్చారో తెలుసా..? ఆ బూట్లను ఎవరూ దొంగిలించలేదనీ, ట్రెయిన్ దిగిపోయే హడావుడిలో పొరపాటున ఒక సహప్రయాణికురాలు ఈ బూట్లను తొడుక్కుని దిగిపోయిందనీ కనిపెట్టారు… ‘‘సదరు మహిళే చెబుతోంది, తెల్లవారుజాము 3.45 గంటలకు ట్రెయిన్ దిగే తొందరలో పడి, ఆ బూట్లను తొడుక్కుందట… ఆమె కూడా మా బాస్ బిడ్డ వినీత్ సింగ్ ప్రయాణిస్తున్న ఏసీ కోచ్ కంపార్ట్‌మెంటులోనే ప్రయాణించింది… ఒడిశా, డివిజనల్ రైల్వే మేనేజర్ బిడ్డ బూట్లు అవి… కానీ చట్టప్రకారం చర్యలు తప్పవు…’’ అంటున్నాడు ఆయన…
జనవరి అయిదున సదరు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ డివిజనల్ మేనేజర్ తన బిడ్డ బూట్లను ఎవరో దొంగిలించారని ఫిర్యాదు చేశాడు… తన బిడ్డ తరఫున… వాటి విలువ 10 వేల అని కూడా ఫిర్యాదులో రాశాడు ఆయన… ఆ కోచ్‌లోనే ప్రయాణిస్తున్న ఒక మహిళ ఈ బూట్లను దొంగిలించి ఉండవచ్చుననీ, ఆమె చెప్పుల్ని ఆమె అక్కడే వదిలేసి వెళ్లిందని కూడా ఫిర్యాదులో పేర్కొన్నాడు…
‘‘అవునండీ, నేనే ఆ బూట్లను పొరపాటున వేసుకుని రైలు దిగాను… తెల్లవారుజామున 3-4 గంటల సమయం… డిమ్ లైట్లు… అప్పటిదాకా నిద్రపోయి, బరేలీ వస్తుందనగా హఠాత్తుగా మేలుకున్నాను… కనిపించిన బూట్లు నావే అనుకుని, వేసుకుని దిగిపోయాను… ఎంత నష్టపోయారో చెబితే చెల్లిస్తాను… నేనేమైనా దొంగనా..?’’ అని ఆ మహిళాడాక్టర్ దబాయించింది… ఆమె మీద చర్యలు ఏ సెక్షన్ల కింద తీసుకుంటారు..? ఎక్కువ సతాయిస్తే ఆమే ఉల్టా కేసు పెట్టేట్టు కనిపించింది… ఈ చర్యలపై ఎవరికీ స్పష్టత లేదు గానీ… రికవరీ చేసిన ఆ బూట్లను మాత్రం అర్జెంటుగా తమ బాస్ బిడ్డకు పంపించే పనిలో పడ్డారు అధికారులు… ఇదుగో ఈ దాస్యానికే సిగ్గుపడండిరా బాబూ… ఆ ఫిర్యాదు చేసిన అధికారికి డ్యాష్ డ్యాష్ అస్సలు లేవు…!! ఎవరైనా సాధారణ ప్రయాణికులు అత్యంత విలువైనవి చోరీ అయ్యాయని చెబితే మాత్రం ఎవరూ పట్టించుకోరు…!!
Share this Article