Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నెవ్వర్… మోడీ తన విచక్షణాధికారాన్ని సుప్రీంకోర్టుకు అప్పగిస్తాడా..?

August 12, 2023 by M S R

Highhandedness: “Democracy is an anarchy; but there is no better alternative for democracy- ప్రజాస్వామ్యమంత అరాచకమయినది మరొకటి లేదు; దానికి మించిన మెరుగయిన వ్యవస్థ ప్రపంచంలో మరొకటి లేదు” అని ఎవరన్నారో కానీ…ఇప్పుడు భారత సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు చూస్తే ఈ “అరాచకం” విమర్శలో ఎంత లోతు ఉందో అర్థమవుతోంది. దేశంలో ఎన్నికలు నిర్వహించడానికి స్వయం ప్రతిపత్తిగల ఎన్నికల సంఘం ఉంది. దానికి కొన్ని విధి విధానాలు, ప్రత్యేక హక్కులు ఉన్నాయి. అయితే ఆ స్వయం ప్రతిపత్తి డిబేటబుల్. ఎన్నికల సంఘం నిష్పాక్షికత మీద సాపేక్షమయిన అభిప్రాయాలే వ్యక్తమవుతూ ఉంటాయి. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి, ఇతర సభ్యుల నియామకం మీద సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేస్తూ…చాలా తీవ్రమయిన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలన్నీ తుది తీర్పులో భాగమవుతాయో లేదో తెలియదు కానీ…విచారణ సందర్భంగా వాద ప్రతివాదనల్లో కామెంట్లు కూడా తీర్పులన్నట్లు మీడియాలో వస్తున్న రోజులు కాబట్టి…ముందు సుప్రీం కోర్టు అన్న మాటలేమిటో చూద్దాం.

1. ప్రధానిపైన అయినా చర్యలు తీసుకోగలిగే ఎన్నికల ప్రధానాధికారి ఉండాలి.
2. ప్రభుత్వాలు శాశ్వతంగా అధికారంలో ఉండడానికి తాము చెప్పినట్లు వినే కీలుబొమ్మలను ఎన్నికల ప్రధానాధికారిగా నియమిస్తున్నాయి.
3. ఎన్నికల సంఘం రాజకీయ ప్రలోభాలకు దూరంగా స్వతంత్రంగా ఉండాలి.
4. నీతి నిజాయితీ ఉన్నవారినే ఆ పదవిలో నియమించాలి.
5. టి ఎన్ శేషన్ లాంటి అధికారులు మళ్లీ ఎన్నికల సంఘానికి ఎందుకు దొరకలేదు?
6. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన ఎన్నికల ప్రధానాధికారి అరుణ్ గోయల్ నియామక ప్రక్రియ ఫైళ్ళన్ని కోర్టుకు సమర్పించాలి.
7. ఎన్నికల సంఘం ప్రధానాధికారి/సభ్యుల నియామకాల్లో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ను కూడా భాగస్వామిని చేయాలి.

Ads

ఇవన్నీ ఆచరణ సాధ్యమే అయినా…రాజకీయ ఆచరణలో అసాధ్యం అని అందరికీ తెలుసు. పాఠం రెండు రకాలు.
ఒకటి- అకెడెమిక్.
రెండు- ప్రాక్టికల్.
అకెడెమిక్ గా సుప్రీం కోర్టు చెబుతున్నది సాధ్యమే. ప్రాక్టికల్ గా అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమయినా…
తనే కత్తి నూరి పదును పెట్టి…ఆ కత్తిని పువ్వుల్లో పెట్టి ఎన్నికల ప్రధానాధికారి చేతికిచ్చి…తన మెడ కోసి పుణ్యం కట్టుకోమని అడుగుతుందా?

ఎంత రాముడు నడిచిన నేల మీద మనమున్నా…
అప్పుడది త్రేతాయుగం.
ఇప్పుడిది కలియుగం.

రామరాజ్యం సంభవించే కాలమా ఇది?

ఇక్కడిదాకా ఉన్న ఈ భాగం ఎన్నికల కమిషన్ నియామకాలు, కమిషన్ స్వతంత్రంగా పని చేయాల్సిన అవసరం గురించి సుప్రీం కోర్టు తీర్పు చెప్పినప్పుడు ఐ ధాత్రి ప్రచురించిన వ్యాఖ్య.

