Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అమ్మతనం అంటే అన్నీ సహించడం కాదు… కొన్ని వదిలించుకోవడం కూడా..!!

October 11, 2024 by M S R

.
సుమారు ఇర‌వై ఎనిమిదేళ్ల క్రితం రాయాల‌నుకున్న‌క‌థ …
అప్ప‌ట్లో ఎన్.వేణుగోపాల్ బెజ‌వాడ‌లో ఉండేవారు. కృష్ణా జిల్లా విర‌సం యూనిట్ స‌మావేశాలు త‌ర‌చు కొండ‌ప‌ల్లి సీతారామ‌య్య‌గారి అమ్మాయి క‌రుణ గారింట్లో జ‌రిగేవి.
అక్క‌డ జ‌రిగిన విర‌సం యూనిట్ స‌మావేశాల్లో ఒక‌టి రెండింటికి నేనూ హాజ‌ర‌య్యాను. అలా హాజ‌రైన సంద‌ర్భంలో వేణు సోద‌రి ర‌జ‌ని గారు … త‌నే రాసిన ఓ క‌థ చ‌దివి వినిపించారు.
క‌థ ఓ ఎన్ కౌంట‌ర్ నేప‌ధ్యంలో సాగుతుంది … కొడుకును కోల్పోయిన ఆ త‌ల్లి విప్ల‌వ‌బాట ప‌ట్ట‌డం లాంటి ఎండింగ్ ఉంటుంది. అప్పుడు మెదిలిన ఆలోచ‌న … అదే క‌థ‌ను రివ‌ర్స్ లో రాస్తే అని … అయితే అప్పుడు నేను ఎవ‌రితోనూ పంచుకోలేదు… కానీ అది నాలో అలా నిక్షిప్త‌మై పోయింది. ఆ త‌ర్వాతా చాలా సార్లు తొలిచింది.

ఫైన‌ల్ గా ఓ సారి కాగితం మీద పెట్టేశాను. ఆ కాగితాలు … మిత్రుడు అంబ‌టి సురేంద్ర‌రాజుకి ఇచ్చాను… ఆయ‌న చ‌దివి ఎక్క‌డో పెట్టి మ‌ర‌చిపోయారు…. ఇది జ‌రిగీ ఓ ప‌దిహేనేళ్లు దాటి ఉంటుంది.
అలా ఆ క‌థ నా మ‌న‌సులో మాత్ర‌మే ఉండిపోయింది. చాలా సార్లు దీనికి క‌థా రూప‌మివ్వాల‌నుకున్నాను. ర‌క‌ర‌కాల కార‌ణాల చేత కుద‌ర్లేదు… ఇప్పుడు కూడా క‌థ‌గా రాయ‌డం లేదు… జ‌స్ట్, ఓ జ్ఞాప‌కంగా మాత్ర‌మే పంచుకుంటున్నాను….. (రంగావఝల భరద్వాజ)

………….
స‌రిత ఓ ప్రైవేటు కాలేజీలో ఫిజిక్స్ లెక్చ‌ర‌ర్ గా ప‌న్జేస్తూంటుంది. వ‌య‌సు అర‌వై దాటి ఉంటాయి. హైద్రాబాద్ కెపిహెచ్బీ లాంటి కాల‌నీలో ఓ అపార్ట్ మెంట్ లో ఒక్క‌త్తే ఉంటూ ఉంటుంది.
రోజూ తెల్లారుఝామున ఐదున్న‌ర క‌ల్లా రడీ అయి ఆరింటికి సిటీ బ‌స్సెక్కి కుక‌ట్ ప‌ల్లి లో ఉన్న కాలేజీలో స్పెష‌ల్ క్లాసుకు ఆరున్న‌ర క‌ల్లా హాజ‌రు కావ‌డం త‌న దిన‌చ‌ర్య‌.
నిజానికి అది స్డ‌డీ అవ‌ర్… అయితే పిల్ల‌ల సందేహాల‌ను తీర్చ‌డానికి త‌నే ఆ సమ‌యాన్ని ఎంచుకుంది. స‌రిత కోసం ఎప్పుడో త‌ప్ప రెగ్యుల‌ర్ గా బంధువులో స్నేహితులో రావ‌డం ఆ అపార్ట్ మెంట్ లో త‌ను చేరిన ఈ ఆరేడేళ్ల‌ల్లో ఎవ‌రూ చూళ్లేదు.

