Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎవరీ అర్చకుడు రంగరాజన్…? మరోసారి చదవాల్సిన సందర్భం..!!

February 10, 2025 by M S R

.

ఎవరీ రంగరాజన్ అను ఓ అర్చకుడి కధ – భండారు శ్రీనివాసరావు

(ఇప్పుడీ పోస్ట్ అవసరం ఏమిటన్నది సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి అర్ధం అవుతుందని ఆశిస్తున్నాను )

Ads

ఎప్పుడో కానీ నేను గుళ్ళకు పోను. అక్కడ వుండే పాండురంగడు ఇక్కడ వున్నాడు అనే థియరీ నాది. గుడికి పోవాలి అని నాకు అనిపిస్తే ముందుగా వెళ్ళేది హైదరాబాదు శివార్లలోని చిలుకూరు బాలాజీ దేవాలయానికి.

అక్కడ కూడా భక్తుల హడావిడి ఎక్కువే. కానీ హుండీ కనపడని ఆలయం అది. వీ.ఐ.పీ. బ్రేకులు, టిక్కెట్ల మీద ప్రత్యేక దర్శనాలు లేని దేవాలయం అది. పెద్దవాళ్లు, చిన్నవాళ్లు, ఉన్నవాళ్లు, లేనివాళ్లు అనే తేడా లేకుండా అందరూ వరుసగా వెళ్లి దైవదర్శనం చేసుకోవడానికి వీలైన గుడి అది. అందుకే నాకు ఆ గుడి అంటే మక్కువ ఎక్కువ.

గర్భగుడిలో వున్న బాలాజీకి వీసా దేవుడు అనే పేరుంది. అక్కడికి పోయి పదకొండు ప్రదక్షిణలు తర్వాత దర్శనం చేసుకుని మనసులో కోరుకుంటే అమెరికన్ వీసా దొరుకుతుంది అనే నమ్మకం ఆ గుడి విషయంలో వుంది అని విన్నాను. కోరిక తీరిన వాళ్ళు మళ్ళీ ఆ గుడికి వెళ్లి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి మొక్కు తీర్చుకుంటారు అంటారు.

సువిశాల ప్రాంగణంలో అనేక ఏళ్ళుగా నిద్రాణంగా ఉండిపోయిన ఆ దేవాలయానికి ఇంతగా ప్రాచుర్యం లభించడానికి కారణం సౌందర రాజన్ అనే పెద్దమనిషి. ఉన్నత చదువులు అభ్యసించారు. కామర్స్ లెక్చరర్ నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ స్థాయికి ఎదిగారు.

చిలుకూరు గుడికి అనువంశిక ధర్మకర్త. రిటైర్ అయిన తర్వాత అదే దేవాలయంలో ప్రధాన అర్చక వృత్తి స్వీకరించారు. దేవాలయాలు ప్రభుత్వ అధీనంలో ఉండరాదని దశాబ్దాలుగా సాగిస్తున్న ఉద్యమానికి ఆయన వన్ మ్యాన్ ఆర్మీ.

నేను రేడియోలో పనిచేసే రోజుల్లో ఆయన తరచుగా మా దగ్గరకు వస్తుండేవారు. అనేక ఆధ్యాత్మిక విషయాలు చర్చిస్తూ వుండేవారు. ఆయన కుమారుడే సౌందర రాజన్ రంగరాజన్. ఈ వ్యాసానికి స్పూర్తి. తండ్రిలాగే ఆయన కూడా విద్యాధికుడు. ఎప్పుడైనా ఆ గుడికి వెళ్ళినప్పుడు తండ్రీ కొడుకులతో మాట్లాడడం నాకు ఓ వ్యాపకంగా మారింది.

పెద్ద చదువులు చదివి ఈ వృత్తిని ఎంచుకోవడంలో ఏదైనా కారణం ఉందా అని అడిగినప్పుడు రంగరాజన్ ఎన్నో విషయాలు చెప్పుకుంటూ పోయారు. అవి ఆయన మాటల్లోనే.

“మా ఇంట్లో ముగ్గురం అబ్బాయిలమే. నేను నడిమివాణ్ణి. నేను చదువుకున్నదంతా క్రైస్తవ మిషనరీ బడుల్లోనే. అక్కడి దేవుని ప్రార్థనా గీతాలు అలవోకగా పాడేవాణ్ణి. టీచర్లు నా చేత సంస్కృత శ్లోకాలు చెప్పించుకుని ఆనందించేవాళ్లు.

నుదిటిమీద పెద్దగా నామాలు పెట్టుకునే బడికి వెళ్లేవాణ్ణి. క్రైస్తవ పాఠశాలలైనాసరే ఈ విషయంలో అక్కడెవరూ నన్ను ఆక్షేపించింది లేదు. ఆ పరమత సహనమే నా వ్యక్తిత్వాన్నితీర్చిదిద్దిందని చెప్పాలి.

“ఇంజినీరింగ్ పూర్తయ్యాక చెన్నైలో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం. అక్కడ పనిచేస్తున్నంతకాలం చిలుకూరు గుడికి దూరమవుతున్నాననే బాధ పీడిస్తూనే ఉండేది. ఆరేళ్లు గడిచాయి. ఇక ఉండబట్టలేక ఉద్యోగం మానేస్తానని చెప్పాను. దాంతో నాకోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ప్రాంతీయ కార్యాలయం ఒకటి తెరిచారు.

“దక్షిణాది మొత్తానికి నన్ను హెడ్‌గా నియమించారు. 1999 లోనే సంవత్సరానికి పది లక్షల రూపాయల జీతం! “అప్పుడు ఉమ్మడి రాష్ట్రం. 1987లో నాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హిందూ దేవాలయాల్లో వంశపారంపర్య అర్చకత్వాన్ని రద్దు చేసింది.

“నాన్నగారు చట్టరీత్యా పోరాడి సుప్రీంకోర్టు నుంచి కొత్త మార్గదర్శకాలు తెప్పించుకోవడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. 1995 తర్వాత ఆలయానికి భక్తుల తాకిడి పెరగడంతో దేవాదాయశాఖ దీన్ని సొంతం చేసుకోవాలనుకుంది.

“మా గుడిని యాదగిరిగుట్టకి అనుబంధ ఆలయంగా మార్చాలనుకుంది. అప్పుడు నాన్నగారు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చూపించి వాదించారు. అప్పుడు ఓ అధికారి ఇలా అన్నారు.

‘సౌందర్‌రాజన్‌గారూ, మీ అబ్బాయిలు ముగ్గురూ ఇంజినీర్లు. వాళ్లు ఇక్కడికొచ్చి అర్చకత్వం ఎలాగూ చేయరు. ఇక దేనికండీ మీకీ వారసత్వపు హక్కుల గురించిన ఆరాటం!’ అన్నారు. ఆ మాటలు నన్ను ఓ కొరడాలా తాకాయి. ఆ రోజే నిర్ణయించుకున్నా, నాన్నగారి వారసత్వాన్ని నేనే ముందుకు తీసుకెళ్లాలని!

“నాకప్పుడు 35 ఏళ్లు. మంచి జీతం, ఇంకా మంచి భవిస్యత్తు వున్న ఉద్యోగం. ప్రేమించి పెళ్ళాడిన భార్య. చీకూ చింతాలేని సంసారం. ‘ఇంతమంచి ఉద్యోగం వదులుకుని అర్చకత్వం చేస్తారా!’ అని నలుగురూ నవ్వారు. ఎవరేమన్నా, అర్చకుడిగా నా ఆహార్యం మార్చుకుని ఆలయంలోకి అడుగుపెట్టి హారతి పళ్లెం అందుకున్నాను.

“రోజూ దేవుడికి సమర్పించిన నైవేద్యం మాత్రమే నా ఆహారం. ఆధునిక వస్త్ర ధారణ వదిలేసి అలా మారిపోయిన నన్ను చూసి మా ఆవిడ మొదట్లో వచ్చే కన్నీళ్లని దాచుకునేందుకు విఫలయత్నం చేసేది. “ఆదాయం లేకపోవడంతో అప్పటిదాకా ప్రైవేటు బడుల్లో చదువుతున్న పిల్లల్ని తెచ్చి కేంద్రీయ విద్యాలయంలో చేర్చాను.

“అర్చకుడిగా మారిన తొలి రోజుల్లోనే నాన్నగారితో మాట్లాడి ఆలయంలో హుండీని తీసేయించాను. వీఐపీ దర్శనాలూ, టిక్కెట్టు దర్శనాలు లేకుండా ఆలయానికి వచ్చే భక్తులందరూ సమానమేనని ప్రకటించాను. ఇప్పటికీ అదే తు.చ.తప్పకుండా పాటిస్తున్నాం.

