ఒక వార్త బాగా ఆకర్షించింది… పల్లెల నుంచి, పేద వాతావరణాల నుంచి, నిరాశాపూరిత నేపథ్యాల నుంచి ఎదిగిన ఎందరో యువత ఈ దేశం యొక్క కలల్ని ముందుకు తీసుకెళ్తున్నారు… ఆశాకిరణాలుగా భాసిల్లుతున్నారు అనే వాక్యం ఆ వార్తకు ముగింపు… అవును, పడీలేస్తూ ఫీనిక్స్ పక్షుల్లా ఎదుగుతున్నారు… వెలుగుతున్నారు… నిజానికి వాళ్లే ఈ దేశానికి బలం… వీళ్లే మన శాస్త్రీయ పురోగతి వేగానికి బాల్ బేరింగ్స్… క్రయోజనిక్ ఇంజన్లు… చంద్రుడి దక్షిణ ధృవం మీద ఇండియా జెండా పాతడానికి ఇలాంటి వాళ్ల కృషి, నిబద్ధత, నైపుణ్యాలే కారణం…
చంద్రయాన్3 విజయం తరువాత కూడా దేశాన్ని కించపరిచే రాతలు రాసిన, కూతలు కూసిన ప్రబుద్ధులకు కొదువ లేదు… చివరకు చంద్రయాన్ విజయసంకేతం వెలువడగానే మోడీ తెర మీద కనిపించడం వాళ్లకు నచ్చలేదు… అదీ కారణం… పైగా ఇక్కడ ఈ మట్టి మీద బతుకుతూ, ఈ తిండి తింటూనే ఈ దేశాన్ని ద్వేషించే మూర్ఖులకు కొదువ లేదు కదా… దేశం గర్వించే క్షణాన ఈ దేశ ప్రధాని అభినందనలు చెప్పవద్దా..? అదుగో… ఆ వెకిలి ఏడుపుల నడుమ… అందుకని ఆ వార్త నచ్చింది…
Ads
ఈ కథలో హీరో ఓ పిల్లాడు… పేరు భరత్ కుమార్… ఊరు చత్తీస్‌గఢ్‌లోని చారుడా… తండ్రి ఒక బ్యాంకులో సెక్యూరిటీ గార్డ్… జీతం సరిపోయేది కాదు… తల్లి ఓ టీస్టాల్ నడిపేది… ఇడ్లీలు కూడా అమ్మేది పొద్దున పూట… భరత్ కుమార్ కూడా ప్లేట్లు, గిన్నెలు కడుగుతూ తల్లికి సాయం చేసేవాడు… ఆర్థిక అవరోధాలు, ఈ పనుల నడుమ కూడా తన చదువును నిర్లక్ష్యం చేయలేదు… కేంద్రీయ విద్యాలయంలో చేరాడు… చదువంటే ప్రేమ… 9వ తరగతి చదువుతున్నప్పుడు ఫీజు కట్టే స్థోమత లేక చదువు మానేయాల్సిన దుస్థితి…
అప్పుడు పాఠశాల యాజమాన్యం ఫీజుల్ని రద్దు చేసింది… టీచర్లు కొంత సాయం చేశారు… టెన్త్ అయిపోయింది… ఎలాగోలా ప్లస్‌టూ కూడా అయిపోయింది… తనకు ఏకంగా ధన్‌బాద్ ఐఐటీలో సీటొచ్చింది… కానీ ఆ చదువు ఎలా..? తల్లిదండ్రుల పేద నేపథ్యం మరోసారి భరత్ కుమార్ చదువుకు అడ్డంకిగా నిలిచింది… ఎలాగోలా తన కొడుకును బాగా చదివించాలని ఆ తండ్రికి బలమైన కోరిక… ఈ స్థితిలో రాయపూర్‌కు చెందిన వ్యాపారి అరుణ్ బాగ్, జిందాల్ గ్రూప్ భరత్‌కుమార్‌కు భరోసాగా నిలబడ్డాయి…
(మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ X (గతంలో ట్విట్టర్)లో ధృవీకరించబడిన హ్యాండిల్‌తో అతని ప్రస్థానాన్ని ఆరైన్ష్ అనే వ్యక్తి షేర్ చేసుకున్నాడు…)
There is a small town called Charouda in Chhattisgarh, unfamiliar to most of us, there lived a boy named Bharat. He belongs to a weak financial family. His father worked as a security guard at a bank and his mother ran a tea stall
Later age he went to Kendriya Vidyalaya Charouda… pic.twitter.com/SPljhJHgQC
— Aaraynsh (@aaraynsh) August 24, 2023
భరత్ చదువు మీద శ్రద్ధ తన చదువుకు ఐఐటీ ధన్‌బాద్‌లో 98 శాతం స్కోర్ సంపాదించి పెట్టింది… ఏడో సెమిస్టర్ చదువుతున్నప్పుడే తనలోని మెరిట్ గుర్తించిన ఇస్రో తనను కొలువులోకి తీసేసుకుంది… ఇప్పటికి తన వయస్సు 23 ఏళ్లు మాత్రమే… తన మెరిట్ ఆధారంగా అక్కడ కీలకమైన చంద్రయాన్ ప్రాజెక్టులోకి తీసుకున్నారు… సో, ప్రతిభ ఎవరి సొత్తూ కాదు… అందుకే నిన్నటి విజయం ఈ దేశం మొత్తానిది… ప్రత్యేకించి ‘భరత్ కుమార్’ వంటి మెరికలది… వీళ్లే ఆదిత్య, గగనయాన్, శుక్రయాన్… ఇంకా అన్ని రాబోయే యానాలకూ దిక్సూచులు…
Share this Article