Ads

స‌రిత ఒంట‌రి … ఉద‌యం ఆరింటి నుంచీ సాయంత్రం ఆరింటి వ‌ర‌కు కాలేజీలోనే పిల్ల‌ల‌తో గ‌డ‌ప‌డం త‌న‌కు చాలా ఇష్టం. వాళ్ల సందేహాలు తీరుస్తూ … త‌న‌కు తెల్సిన‌వి వాళ్ల‌కి చెప్తూ ఇలా ఆరింటిదాకా గ‌డిపేసి ఏడింటిక‌ల్లా ఇంటికొచ్చేసి కాసేపు టీవీ చూసి .. వంట చేసుకుని తినేసి కాసేపు ఏదేనా చ‌దువుకుని … ప‌డుకోవ‌డ‌మే… సాద్య‌మైనంత వ‌ర‌కు ఇత‌ర విష‌యాలేవీ మ‌న‌సులోకి రానీదు.
రోజూ లాగే ఆ రోజూ ఉద‌యం ఐదున్న‌ర‌కి లిఫ్ట్ లో కింద‌కి దిగింది. తీరా బ‌య‌ట వ‌ర్షం ప‌డుతోంది. వాచ్ మెన్ లేచొచ్చి అమ్మా … గొడుగు తీసుకెళ్తారా అన్నాడు. వ‌ద్దు … కుదిరితే … అక్క‌డేదో ఆటో ఆగుంది క‌దా .. దాన్ని పిలువు చాలు అంది స‌రిత …

త‌నింతే సాధ్య‌మైనంత వ‌ర‌కు ఎవ‌రి మీదా ఆధాప‌డ‌దు.. రిటైర్మెంట్ త‌ర్వాత పెన్ష‌న్ స‌రిపోతుంది త‌న‌కు. కానీ కేవ‌లం ఇంట్లో ఉండ‌డం ఇష్టం లేకే త‌న పాత కొలీగ్ ముకుంద‌రావు ఇన్జార్జ్ గా ఉన్న ఓ ప్రైవేటు జూనియ‌ర్ కాలేజీలో చేరింది.
ఆటో వ‌చ్చింది … బ‌స్టాప్ ద‌గ్గ‌ర దిగి … అల‌వాటుగా పేప‌ర్ కొనుక్కుని ఆగి ఉన్న బ‌స్సెక్కి కూర్చుని ఓపెన్ చేసింది.
న‌క్స‌ల్స్ చేతుల్లో హ‌త‌మైన డాన్ సందీప్ అనే బ్యాన‌ర్ కనిపించింది. పేప‌ర్ మూసేసి అలా కిటికీలోంచీ బ‌య‌ట‌కు చూస్తూ ఉండిపోయింది. బ‌స్సు క‌దిలింది కూడా త‌న‌కు తెలియ‌దు. స్టాప్ రాగానే అమ్మా అని పిల్చాడు కండ‌క్ట‌రు.. త‌ను లేచి గ‌బ‌గ‌బా దిగిపోయింది.

నెమ్మ‌దిగా క్లాసురూంలోకి ఎంట‌ర‌వ‌గానే పిల్ల‌ల‌తో క‌ల‌సిపోయి పేప‌ర్ విష‌యం మ‌ర‌చిపోయింది. స‌రిగ్గా ఎనిమిది గంట‌ల‌కు ప్యూనొచ్చి సార్ ర‌మ్మంటున్నాడ‌ని పిల్చాడు.
త‌ను ప్రిన్స్ ప‌ల్ ముకుంద‌రావు గ‌దిలోకి ప్ర‌వేశించింది.
స‌రితా రాత్రంతా నీ ఫోనుకు ట్రై చేస్తూనే ఉన్నా … స్విచ్చాఫ్ వ‌చ్చింది … అన్నాడు ముకుంద‌రావు.
అవును… నేను రోజూ చేసే ప‌నే క‌దా… రాత్రి ప‌డుకోబోయే ముందు ఫోన్ స్విచ్చాఫ్ చేసేస్తాను. అలాగే చేసేశాను… ముకుందం నువ్వెందుకు అంత టెన్ష‌న్ ప‌డుతున్నావో నాకు అర్ధం అవుతోంది… నేను పొద్దున్న పేప‌ర్ చూశాను … అంది స‌రిత చాలా ప్ర‌శాంతంగా…

