తీవ్ర తలనొప్పితో బాధపడుతున్న దివంగత ప్రపంచ ప్రఖ్యాత చెస్ గ్రాండ్ మాస్టర్ బాబీ ఫిషర్.. అమృతాంజన్ ఉందా అని అడిగాడు. దానికి మన గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఒకింత ఆశ్చర్యపోయాడు. ఐస్ ల్యాండ్ లో అది దొరకడంలేదు.. నీవద్దేమైనా అందుబాటులో ఉందా అనే బాబీ ఫిషర్ ప్రశ్న ఆనంద్ ను ఆశ్చర్యచకితుణ్ని చేసింది. అంతలా ప్రపంచాన్ని చుట్టి వచ్చిన ఆ అమృతాంజన్ రూపకర్త ఎవరో నేటివారకెందరికి తెలుసో, లేదో మరి..? తెలియనివాళ్లతో పాటు.. తెలిసినోళ్లూ ఓసారి గుర్తు చేసుకునేందుకు ఓ లుక్క్ వేయొచ్చు!
ఆల్ మోస్ట్ ఇప్పుడున్న జనరేషన్స్ తో సహా.. 1980-90వ దశకంలో అమృతాంజన్ లేని ఏ ఇంటినీ ఊహించుకోలేం. దాదాపు తెలియనివారెవరూ ఉండకపోవచ్చు కూడా. పసుపు రంగులో ఓ చిన్న సీసాలో కనిపించే ఆ ఔషధం ఎందరికో తలనొప్పినే కాదు.. ఒళ్ల నొప్పులను కూడా దూరం చేస్తుందనే నమ్మకమే.. ఇంటింటా అమృతాంజన్ సీసాకో స్థానం ఉండటానికి గల కారణం. ఏ మరాఠో, ఇతర భాషో అన్నట్టుగా వినిపించే అమృతాంజన్ ను కనిపెట్టింది మాత్రం మన తెలుగువాడు.. స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, ది గ్రేట్.. ఆంధ్రపత్రిక వ్యవస్థాపకుడు, పాత్రికేయుడైన కాశీనాథుని నాగేశ్వర్ రావు అనే విషయం ఎందరికి తెలుసు..?
మహాత్మాగాంధీతో కలిసి ఉద్యమాల్లో పాల్గొన్న నాగేశ్వర్ రావు పంతులది.. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కూడా కీలకపాత్ర.1867లో ఆంధ్ర ప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో జన్మించిన నాగేశ్వర్ రావు పంతులు.. ప్రాథమిక విద్యను పూర్తి చేసి.. మద్రాసు క్రిస్టియన్ కాలేజీ నుండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత మందులు తయారుచేసి అమ్మే అపోథెకరీ వ్యాపారం వైపు మళ్లారు. నాటి కలకత్తాలో ఔషధాలను ఎలా రూపొందించాలో ప్రాథమిక శిక్షణ పొందారు. ఆ తర్వాత ముంబైలోని యూరోపియన్ సంస్థైన విలియం అండ్ కంపెనీలో పనిలో చేరారు. అక్కడే పంతులు ఔషధాల తయారీలో ప్రొఫెషనల్ గా తయారై.. ఆ కంపెనీ యజమాని దాన్ని వదిలేసి యూరప్ వెళ్లిపోవడంతో.. కాశీనాథుని మాస్టారే యజమానయ్యారు.
Ads
కానీ, తానే సొంతంగా ఏదైనా కొత్తగా కనిపెట్టాలన్న తపనతో ఉండే కాశీనాథుని నాగేశ్వర్ రావు పంతులుపై.. ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం ప్రభావం కూడా కనిపించేది. అలా తనకున్న అనుభవంతో పాటు.. జాతీయవాద విశ్వాసాలు కూడా బలంగా ఉన్న పంతులు.. స్వదేశీ ఔషధంగా ముక్కుపుటాలను ముంచెత్తే వాసనతో పసుపు రంగులో తయారు చేసిందే అమృతాంజన్. అంతేకాదు.. ముంబైలో 1893లోనే అమృతాంజన్ తయారీకి ఓ పెద్ద కంపెనీని కూడా స్థాపించారు నాగేశ్వర్ రావు పంతులు.
అయితే ఒక ఉత్పత్తిని తీసుకురావడం వేరు.. మార్కెటింగ్ వేరు. ఉత్పత్తి చేయడానికి.. ఫార్మూలాకు ఎంత మేధస్సవసరమో.. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకూ మార్కెటింగ్ నైపుణ్యమంతవసరం. సరిగ్గా అదే సమయంలో వాషింగ్ పౌడర్ నిర్మాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు.. కర్సన్ భాయ్ పటేల్ తరహాలో ఆలోచించారట నాగేశ్వర్ రావు పంతులు. సంగీత కచేరీల్లో తన అమృతాంజన్ ను ఉచితంగా పంపిణీ చేస్తుండటంతో.. ఆ కచేరీలు వినేవాళ్లు వాటిని ఆస్వాదిస్తూనే.. మరోవైపు అదేంటా అని మూత తెరిస్తే ముక్కులదిరిపోయే ఆ ఘాటు వాసన ఆ ఔషధంపై నమ్మకం కల్గించిదట. జస్ట్ పది అణాల ప్రారంభ ధర కల్గిన అమృతాంజన్ ఆ తర్వాత కాశీనాథుని నాగేశ్వర్ రావును లక్షాధికారిని చేసింది.
అయితే, అమృతాంజన్ కేవలం తలనొప్పికి, ఒళ్ల నొప్పులకు ఉపశమనంగానో… తన వ్యాపారాన్ని స్వదేశీ ఔషధమనే పేరుతో మార్కెటింగ్ చేసుకుని డబ్బు సంపాదనకో మాత్రమే నాగేశ్వర్ రావు పంతులు ఉపయోగించుకోలేదు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం జరిగిన ఉద్యమంలోనూ కాశీనాథుని పాత్రెంతో.. ఆయన మేధస్సు నుంటి నుంచి పుట్టుకొచ్చిన అమృతాంజన్ ఔషధ పాత్రా అంతే! ముంబైలో ఉండే తెలుగు ప్రజలతో పాటు.. తన అమృతాంజన్ లిమిటెడ్ కంపెనీలో ఉన్నవారికీ తెలుగు ప్రజల ఆకాంక్షైన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఆవశ్యకతను నూరిపోశారు.
1908లో ఆంధ్రపత్రిక అనే వారపత్రికను ముంబై కేంద్రంగా ప్రారంభించిన కాశీనాథుని నాగేశ్వర్ రావు.. ఐదేళ్లల్లో ఆ పత్రిక బాగా ప్రాచుర్యం పొందడంతో.. దాన్ని 1936లో మద్రాస్ కు మార్చేశారు. అక్కడైతే ఎక్కువ మంది జనాభాకు రీచ్ ఉంటుందని యోచించిన పంతులు దాన్ని మద్రాస్ కు మార్చాక.. ఆ వారపత్రిక కాస్తా.. దినపత్రికగా మారింది. ఆ తర్వాత ఉద్వేగభరితమైన కథనాలతో అప్పట్లో సంచలనం సృష్టించింది.
చెన్నై లోని నాగేశ్వరరావు నివాసమైన శ్రీబాగ్ లోనే చారిత్రాత్మక శ్రీబాగ్ ఒడంబడిక కుదిరింది. కోస్తా, రాయలసీమ నాయకుల మధ్య కుదిరిన ఈ ఒడంబడిక ద్వారా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైంది.
అలా తన అమృతాంజన్ సృష్టి ప్రపంచవ్యాప్తంగా తలనొప్పికి ఓ ఉపశమనపు దేశీయ ఔషధంగా గుర్తింపు పొందితే.. అదే స్ఫూర్తితో ప్రారంభించిన ఆంధ్రపత్రిక నాటి ఆంధ్ర రాష్ట్ర అవతరణలోనూ కీలకపాత్ర పోషించింది. అయితే, ఆ అమృతాంజన్ ఇప్పటికీ అక్కడో, ఇక్కడో లభిస్తుండటం.. దాన్ని పోలిన మరిన్ని బామ్స్ మార్కెట్లోకి రావడం వెనుక దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వర్ రావు స్ఫూర్తే కారణం. అయితే, కొసమెరుపుగా ఓ చమత్కారం గురించి కూడా చెప్పుకుని ముగించాలి. ఆంధ్రపత్రిక నడపడమంటే పెద్ద తలనొప్పండి అన్నారట కాశీనాథుని నాగేశ్వర్ రావు ఓసారి.. ఏంపర్లేదండీ అమృతాంజన్ కూడా మీదే కదా అన్నారట రాజాజీ.
Share this Article