ఇప్పుడు వర్తమానంలోకి వద్దాం.
దీనికి సమాధానంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తాజాగా ఏమి చేసిందో చూడండి. కేంద్ర ఎన్నికల ప్రధానిధికారి, సభ్యుల నియామకానికి ఏర్పాటయిన ఎంపిక కమిటీ నుండి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగిస్తూ రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టింది. (ఈ బిల్లు చట్టం కావడం లాంఛనమే) ఆ స్థానంలో కేంద్ర మంత్రిని చేర్చింది. అంటే పాత కమిటీలో ప్రధాని, ప్రతిపక్ష నేత ఇద్దరూ అలాగే ఉన్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్ర మంత్రి వచ్చారు. 2 :1 అభిప్రాయంలో ఇద్దరి అభిప్రాయం మెజారిటీగా చెల్లుబాటు అవుతుంది కాబట్టి…ప్రధానితో కేంద్ర మంత్రి ఎలాగూ విభేదించే అవకాశాలే ఉండవు కాబట్టి…ప్రతిపక్ష నేత అభిప్రాయాన్ని ఎలాగూ వీటో చేస్తూ గడ్డిపోచ కంటే హీనంగా తీసి పారేయవచ్చు కాబట్టి…ప్రధాని అనుకున్న వ్యక్తే కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి, సభ్యులు అవుతారు. అలా నియమితులయిన వారు ఎవరి ప్రయోజనాలకోసం ఎంత నిష్పక్షపాతంగా, ఎంత స్వయంప్రతిపత్తితో పనిచేస్తారో! ఎవరికి వారు ఊహించుకోవచ్చు.

కేంద్ర మంత్రి మండలి సిఫారసు మేరకు ఎన్నికల సంఘం ప్రధాన అధికారి, ఇతర సభ్యులను రాష్ట్రపతి నియమించే సంప్రదాయం చాలా కాలం పాటు ఉండేదని, మొన్న మార్చి నెలలో సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ అమల్లోకి వచ్చిందని…ఎన్నికల సంఘానికి సంబంధించిన ఏదయినా న్యాయ సమీక్ష సమస్య వచ్చినప్పుడు…ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్వంలో నియమించిన కమిషన్ నిర్ణయాలను సుప్రీం కోర్టులోనో, కింది హై కోర్టుల్లోనో ఇతర న్యాయమూర్తులు విచారించడం మర్యాద కాదని…అందుకే ప్రధాన న్యాయమూర్తిని తప్పించారని బి జె పి నిర్ణయాన్ని సమర్థిస్తున్న వారి వాదనలో నిజం పెరుమాళ్ళకే ఎరుక!

ఢిల్లీ అధికారుల సర్వీసు రూల్స్, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ కొనసాగింపు…తాజాగా ఎన్నికల సంఘం అత్యున్నత అధికారుల నియామకం…ఇలా కేంద్రం సుప్రీం కోర్టుతో అమీ తుమీకి దిగి...చట్ట సవరణలు, కొత్త చట్టాల ద్వారా పైచేయి సాదించానని పొంగిపోతూ ఉండవచ్చు. ప్రజాస్వామ్యంలో చట్టం, న్యాయం, పాలన మూడూ మూల స్తంభాలే. ఒకదానికొకటి దోహదం చేసుకోవాలే కానీ…ఇలా గొడవ పడకూడదు. ఏ ఒక్క స్తంభానికీ సర్వాధికారాలు ఉండి మిగతా స్తంభాలను కూల దోయకూడదని రాజ్యాంగ నిర్మాతలు ఎక్కడికక్కడ ఒకదానిని ఒకటి ఒక కంట కనిపెట్టుకుని ఉండేలా Checks and balances ఉద్దేశపూర్వకంగానే పెట్టారు.

ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల కమిషన్ కథే దేవతా వస్త్రమయితే…ప్రజాస్వామ్య దేహం మీద ఉన్న వస్త్రం కూడా దేవతా వస్త్రమే అవుతుంది. అప్పుడది కనీసం ఇంగువ కట్టిన గుడ్డ కూడా కాదా! ఏమో!

“ఉన్నది మనకు ఓటు-
బతుకు తెరువుకే లోటు”.

-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions