Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒక్కడు..! ఆ చార్మినార్ సెట్, దాని చుట్టూ ఓ కథ… ఓ దర్శకుడి తపన..!

November 12, 2025 by M S R

.
Ashok Pothraj …… చార్మినార్ దగ్గరి ఒక కేఫ్ లో కూర్చుని చాయ్ తాగుతూ ప్రతీ సిప్పుకీ తదేకంగా దాని వైపే చూస్తూ ఆలోచిస్తున్నాడు దర్శకుడు గుణశేఖర్.. తను మద్రాస్ నుండి హైదరాబాద్ సినిమా వర్క్ మీద ఎప్పుడొచ్చినా ఇక్కడ ఆ కేఫ్ లో కూర్చుని చార్మినార్ చుట్టూ ఉన్న వాతావరణం చూస్తూ చాయ్ తాగనిదే ఆయనకు ఆ రోజు గడవదేమో,

ఐతే అప్పటికీ తను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు, తను డైరెక్టర్ అయ్యాక ఈ చార్మినార్ దగ్గర సినిమా తీయాలనుకోవడం ఆయనకు అలవాటుగా మారింది. ఆ సీన్ కట్ చేస్తే… ఈ చార్మినార్ బ్యాగ్రౌండ్ మీద ఒక హీరో దానికి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఫ్రేమ్ సెట్ చేసి తీయాలని కసిగా ఉన్నాడు.

రెండు యూత్ గ్యాంగ్స్, మధ్యలో చార్మినార్, ఆ గ్యాంగ్స్ మధ్య తగాదాలు వాటిని బేస్ చేసుకుని తెలుగు నేటివిటీని కథగా అల్లుకునీ పిక్చర్ తీస్తే.. ఎలా ఉంటుంది అంటూ పేపర్ వర్క్ మొదలు పెట్టాడు. అలా ఆలోచిస్తూ నెలల తరబడి రాస్తూనే ఉన్నాడు. ఆ కథ ఎంతకీ ఒక కొలిక్కి రావడం లేదు.. ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తే…?

Ads

కొన్నేళ్ల తర్వాత రామానాయుడు స్టూడియోలో “చూడాలని వుంది” పిక్చర్ రీ రికార్డింగ్ జరుగుతుంది. డైరెక్టర్‌గా మారిన గుణశేఖర్ గారు చాలా బిజీగా ఉన్నారు. ఆ పిక్చర్ నిర్మాత అశ్వనీదత్ గారు వచ్చారు.. అప్పుడు గుణశేఖర్ గారు సారీ సర్, మీ కొత్త పిక్చర్ ఓపెనింగ్ కి రాలేకపోయాను అంటూ చెప్పారు. సరే, ఏం పర్లేదు అన్నాడు. వర్క్ బిజీలో ఉన్నారు కదా అని చిన్నగా నవ్వుతూ అన్నాడు. ఇంతలో గుణశేఖర్ గారు ఇలా అడిగారు కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబు ఎలా వున్నాడు సార్ అనీ..!

ఓ తనకేం రాజకుమారుడిలా చాలా హుషారుగా ఉన్నాడంటూ ఇద్దరు అతని మొదటి సినిమా ఓపెనింగ్ విశేషాలు మాట్లాడుకుంటూ కారులో బయల్దేరారు. అప్పుడు తన కారులో ఉన్న కొన్ని ఫోటో స్టిల్స్ ని చూపించారు అశ్వనీదత్ గారు, ఆ ఒక్కొక్క స్టిల్ చూస్తుంటే గుణశేఖర్ గారి మైండ్లోంచి ఫ్లాషెష్.. చార్మినార్ టాప్ మీద వెన్నెల్లో సిగరెట్ పీలుస్తూ ఉన్న ఓ కుర్రాడు, ఆ కుర్రాడు అచ్చం మహేష్ బాబు లా ఉన్నాడే అని ఊహిస్తూ అనుకున్నాడు. అక్కడ కట్ చేస్తే..

ఒకరోజు అశ్వనీదత్ గారి ఆఫీస్ కి వచ్చాడు మహేష్ బాబు,
ఆ సమయంలో ఇతను కూడా అక్కడే ఉన్నాడు. ఇద్దరూ కాసేపు సరదాగా చిట్ చాట్ చేసారు. మాటల్లో భాగంగా గుణశేఖర్ గారి మైండ్ లో తిరిగుతున్న చార్మినార్ స్క్రిప్ట్ బయటికొచ్చింది. దొరికిందే తడవుగా ఆ స్టోరీ లైన్ చెప్పాడు. అరే భలే ఉంది ఈ పాయింట్ అంటూ మహేష్ బాబు ముచ్చట పడ్డాడు.