“ఏ ఆదాయమూ లేదు కాబట్టి దేవాదాయ శాఖకి మా ఆలయం మీద ఆజమాయిషీ చలాయించే అవకాశం లేకుండా పోయింది. “1990కి ముందు మా ఆలయానికి వారం మొత్తం మీద వెయ్యిమంది వస్తే గొప్ప! ఇప్పుడు వారాంతాల్లో నలభై వేల మంది దాకా వస్తున్నారు.

గుడికి వచ్చేవారికి సనాతనధర్మం గొప్పతనం గురించి చెబుతుంటాం. సనాతన ధర్మమంటే మూఢాచారాలు, స్త్రీల పట్ల వివక్ష, అంటరానితనాన్ని ప్రోత్సహించడం కానేకాదు. అవన్నీ నడమంత్రంగా వచ్చిన ఆచారాలు మాత్రమే.

“వాటిని పట్టుకుని వేలాడితే హిందూ మతానికే ముప్పు తప్పదు. అసలైన హిందూ ధర్మం మన చుట్టూ ఉన్న ప్రతి జీవినీ ప్రేమించడమే. మన వేదవేదాంగాలసారం అదేనని నేను నమ్ముతా.

“ఓ దళిత సంఘం నన్నో సమావేశానికి పిలిచి ప్రసంగించాలని చెప్పింది. దళితులని ఆలయ ప్రవేశం చేయించడం శ్రీవైష్ణవ సంప్రదాయంలో వేలాది సంవత్సరాలుగా ఉందంటూ ‘మునివాహన సేవ’ గురించి చెప్పాను.

(శ్రీరంగం దేవాలయంలో ఓ దళితుడు స్వామి దర్శనం కోసం అల్లాడుతుంటాడు. కానీ అతడికి ప్రవేశం దొరకక పోగా ప్రధాన అర్చకుడు అతడిని గులక రాయితో కొడతాడు. గుడిలోకి వెళ్లి చూస్తే స్వామి విగ్రహం నుదుటి నుంచి రక్తం స్రవిస్తూ వుంటుంది. దానితో పూజారికి జ్ఞానోదయం అవుతుంది. ఆ దళితుడిని తన భుజాల మీదకు ఎత్తుకుని దేవాలయంలోకి తీసుకువెళ్లి స్వామి దర్శనం చేయించి ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు. ఇలా భుజాలకు ఎత్తుకుని దళితుల చేత దేవాలయ ప్రవేశం చేయించడాన్ని మునివాహన సేవ అంటారు)

“అప్పుడో సభ్యుడు లేచి ‘మీరయితే ఓ దళితుణ్ని అలా భుజాలపై మోసుకెళ్తారా!’ అని సవాలు విసిరాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. చేసి తీరతాననే చెప్పాను. చెప్పినట్టే చేశాను. ఓరోజు ‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే..’ అని పాడుకుంటూ, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఆదిత్య అనే ఒక హరిజన భక్తుణ్ణి గుడిలోకి మోసుకెళ్లాను.

“ఈ విషయం మీడియాలో రావడంతో, బౌద్ధ గురువు దలైలామా ప్రశంసాపూర్వక లేఖ రాసారు. అభినందనలు అనంతంగా సాగాయి. ఇవన్నీ ఆ బాలాజీ దయ అని నేను నమ్ముతాను.

“వీటన్నింటి వెనక నా భార్య సుధ ఇచ్చిన నైతిక మద్దతు అంతాఇంతా కాదు. లక్షల రూపాయల జీతం వదులుకుని, అర్చకత్వం స్వీకరించిన భర్త వెంట నడవాలంటే గొప్ప మానసిక బలం కావాలి. బాగా చదువుకుని పైకి వచ్చిన నా పిల్లల్లో ఒకరిని బాలాజీ సేవకే అప్పగించాలని నేను తీసుకున్న నిర్ణయానికి కూడా అంగీకారం తెలిపింది” ఇదీ ఒక అర్చకుని కధ. ఆచరించాల్సిన అంశాలతో కూడిన జీవనగాధ…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…
  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
  • కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…
  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions