మంచుపల్లకీ సినిమాకు నలభయ్యేళ్లు అని సోషల్ పోస్టు ఒకటి చూసేసరికి ఆనందమేసింది… అప్పట్లో క్లాస్ సినిమా… ప్రత్యేకించి మేఘమా దేహమా పాటకు కురిసిన ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు… ఆ సినిమాను డైరెక్ట్ చేసే సమయానికి వంశీ వయస్సు పాతికేళ్లు కూడా నిండలేదు… తనే ఆరున్నరేళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో ఈ సినిమా సంగతులు వివరంగానే రాసుకొచ్చాడు… అందులో కొన్ని ఇంట్రస్టింగు పాయింట్స్…. Pasalapudi Vamsy.. మాటల్లోనే…
కమలహాసన్ కి అన్నయ్య, సుహాసినికి తండ్రి అయిన చారుహాసన్ గారు ఒక కథకి స్క్రీన్ ప్లే రాస్తే, వాళ్ళ దగ్గర మేనేజర్ గా పనిచేసిన వడివేల్ అనే ఆతను సుహాసిన్ని హీరొయిన్ గా పెట్టి సినిమా తీశాడు.పేరు ‘’పాలయ వన్న సోలై’’. హిట్ అయింది. ఆ సినిమాని తెలుగులో తియ్యడానికి రైట్స్ కొన్న ప్రసాదరావు, ప్రొడక్షన్ ఆఫీసు ఓపెన్ చెయ్యడానికి ఇల్లు కోసం తిరుగుతున్నారు…
——
Ads
———-
పంతులమ్మ , నాగమల్లి సిన్మాల్లో పాటలు విన్నాక ఆ మ్యూజిక్ డైరక్టర్లని చాలా ఇష్టపడి పోయిన నేను , నాకు ప్రాణమైన మా ఇళయరాజా గార్ని పక్కనెట్టేసి వీళ్ళని అప్రోచయ్యేను. చిన్నప్పట్నుంచీ మ్యూజిక్ మీద ప్రేయసి మీదంత ఇష్టం ఉన్న నేను , కంపోజింగప్పుడు నా ఆలోచనలు చెప్తుంటే , చిన్న కుర్రోడ్ననో ఏమో , లేకపోతే వాళ్ళ పద్దతి అంతేనేమో నవ్వుతా వినేసి , వాళ్ళ పద్దతిలో వాళ్ళు చేసుకుంటా వెళ్ళిపోయేవారు.తమిళ వెర్షన్లో ఉన్న మేఘమా- దేహమా పాటని తెలుగులో పెడదామంటే ఒప్పుకోకండా’’ దానికంటే మంచిది చేద్దాం ఆ పాట హిందీ గజల్ కి కాపీ’’ అన్నారు.. వాళ్ళన్నది చాలా కరక్టు . కానీ, ఆ పాటకి చాలా ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయిన నిర్మాత ప్రసాదరావు గారు’’ అదే ఉండాలయ్యా’’ అంటారు. ఈ విషయం మా ఏడిద నాగేశ్వరరావు గారికి చెప్పేవాణ్ణి…. వాల్లనొప్పించడానికి చాలా అవస్త అయ్యింది. వాహిని ‘’ ఎ ‘’ థియేటర్లో ఆ పాట పాడిన జానకి గారికి ‘’సితార’’ అవార్డ్ వచ్చింది గానీ, ఒరిజినల్లో వాణి జయరాం గారు పాడిందే బాగుందన్నారు తెలుగు పాట విన్న తమిళ మిత్రులు.
శ్రీశ్రీ గారి చివరి రోజులవి… వారితోనూ పాటలు రాయించాం. నాకు బాగా గుర్తు పాటకి అయిదొందలిచ్చారు సత్యం గారు. ఆ రోజుల్లో పారితోషికాలు అలాగే ఉండేవి మరి. గోపిగారో పాట రాస్తే , మేఘమా దేహమా పాట వేటూరి , శంకరాభరణం రోజుల్లో అలవాటు వల్ల అయన డిక్టేట్ చేస్తే రాసుకున్నాను. ’’వేకువఝామున వెన్నెల మరకలుగా’’ అన్న లైన్ గురించి తర్వాత రోజుల్లో మేం కలిసినప్పుడల్లా గుర్తు చేసుకుoటా ‘’ భలేగా పడిందయ్యా’’అనేవారు... (నాకొక పూమాల తేవాలి నువ్వు… అది ఎందుకో … పాటలోని ఈ చివరి వాక్యం సుహాసిని కేరక్టర్ మొత్తాన్ని చెప్పేస్తుంది… భలే కలం…)
అన్నట్టు… ఈరోజు వంశీ పుట్టినరోజు కూడా..!
Share this Article