మీరు పూర్తి కథతో రండి సార్, మీరెప్పుడంటే అప్పుడే కథ ఓకే చేద్దాం కలిసి పనిచేద్దామనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు హీరో ఇప్పుడు కట్ చేస్తే…

రెండేళ్ల తర్వాత గుణశేఖర్ గారు చిరంజీవి గారితో చూడాలని వుంది హిట్ తర్వాత మృగరాజు పిక్చర్ చేసారు. అదీ భారీ డిజాస్టర్ అయ్యింది. ఆయనకు అది కోలుకోలేని దెబ్బ..! కానీ.. ఇంకా ఆయన బుర్రలో చార్మినారే కనబడుతోంది. ఇక ఆ కథకు టైమొచ్చింది, కొన్ని నెలల పాటు అదే కథను రెడీ చేసే పనిలో పడ్డాడు. ఆ సమయంలో ఒక పేపర్ లో బ్యాడ్మింటన్ పుల్లెల గోపీచంద్ గారి ఇంటర్వ్యూ ఆర్టికల్ వచ్చింది. అది చదివిన అతనికి ఎస్ కథలో కీలక పాత్ర దొరికింది అనిపించింది.

గోపి చంద్ వాళ్ల నాన్నగారికి స్పోర్ట్స్ అంటే ఇంట్రస్ట్ లేకపోవడం, అతను ఎన్నో కష్టాలు పడి బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా ఎదగడం, ఇదంతా అతనికి ఇన్స్పైరింగ్ గా అనిపించింది. నా కథలో హీరో పాత్ర ఆల్మోస్ట్ ఇలాంటిదే.. ! తండ్రి నో చెప్పినా కొడుకు కబడ్డీ కబడ్డీ అంటూ తిరుగుతూ తన సహచరులతో గొడవలు పెట్టుకుంటూ ఉంటాడు. ఇదే పాయింట్ పట్టుకుని ఒక కథను రెడీ చేసుకున్నాడు. కట్ చేస్తే..

రామోజీ రావు గారి ఆఫీస్ డైరెక్టర్ కథ చెబుతున్నారు రామోజీ గారు వింటూ ఉన్నారు. కథ మొత్తం విన్నాక ఓకే ఈ కథ బాగుంది మనమే చేయాలి ఈ పిక్చర్, ఆ చార్మినార్ సెట్ ఏదో మన ఫిల్మ్ సిటీలోనే ఎన్ని కోట్లైనా ఖర్చు చేసి వేసేద్దామన్నారు రామోజీ రావు గారు. అది విన్న గుణశేఖర్ గారి కొన్నేళ్ల నాటి కల నిజం కాబోతుందని సంతోష పడ్డాడు. ఇక్క‌డ కట్ చేస్తే..

ఆ కథకు అక్కడ బ్రేక్ పడింది. తర్వాత కథలో కి ఎంఎస్ రెడ్డి గారు వచ్చారు అది కూడా బ్రేక్.. కట్ చేస్తే..

పద్మాలయ స్టూడియోలో మహేశ్ గుణశేఖర్ గారు నిర్మాత కోసం తెగ వెతుకుతున్నారు. ఉన్నట్టుండి లైన్లోకి ఎంఎస్ రాజు గారు వచ్చారు. మహేష్ బాబు ఆయనకు ఫోన్ చేసి మాట్లాడి అర్జెంటుగా స్టూడియోకి రమ్మన్నాడు. అతను వచ్చాక ముగ్గురు ఒక చోట కూర్చుని కథలో లీనమయ్యారు.. కథ ఆయనకు నచ్చింది వెంటనే ఓకే చెప్పారు. కానీ.. ఒక కండీషన్ పెట్టాడు మహేష్ బాబు. చార్మినార్ సెట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, దానికి ఎంత ఖర్చైనా భరించాలని, అదే ఈ సినిమాకు హైయెస్ట్ ఇంపాక్ట్ అనీ.. కథలో బలం ఉంది కాబట్టి రాజుగారు సరే అన్నారు.

మొత్తం మీద ఈ కథకు అలా బలం చేకూరింది. ఇక.. హీరో మహేష్ బాబు, విలన్ ప్రకాష్ రాజ్ గారు, నిర్మాత ఎంఎస్ రాజు, దర్శకుడు గుణశేఖర్ మరీ హీరోయిన్ ఎవరు…? ఇదే అందరీ మైండ్ లో పేద్ద క్వశ్చన్ మార్క్..? అప్పుడే సుమంత్ “యువకుడు” అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన లేత గులాబీలా తళుక్కుమంటున్న భూమిక వైపు తిరిగాయి. అందరి కళ్లు ఇప్పుడు కట్ చేస్తే.. తను ఓకే అయ్యింది.

okkadu

సంగీతం మణిశర్మ, మాటలు పరుచూరి బ్రదర్స్, కెమెరా శేఖర్ వి జోసెఫ్, ఆర్ట్ డైరెక్టర్‌ అశోక్ ఇలా ఒక మూవీ టీమ్ స్ట్రాంగ్ గా బిల్డ్ అయ్యింది. ఇక తరువాయి ఈ పిక్చర్ టైటిలే మిగిలింది. గుణశేఖర్ గారు “అతడే ఆమె సైన్యం” అన్నాడు. అదీ ఎప్పుడో రిజిస్ట్రేషన్ అయింది. వాళ్లను ఎంతో ఒప్పించే ప్రయత్నం చేసారు కానీ వాళ్లు ఒప్పుకోలేదు. తర్వాత “కబడ్డీ” అనుకున్నారు నో ఛాన్స్..…!