మ‌రి పేప‌ర్ చూసీ కామ్ గా క్లాసులో బిజీ అయిపోయావు… ఓ సారి వెళ్లి ప‌ల‌క‌రిస్తావా … నేను తోడు రానా అని ఆందోళ‌న‌గానే అడిగాడు ముకుందం.
వ‌ద్దు … నేన‌క్క‌డ‌కి వెళ్లాల‌నుకోవ‌డం లేదు… నేను క్లాసులో ఉంటాను ముకుందం … డిస్ట్ర‌బ్ చేయ‌ద్దు.. ఒక వేళ వారే వ‌చ్చి పిల్చినా వెళ్లకూడ‌ద‌నే అనుకున్నాను.. ఒక వేళ నా నిర్ణ‌యం మిమ్మ‌ల్సి హ‌ర్ట్ చేసిన‌ట్టైతే … మ‌న్నించండి… అని వేడుకుంది.
స్టాఫ్ రూం వెన‌కాల ఉన్న గార్టెన్ లోకి వెళ్లి కూచుంది… మ‌న‌సులో పాత జ్ఞాప‌కాలు ముసురుకున్నాయి.

………..
స‌రిత … చిన్న‌ప్ప‌ట్నించీ స్కూల్ టాప‌ర్. రెండు ప్ర‌తిబంధకాలు దాటి … సిటీలో హాస్ట‌ల్ లో ఉంటూ యూనివ‌ర్సిటీలో చ‌దువుకుంది. ఒక‌టి కులం … రెండు త‌న జండ‌ర్ … మాదిగ కులానికి చెందిన వారు చ‌దువుకోవ‌డ‌మే కాస్త ఇబ్బందిగా ఉన్న రోజుల్లో … మ‌హిళ‌గా మ‌రో కొత్త స‌మ‌స్య‌ను భుజానేసుకుని స‌రిత కాలేజీలో ప్ర‌వేశించింది. త‌ర్వాత పీజీ… టెంత్ రోజుల్లో త‌ను డాక్ట‌ర్ చేయాల‌నుకుంది. కానీ ప‌రిస్తితులు క‌లిసిరాక … ఎమ్పీసీ లో చేరి ఆ త‌ర్వాత బిఎస్సి ఫిజిక్స్ … చేసి … యూనివ‌ర్సిటీకి చేరింది.

అక్క‌డే త‌న‌కు గోపాల్ ప‌రిచ‌యం అయ్యాడు. త‌ను బ్రాహ్మిణ్. అయినా ఇద్ద‌రి మ‌న‌సులూ క‌ల్సాయి. త‌నే ప్ర‌పోజ్ చేశాడు. వాళ్లింటికి తీసుకెళ్లాడు. గోపాల్ ఫాద‌ర్ పెరాల‌సిస్ వ‌చ్చి మంచాన‌ప‌డి ఉన్నారు. అమ్మ నాలుగిళ్ల‌లో వంట చేస్తూ … గోపాల్ ని చ‌దివించేది… ఊళ్లో ఉన్న అరెక‌రం పొలం మీదొచ్చే బియ్యం ఉడ‌కేసుకుని పెర‌ట్లో వేసుకున్న ఆకుకూర‌లూ ఇత‌ర కాయ‌గూర‌లూ తింటూ … అలా కాల‌క్షేపం చేసేసేదావిడ‌.
గోపాల్ ప్ర‌తిపాద‌న విని మొద‌ట వ‌ద్ద‌న్నారు. కానీ త‌ర్వాత స‌రే అన్నారు. అయితే పెళ్లి ఏ ఆర్భాటాలూ లేకుండా జ‌రిగిపోవాల‌న్నారు. అలా పీజీ ఫైన‌ల్ ఇయ‌ర్ లో ఉండ‌గానే స‌రిత వివాహం గోపాల్ తో జ‌రిగిపోయింది.

పీజీ అవ‌గానే త‌ను గోపాల్ తో క‌ల‌సి ఓ ప్రేవేట్ కాలేజీలో జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్ గా చేరిపోయింది. గోపాల్ మిత్రులు ముకుందం త‌దిత‌రుల‌తో స్నేహం కుదిరింది. పెళ్లైన మూడేళ్ల త‌ర్వాత కొడుకు పుట్టాడు. వాడ్ని చాలా ప్రేమ‌గా పెంచుకుంటూండ‌గా .. ఓ రోజు జ‌ర‌గ‌రాని దుర్ఘ‌ట‌న జ‌రిగింది.
గోపాల్ , వాళ్ల నాన్నను తీసుకుని ఊరి నుంచీ కారు డ్రైవ్ చేసుకుంటూ వ‌స్తూండ‌గా దార్లో యాక్సిడెంట్ అయ్యింది. కారు నుజ్జునుజ్జు అయి ఇద్ద‌రూ చ‌నిపోయారు.
దీంతో అత్త‌గారిని తెచ్చి త‌న ద‌గ్గ‌రే పెట్టుకుంటుంది స‌రిత‌. అత్త‌గారు త‌ను, కొడుకుతో కాలం గ‌డిపేస్తూంటుంది.

అప్ప‌టికి కొడుకు స్కూలింగ్ లోకి వ‌స్తాడు… వాడి ద‌గ్గ‌ర ఓ పాయింట్ స‌రిత‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. ప్ర‌తి విష‌యంలోనూ చాలా స్వార్ధంగా ఆలోచిస్తూంటాడు… త‌ను గానీ గోపాల్ గానీ అలా ఎప్పుడూ అనుకునేవాళ్లు కాదు. డిఎన్ఎ అంటూంటారు క‌దా… అలా త‌న ఫ్యామ్లీలోగానీ గోపాల్ ఫ్యామ్లీలోగానీ ఆ త‌ర‌హా ఆలోచ‌నలున్న వారెవ‌రూ క‌నిపించ‌లేదు…
కానీ వీడెందుకు ఇలా త‌యార‌వుతున్నాడ‌ని ర‌కర‌కాలుగా చెప్పే ప్ర‌య‌త్నం చేస్తుంది.
స్పెష‌ల్ కేర్ తీసుకుని చెప్తుంది … అలా ఉండ‌కూడ‌ద‌ని చెప్తుంది… కానీ వాడు విన్న‌ట్టే ఉంటాడు గానీ త‌న ప‌ద్ద‌తిలో తాను వెళ్లిపోతూంటాడు.
త‌రం మార్పు అంటూ స‌మ‌ర్ధించుకొచ్చే అత్త‌గారితో ఏకీభ‌వించ‌క‌త‌ప్ప‌దు చాలా సార్లు స‌రిత‌కి.

అలా స్వార్ధంతో ఇంట్లో బాధ్య‌త‌ల్లో ఏదీ ప‌ట్టించుకోకుండా పెరుగుతున్న కొడుకు కాలేజీ డేస్ లో .. యాజ్ ఎ టీచ‌ర్ త‌ను బాగా ఇష్ట‌ప‌డే స్టూడెంట్ ఒక‌డు వ‌చ్చి …
మేడం రాత్రి మీ అబ్బాయి అరెస్ట్ అయ్యాడు మేడం … అని చెప్తాడు..
అదేంట‌ని త‌ను తెల్ల‌బోతుంది.
అంటే .. మీకు తెల్సో తెలీదో .. త‌ను మా రాడిక‌ల్ స్టూడెంట్స్ యూనియ‌న్ లో యాక్టివ్ మెంబ‌ర్ అని మ‌రో షాకిస్తాడా కుర్రాడు..
దీంతో స‌రిత సీరియ‌స్సై ఆ కుర్రాడ్ని త‌న ఇంటికి ర‌మ్మంటుంది.
త‌ను వ‌స్తాడు…

బాబూ మా వాడు రాడిక‌ల్ స్టూడెంట్ యూనియ‌న్ లో మెంబ‌ర్ అని నువ్వంటున్నావు.. నాకు ఆ ఆర్గ‌నైజేష‌న్ మీద చాలా గౌర‌వం ఉంది. ఆ ఉద్య‌మం మీద నాకు కొంత అవ‌గాహ‌న ఉంది. మ‌నుషులంద‌రూ సుఖ సంతోషాల‌తో బ్ర‌త‌కాల‌నుకుని అలా బ్ర‌తికే వ్య‌వ‌స్త‌ను తీసుకురావ‌డం కోసం పోరాటం చేస్తూ ప్రాణ త్యాగాలు చేస్తున్న వారంటే నాకు చాలా గౌర‌వం ఉంది.
కానీ .. మావాడు అలాంటివాడు కాదు… వాడు అలా మారితే సంతోష‌మే.. కానీ వాడేనాడూ ఇంటి స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోలేదు. నాకు గానీ మా అత్త‌గారికి గానీ స‌హాయ‌ప‌డ‌లేదు. వాడి ప‌న్లే మేం చేసేవాళ్లం చేస్తూన్నాం కూడా… ఇంట్లో తోటి మ‌నుషుల‌ను ప‌ట్టించుకోని వాడు … ప్ర‌పంచానికి ఏదో చేస్తాన‌న‌డం నాకు అర్ధం కావ‌డం లేదు… ఒక వేళ గ‌న్ ప‌ట్టుకుంటే ఓ ప‌వ‌ర్ ఉంటుంది.. జ‌నాన్ని శాసించ‌వ‌చ్చు .. లాంటి గ్లామ‌ర్ ఆలోచ‌న‌ల‌తో హీరో అయిపోతాన‌నే భ్ర‌మ‌తో ఏవ‌న్నా మీతో క్లోజ్ అయ్యాడేమో బాబూ అలాంటి వాల్లు ఈ రోజు కాక‌పోతే రేపైనా మీకు ఇబ్బందులు తెస్తారు… అందుక‌ని నేను వాడిని చూడ్డానికి స్టేష‌నుకు రాన‌ని చెప్పండి… అలాగే .. బెయిలు షూరిటీ లాంటి కార్య‌క్ర‌మంలో కూడా నేను ఇన్వాల్వ్ కాను… అంటుంది..

మ‌రి సానుభూతి ఉంద‌న్నారు అంటాడా కుర్రాడు..
నా కొడుకు ప్లేసులో నువ్వుండి ఉంటే … నేను త‌ప్ప‌క స‌హ‌క‌రించేదాన్నే.. కానీ వాడు అంత త్వ‌ర‌గా బ‌య‌ట‌కు రాకూడ‌దు.. ఎందుకంటే ఇందులో ఇంత క‌ష్ట‌ముంద‌ని త‌న‌కు తెలిస్తే … అటు వైపు వెళ్లకూడ‌ద‌నుకునే అవ‌కాశం ఉంది కదా అనేది నా ఆశ‌. త‌ద్వారా … మీ ఉద్య‌మాన్ని వాడి బారి నుంచీ కాపాడుకోవడానికి అవ‌కాశం ఉంది క‌దాని కూడా ఆశ‌. అని ముగించింది స‌రిత‌.

ఆ కుర్రాడు నెమ్మ‌దిగా నిట్టూర్చి .. సైకిలేసుకుని ఎపిసిఎల్సీ లాయ‌ర్ తో క‌ల‌సి స్టేష‌న్ కు పోయి స‌రిత కొడుకును క‌ల్సి జ‌రిగింది చెప్తాడు..
మా అమ్మ చాలా తెలివిగా మాట్లాడింది కామ్రేడ్ … త‌ను పెటీ బూర్జువా క‌దా … అలాగే మాట్లాడుతుందంటాడు వాడు.
ఫైన‌ల్ గా పార్టీయే త‌న‌కు లాయ‌ర్ ను పెట్టి బెయిల్ ఏర్పాటు చేసి బ‌య‌ట‌కు తీసుకువ‌స్తుంది.
స‌రిగ్గా ఆ రోజు నుంచీ అత‌ను ఇంటికి రాడు. అలా త‌ను రాక‌పోక‌లు బంద్ చేసిన త‌ర్వాత ఓ ఆర్నెల్ల‌కు స‌రిత అత్త‌గారు కాలం చేస్తారు. అప్పుడూ క‌బురు పెడుతుందిగానీ త‌ను రాడు.

అత్త‌గారి మ‌ర‌ణం త‌ర్వాత దాదాపు స‌రిత ఒంట‌రి అయిపోతుంది. నెమ్మ‌దిగా కొడుకు పీపుల్స్ వార్ పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతున్న విష‌యం పేప‌ర్ల‌లో చ‌దువుతూ ఉంటుంది. త‌న తోటి లెక్చ‌ర‌ర్లు అప్పుడ‌ప్పుడూ త‌మ త‌మ వ్య‌క్తిగ‌త ఆస్తి వ్య‌వ‌హారాల సెటిల్మెంట్ల కోసం వాణ్ణి క‌ల‌ప‌మ‌నీ రిక‌మండ్ చేయ‌మ‌నీ స‌రిత ద‌గ్గ‌ర‌కు వ‌స్తూంటారు… కానీ త‌ను ఎంట‌ర్ టైన్ చేయ‌దు…
ఇలా ఓ ఇర‌వై ఏళ్లు గ‌డిచిపోయిన త‌ర్వాత ఓ ఫైన్ మార్నింగ్ పేప‌ర్లోనే … ఓ వార్త … స‌రిత‌ను ఆక‌ట్టుకుంటుంది. అదేంటంటే ..

త‌న కొడుకు లొంగుబాటు .. కోడ‌లితో స‌హా … అదీ పార్టీ నాయ‌క‌త్వాన్ని మ‌ట్టుబెట్టే కార్య‌క్ర‌మంలో పాల్గొని మ‌రీ ప్ర‌భుత్వాన్ని మెప్పించి బైట‌కు వ‌చ్చిన చ‌రిత్ర చ‌దివి … త‌న అంచ‌నాలు త‌ప్ప‌లేద‌నుకుంటుంది. కానీ మ‌న‌సులో మాత్రం చాలా బాధ ప‌డుతుంది.
ఎలా పుట్టాడు వీడు అని …
అంత‌కు ముందు వాడు న‌క్స‌లైటు ఇమేజ్ లో ఉండ‌గా వాడితో ప‌నులు చేయించుకున్న త‌న కొలీగ్సే వాడు బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు చీప్ గా కామెంట్స్ చేయ‌డం త‌న దృష్టిని దాటి వెళ్ల‌లేదు.

లొంగుబాటు అయిన కొద్ది నెల్ల‌కే త‌న కొడుకు ఒక డాన్ గా అవ‌త‌రించాడ‌ని స‌రిత‌కు తెలుస్తుంది. ఆ ఇన్ఫ‌ర్మేష‌న్ తెచ్చింది కూడా అంత‌కు ముందు వాడితో ప‌న్లు చేయించుకున్న వారే..
విని నిట్టూరుస్తుంది. వాడు బాగా సంపాదిస్తున్నాడ‌నీ చాలా పేద్ద మేడ క‌ట్టాడ‌నీ కూడా వింటుంది. కొడుకు ద‌గ్గ‌ర‌కు పోవ‌చ్చు క‌దా .. హాయిగా అని స‌ల‌హాలు చెప్పే మిత్రుల‌ను సున్నితంగా కాదు సీరియ‌స్ గానే వారిస్తుంది. కోప్ప‌డుతుంది.
కొడుకు చేస్తున్న దందాలూ అవీ పేప‌ర్ల‌లో చూడ్డ‌మే త‌ప్ప ఏనాడూ వాడ్ని క‌ల‌వాల‌నుకోలేదు. క‌ల‌వ‌లేదు కూడా… వాడు ఉద్య‌మం నుంచీ బ‌య‌ట‌కు వ‌చ్చాక కూడా కొంద‌రు పార్టీ నాయ‌కుల్ని దొంగ‌చాటుగా హ‌త్య చేసాడ‌ని తెల్సి చాలా బాధ‌ప‌డింది. అలా వాడి చేతిలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ల‌ల్లో వాడు తొలి సారి అరెస్టు అయిన‌ప్పుడు త‌న ద‌గ్గ‌ర‌కొచ్చి ఇన్ఫ‌ర్మేష‌న్ చెప్పిన కుర్రాడు కూడా ఉండ‌డం స‌రిత‌ను మ‌రింత బాధిస్తుంది.

పోలీసుల‌తో మిలాఖ‌త్ అయి వాడు చేస్తున్న దందాల గురించీ వాడింట్లో జ‌రిగే పార్టీల గురించీ ప్ర‌జ‌లు క‌థ‌లు క‌థ‌లుగా చెప్పుకుంటుంటే … చాలా సార్లు విన్న‌ది.
త‌న‌ను క‌ల‌వాల‌నుకుంటున్న‌ట్టు కొన్ని సార్లు వాడే క‌బురు పెట్టినా త‌ను వ‌ద్ద‌నే స‌మాధానం చెప్పింది. మ‌న‌వ‌ళ్ల మీద కూడా ప్రేమ క‌ల‌గ‌లేదు…
ఇలా గ‌తం అంతా స‌రిత క‌ళ్ల ముందు క‌ద‌లాడింది. గార్టెన్ లోంచీ లేచి నెమ్మ‌దిగా క్లాసురూమ్ లోకి వెళ్లింది.
క్లాసు న‌డుస్తుండ‌గా మ‌ళ్లీ అటెండ‌రు వ‌చ్చి ప్రిన్స్ ప‌ల్ నుంచీ పిలుపు వ‌చ్చింద‌ని చెప్పాడు.
వెళ్లింది. అక్క‌డ పోలీసులు కూడా ఉంటారు. అందులో ఓ పోలీసాఫీస‌ర్ … త‌న కుమారుడి చావు వార్త అదే మాజీ న‌క్స‌లైటు కోవ‌ర్డ్ డాన్ సందీప్ మ‌ర‌ణ వార్త చెప్పి … అమ్మా మీ కోడ‌లు గారు మిమ్మ‌ల్ని తీసుకుర‌మ్మ‌న్నారు… అన్జెప్పాడు.

వాడి ప‌ద్ద‌తులు నాకు వాడు పార్టీకి వెళ్లకముందే నాకు తెల్సు… నేను ఆ రోజుల్లోనే వాడ్ని వ‌దిలేశాను… ద‌య‌చేసి మ‌రోసారి వాడిని నేను క‌న్నాన‌ని గుర్తు చేయ‌కండి అని ద‌ణ్ణం పెట్టి బైట‌కి వ‌చ్చేస్తుంది…
ముకుందంతో కాసేపు మాట్లాడిన పోలీసులు జీపెక్కేస్తారు… జీపులో ఉండ‌గా వారితో క‌మీష‌న‌ర్ లైవ్ లోకి వ‌చ్చాడు…
స‌రిత‌ గారు వ‌స్తున్నారా? అడిగాడు అట్నుంచీ..
సార్, రాన‌న్నారు సార్, పైగా అత‌న్నీ , డిపార్ట్ మెంటునీ గ‌వ‌ర్న‌మెంటునీ కూడా తిట్టారు సార్ అని క‌మిష‌న‌ర్ కు ఫీడ్ చేస్తాడు జీపులో ఉన్న అధికారి.
ఓహో రానంటోందంటే … వాడ్ని బాగా వ్య‌తిరేకిస్తూ ఉండాలి.. వాడిని వ్య‌తిరేకిస్తున్నారంటే ఆవిడ‌కు పార్టీతో ఏమ‌న్నా సంబంధాలుండే అవ‌కాశాలున్నాయేమో అని నాకు అనుమానంగా ఉంది… ఆవిడ క‌ద‌లిక‌ల మీద నిఘా వేయండ‌ని చెప్పి ఫోన్ ముగిస్తాడు… ఇదీ క‌థ …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మొన్నటి మన గెలుపు వెనుక… నాటి లోకం మరిచిన పురూలియా కథ…
  • అక్షరాలా ‘ఆనంద భైరవమే… సమాజాన్ని ధిక్కరించిన ఓ గురువు కథ…
  • ఎవరినైనా ఒప్పిస్తావ్… రావిపూడీ, ఎంతైనా నువ్వు ఘటికుడవోయ్…
  • మొత్తానికి బంగ్లాదేశ్ దురాలోచన తెలిసింది… ఇండియా కళ్లు తెరిచింది…
  • ‘హద్దు’దూకిన సంపూర్ణ సందేహాస్పద ప్రేమకథ… అచ్చంగా ఓ తెలుగు టీవీ సీరియల్…
  • జిజ్ఞాసకు ముసలితనమేంటి..? కంప్యూటర్‌ భాషను రపారపా నమిలేశాడు..!
  • ఆకాశ్‌తీర్, రుద్రమ్, బ్రహ్మాస్… పాకిస్థాన్ వెన్నువిరిచిన విధం ఇదీ…
  • బురద జల్లడం కాదు… సరైన సంకల్పంతో రాసినా, గీసినా, తీసినా ఒప్పే…
  • సరిగ్గా కళ్లెట్టుకు చూడు… నిండు విస్తరిలో ఏదో మర్డరు జరిగినట్టు లేదూ…
  • దీన్నే ‘ప్రాప్తం’ అంటారు… పాపం, మనసుల్ని కదిలించే ఓ ‘తల్లి’ కథ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions