మా తుఝే సలాం… 27 ఏళ్ల క్రితం స్వరబద్ధం చేయబడిన ఈ పాట దాదాపు ఒక జాతీయ గీతంలాగే దేశమంతటా పాడబడుతూనే ఉంది… ఏఆర్‌రెహమాన్ పేరు చిరకాలం ఉండేలా..! మొన్న టీ20 వరల్డ్ కప్ గెలిచాక స్టేడియంలో వేలాది మంది ఎదుట మన క్రికెట్ జట్టు ఈ పాట పాడుతుంటే అక్కడున్నవాళ్లకు, టీవీల్లో చూస్తున్న వాళ్లకు గూస్ బంప్స్… దేశమాతను కీర్తించే ఈ పాట స్థాయిలో మరే దేశభక్తి గీతం కూడా పాపులర్ కాలేదనుకుంటా…
అసలు ఆ పాట ఆలోచన ఎక్కడ మొదలైంది..? ఈ అంశం మీద ఇండియాటుడేలో ఓ ఇంట్రస్టింగ్ ఆర్టికల్ వచ్చింది… నిజానికి అది రెహమాన్ మదిలో పుట్టిన ఆలోచన కాదు… ఇది ఒక తండ్రి తన కొడుక్కి విసిరిన సవాల్ నుంచి పుట్టుకొచ్చిన పాట… రెహమాన్ బాల్యస్నేహితుడు, క్లాస్‌మేట్ భరతబాల గణపతి చెన్నైలో ఓ ప్రముఖ యాడ్ ఫిలిమ్ మేకర్… ఆయన తండ్రి ఓ స్వాతంత్ర్య సమరయోధుడు…
ఓసారి కొడుకుతో అన్నాడు… ‘‘మీరు ఏదైనా ఒక ఉత్పత్తిని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి, వినియోగదారుడు కనెక్టయ్యేలా సాంగ్స్ చేస్తుంటారు కదా… మరి దేశం కోసం ఓ ఉత్కృష్టమైన పాటను ఎందుకు తీసుకురాలేరు..? ఒక war cry లాగా బహుళ ఆదరణ పొందిన వందేమాతరం వంటి గీతాన్ని సృష్టించలేరా..? ఇప్పటి జనరేషన్‌కు అలాంటి పాటను పునఃపరిచయం చేయలేరా..?’’…. ఇదీ ఆయన ప్రశ్న…
Ads
అది కొడుక్కి బాగానే తాకింది… సవాల్‌గానే తీసుకున్నాడు… యాడ్ ఫిలిమ్స్ నుంచి కాస్త విరామం తీసుకున్నాడు… ఏవేవో ఆలోచనలు, ప్రయత్నాలు… ఏవీ కొలిక్కి రావడం లేదు… రెహమాన్ అప్పటికి మరీ ఇంత పాపులర్ సినిమా మ్యూజిషియన్ కాదు, తను కూడా భరతబాల యాడ్ ఫిలిమ్స్‌కు కూడా వర్క్ చేసేవాడు… తనే రెహమాన్‌తో అన్నాడు… ‘‘25 ఏళ్ల తరువాత కూడా జనరేషన్ పదే పదే పాడుకోగలిగే ఓ పాటను మనం రూపొందించలేమా..?’’
నాటి సమరయోధుల నుంచి నేటి తరానికి కూడా కనెక్టయ్యేలా మనం క్రియేట్ చేయలేమా అనే ఆ ప్రశ్నరెహమాన్‌లో కూడా ఆలోచనలు రేపింది… సినిమాల్లో వినోదప్రధానమైన పాటలు చేయడం వేరు… మా తుఝే సలాం వంటి దేశభక్తి ప్రేరిత పాట చేయడం వేరు… కఠినమైన సవాల్… నాకూ ఈ సినిమా సంగీతానికి భిన్నంగా ఏదో విశిష్టమైన సాంగ్ చేయాలని సంకల్పం కలిగింది అన్నాడు రెహమాన్ ఏదో ఇంటర్వ్యూలో…
కంపోజర్, సింగర్ తనే… మరి ఎవరు రాయాలి..? కూర్చబడే ఆ పదాల్లో దేశభక్తిపూరితమైన ఓ పంచ్ ఉండాలి… తనకు బాంబే, రంగలా, దౌడ్ వంటి సినిమాలకు హిందీలో పాటలు రాసిన మెహబూబే దీనికి కూడా సరిగ్గా పదాలు కూర్చగలడని అనిపించింది… భరతబాలకు పరిచయం చేశాడు తనను… వీళ్లకు భరతబాల భార్య కనిక కూడా జతకూడింది… (భరతబాల ప్రొడక్షన్ హౌజులో ఆమె కూడా ఓ డైరెక్టర్)…
దేశాన్ని ఓ మాతలా ఊహిస్తూ… తల్లికి ఓ కొడుకు అర్పించే వందనంలా, ఓ మాతృభూమి గీతం రూపుదిద్దుకున్నాక… మెహబూబ్ ఈ పాటను తొలుత తన తల్లి, సోదరి వద్ద పాడి వినిపించాడు… వాళ్లు పాట వినగానే ఏడ్చేశారు… అలా కదిలించింది వాళ్లను… ఇక ట్యూన్ కోసం ప్రయాస… ఓ అర్ధరాత్రి రెహమాన్‌కు ఓ ట్యూన్ తట్టింది… తన ఇంటి వెనుకాల ఉండే తన రికార్డింగ్ స్టూడియోలోకి వెళ్లాడు…
అక్కడి నుంచే భరతబాలకు ఫోన్ చేశాడు, తెల్లవారుజాము 3 గంటలు… ఈ పాట గురించి అనగానే పరుగుపరుగున వచ్చాడు… స్టూడియోలో ఇద్దరే… ట్యూన్‌లోకి ఒదిగి మా తుఝే సలాం తనే పాడి వినిపించాడు… సరిగ్గా కుదిరింది… భరతబాల కళ్లల్లో నీళ్లు… ఉద్వేగంతో రెహమాన్‌ను హత్తుకున్నాడు గట్టిగా… ‘మనం సాధించాం’ అనరిచాడు ఇంకా గట్టిగా…
శ్రీధర్ సుబ్రహ్మణ్యం… ఈయన సోనీ మ్యూజిక్ మార్కెటింగ్ స్ట్రాటజిస్టు… తనకు ఓ సందేహం… పాడటంలో ఏ శిక్షణ లేని సింగర్, పైగా తమిళియన్… హిందీలో పాడితే మన యాస ఇట్టే తెలిసిపోతుంది, జనం నుంచి యాక్సెప్టెన్సీ వస్తుందా అని..! ఒకసారి విని చూడండి అన్నారు వీళ్లు… విన్నాడు, కదిలిపోయాడు…
తరువాత ఎలా చిత్రీకరించాలి వంటి ప్లానింగ్ చకచకా జరిగిపోయింది… ఏకకాలంలో 28 దేశాల్లో రిలీజు… సినిమాయేతర పాటల ఆల్బమ్ అమ్మకాల్లో అంతర్జాతీయ రికార్డు, గిన్నీస్ బుక్ రికార్డు… అన్నింటికీ మించి ఆ గీతం ప్రతి జాతీయ ఉత్సవాల్లో మోగుతూనే ఉన్న రికార్డు… ఒక తండ్రి కల గన్న ఓ దేశభక్తి గీతాన్ని అలా ఓ కొడుకు సవాల్‌గా తీసుకుని, సాకారం చేసి చూపించాడు..!!
Share this Article