ఫైనల్ గా “ఒక్కడు” అన్నాడు డైరెక్టర్. అది విన్న ఒక్కరూ నో అనలేదు, ఇక ఇదే ఫైనల్ టైటిల్ అయింది.
తర్వాత హైదరాబాద్ శివారులోని గోపనపల్లిలో రామానాయుడు గారి పదెకరాల ఖాళీ స్థలం ఉంది, 120 అడుగుల్లో అక్కడ చార్మినార్ సెట్ వేసారు. సినిమాలో కథకు అనుగుణంగా నాలుగు మినార్లే అవసరం కాబట్టి తక్కువ హైట్ లో వేసారు. దానికి చుట్టూరా ఓల్డ్ సిటీ సెటప్ ఐదెకరాల స్థలం సరిపోయింది. మూడు నెలలు, మూడొందల మంది రేయింబవలు కష్టపడ్డారు. కట్ చేస్తే…!

ఒకపక్క మృగరాజు లాంటి అట్టర్ ఫ్లాపు డైరెక్టర్‌తో, దేవిపుత్రుడు లాంటి భారీ డిజాస్టర్ ఉన్న నిర్మాత సరిపోయారిద్దరూ.. దానికి తోడు భారీ బడ్జెట్..! పాపం మహేష్..! అంటూ ఇండస్ట్రీలో గుసగుసలు..
అవన్నీ వీళ్లకు వినపడుతున్నా పట్టించుకోకుండా వారి పనుల్లో వాళ్లు నిమగ్నమయ్యారు. ఎవరి మాటలు వినొద్దు. మనిషి మాట అసలు వినొద్దు అనే దృక్పథంతో కసిగా తీయాలి. ఇండస్ట్రీకి మంచి బ్లాక్ బస్టర్ అందించాలని ఎంతో కష్టపడ్డారు. ఇక్కడ అందరి కంటే మొండివాడు ఎంఎస్ రాజు.

okkadu

మొండి వాడు రాజు కంటే బలవంతుడు అనీ.. అంటే ఇక్కడ రాజు తనే మొండివాడు తనే అనే లాజిక్ వర్తిస్తుంది కదా..! అలా డబ్బులు పోస్తూనే ఉన్నాడు. ఆ రోజుల్లో దాదాపు పదిహేను కోట్ల రూపాయల ఖర్చు చేసాడంటే సాహసమనే చెప్పాలి. ఇక ఫైనల్ ఔట్ పుట్ రానే వచ్చింది.

పాటలు ఒక రేంజ్ ఐతే ప్రతినాయకుడు ప్రకాష్ రాజ్ పెర్ఫామెన్స్ అదుర్స్. 2003 జనవరి సంక్రాంతి బరిలో పందెం కోళ్ల వరుసలో చేరింది. మహేష్ బాబు ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ 31 కోట్ల రూపాయలు వసూలు చేసి ఆమాంతం తన కెరీయర్ని ఒక రేంజ్ లో నిలబెట్టింది ఈ సినిమానే.. 2003కి గాను ఎనిమిది నంది అవార్డులు కూడా అందుకుంది ఈ “ఒక్కడు”…

#okkadu #maheshbabu #storytelling #gunashekar #msraju #sumanthproduction #BhumikaChawla #PrakashRaj #ManiSharma #ashokpothraj #trending #oldmemories #fbpost2025 #viralpost2025 #fbreels

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాటలో భళా… మాటలో భోళా… నాకు తెలిసిన అద్వైతి అందెశ్రీ …
  • అందెశ్రీ ఎవరినీ ఎప్పుడూ శపించలేదు… ‘మనిషిని అన్వేషించాడు’…
  • ఒక్కడు..! ఆ చార్మినార్ సెట్, దాని చుట్టూ ఓ కథ… ఓ దర్శకుడి తపన..!
  • కల్తీ నెయ్యి కాదు… అసలు నెయ్యే కాదట… భారీ అపచారం కథ…
  • ‘తాజా నిమ్మ సోడా’ గిరిజ ఓక్..! రాత్రికి రాత్రే సోషల్ మీడియా సంచలనం..!!
  • శ్రావ్యమైన ఈ గొంతు… 3800 పసి గుండెల శృ‌తి సరిచేసింది..!
  • అసలే ఆదివిష్ణు.., పైగా జంధ్యాల… ఇంకేం.? నవ్వులే నవ్వులు..!
  • …. అందుకే రేవంత్ రెడ్డి తన వ్యతిరేకులకూ నచ్చుతాడు కొన్నిసార్లు..!!
  • బిడ్డని వదిలేసి వెళ్లిన తల్లి మీద కోపం వస్తుంది మొదట… కానీ..?
  • రేణుకా షహానీ..! నెలవారీ చెల్లింపుతో సహజీవనం ఆఫర్ ఇచ్చాడు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions