ఓ భోజన హోటల్… ఓ సాయంత్రం ఒక కూలీ వచ్చాడు… బట్టలు, ఆకారం తన కటిక పేదరికాన్ని చెప్పేస్తూనే ఉన్నాయి… తక్కువ రేటు భోజనం కావాలని అడిగాడు… హోటల్ యజమాని తనతో మాట్లాడుతూ వివరాలు కనుక్కున్నాడు… తనకు ఊళ్లో వయస్సుడిగిన తల్లి, పెళ్లాం, ఇద్దరు చిన్న పిల్లలున్నారు… నాలుగు డబ్బులు కూడబెట్టి, వాళ్లను ఇక్కడికి తీసుకురావాలి, పిల్లల్ని మంచి బడిలో చదివించాలి, అమ్మకు ఆరోగ్యం బాగుండాలి… ఇవీ కూలీ లక్ష్యాలు… సహజమే కదా… ఈ పరిసరాల్లోనే ఓ స్క్రాప్ షాపులో పనిచేస్తున్నానని చెప్పాడు…
ఆ హోటల్ యజమానికి ఆ కూలీ తన కుటుంబం పట్ల చూపిస్తున్న శ్రద్ధ, తన మాటతీరు, కష్టపడే తీరు నచ్చాయి… జాలితో నీ భోజనానికి రూపాయి ఇవ్వు చాలు అన్నాడు… కూలీ ఆనందంగా నమస్కరించి, వెళ్లిపోయాడు… కొన్నేళ్లు గడిచాయి… ప్రతి సాయంత్రం ఆ కూలీ ఆ హోటల్ దగ్గరకు వస్తాడు… హోటల్ యజమానితో మాట్లాడతాడు… తన భోజనం తినేసి, రూపాయి చెల్లించి వెళ్లేవాడు… అనేకసార్లు పార్శిల్ తీసుకువెళ్లేవాడు… హోటల్ యజమాని తరచూ అమ్మకెలా ఉంది, పిల్లలు చదువుతున్నారా అని యోగక్షేమాలు అడిగేవాడు…
ఓరోజు సదరు కూలీ వచ్చి… ఓ చిన్న ఇల్లు కొన్నాను, దగ్గరలోనే మంచి బడి ఉంది, కుటుంబాన్ని తీసుకొచ్చేశాను అని చెప్పాడు ఆనందంగా… సంతోషం, మొత్తానికి నీ కష్టాలు గట్టెక్కినట్టే అని హోటల్ యజమాని కూడా అభినందించాడు… ఈరోజు నాకు ఆనందంగా ఉంది, పది రూపాయల పార్శిల్ తీసుకెళ్తాను అన్నాడు కూలీ… సరేనన్న ఆయన ఆ పార్శిల్ ఇవ్వాల్సిందిగా సిబ్బందికి పురమాయించి, పది రూపాయలు తీసుకున్నాడు… ఇంటికి వెళ్లిపోయాడు…
Ads
కూలీ ఇంటికెళ్లి పార్శిల్ విప్పాడు… షాక్… రోజూ తను ఏం తింటున్నాడో అదే ఉంది పార్శిల్‌లో… రూపాయికి అదే ఫుడ్డు, పది రూపాయలకు అదే ఫుడ్డా… ఇదేంటి..? అంటే సేటు తనను మోసం చేశాడా..? దయా హృదయుడు అనుకుంటే ఇదేం ధోరణి..? అడగాల్సిందే అనుకుని కోపంగా, వేగంగా ఆ హోటల్ వద్దకు వెళ్లాడు… ఓనర్ అప్పటికే ఇంటికి వెళ్లిపోయాడు… సిబ్బంది తనకు తెలుసు కదా… రోజూ వచ్చే గిరాకీయే కదా…
‘మీరు నన్ను మోసం చేశారు… ఈరోజు పది రూపాయలు ఇస్తే, అదే రూపాయి ఫుడ్డు పార్శిల్ ఇచ్చారు… మీ ఓనర్ మోసగాడు’ అన్నాడు కోపంగా…
ఓ సీనియర్ సర్వర్ తన దగ్గరకు వచ్చి, భుజం మీద చేయి వేసి… ‘మీకు తెలియనిది ఏమిటంటే… మా హోటల్‌లో ఖరీదైన భోజనం రేటు పది రూపాయలు… అదే నీకు పార్శిల్ కట్టి ఇచ్చింది… ఎప్పుడైనా మెనూ కార్డు చూశావా, రేట్లు అడిగావా..?’ అన్నాడు…
‘ఇదే ఖరీదైన భోజనం అయితే, మరి రోజూ నాకు రూపాయి రేటుకు ఇదే పెడుతున్నారు కదా..’
‘ఐనా నీకు అర్థం కావడం లేదా..? ఆరేళ్లుగా రూపాయి ఇస్తూ పదిరూపాయల భోజనం పొందుతున్నావు… పైగా దయ చూపించిన మనిషిని మోసగాడు అని తిడుతున్నావు… నీ అసలు తత్వం ఇదేనా..?’
కూలీ ఒక్కసారిగా మోకాళ్ల మీదకు వంగిపోయాడు… ఆరేళ్లుగా పదో వంతు పైసలు తీసుకుని, నాకు నాణ్యమైన భోజనం పెడుతున్న పెద్దమనిషిని తూలనాడాను, నాకు నిష్కృతి లేదు అని తలను చేతుల్లో దాచుకుని రోదించసాగాడు… వెనక్కి తిరిగి వెళ్లిపోతుండగా ఆ సీనియర్ సర్వర్ ‘మా ఓనర్ నువ్వు మళ్లీ ఇక్కడికి వస్తావని చెప్పాడు… నీకు ఈ సంచీ ఇవ్వాలని మాకు చెప్పాడు’ అని ఓ సంచీ అప్పగించాడు…
ఆయన ఆ సంచీ విప్పాడు… అందులో అన్నీ రూపాయి బిళ్లలు ఉన్నాయి… ‘ఏమిటివి’ అనడిగాడు… ఇన్నేళ్లుగా నువ్వు చెల్లించిన రూపాయి బిళ్లలే అవి, నీకు ఓ ఇల్లు సమకూరాక ఇవన్నీ ఇచ్చేయాలని అనుకుని, నీ ప్రతి రూపాయినీ ఈ సంచీలో భద్రపరిచాడు… నువ్వు ఇల్లు కొనుక్కున్నావట కదా… అందుకే పెరిగిన అవసరాలకు అక్కరకొస్తాయి అని ఆ డబ్బు నీకిచ్చేస్తున్నాడు’ అన్నాడు ఆ సీనియర్ సర్వర్… మళ్లీ దుఖంతో బరస్టయ్యాడు ఆ కూలీ… అక్కడే కూలబడి ఏడుస్తున్నాడు… నేనెంత మూర్ఖుడిని ‘సాయం చేసే చేయిని గుర్తించలేకపోయాను, పైగా తిట్టిపోశాను, నా అంతటి నికృష్టుడు ఇంకెవరు ఉంటారు..? ‘‘మీ అయ్యగారి ఇల్లెక్కడ చెప్పండి, వెళ్లి కాళ్ల మీద పడతాను’’ అనడిగాడు…
అక్కడున్న సిబ్బంది ఎవరూ మాట్లాడలేదు… ‘మా సేటు ఎవరినీ ఇంటిదాకా రానివ్వడు… నువ్వు వెళ్ళిపో, ఆయన చూపే దయలో రేపటి నుంచి కూడా తేడా ఏమీ రాదు…’ అన్నాడు సీనియర్ సర్వర్… ‘వెళ్ళేముందు ఒక్కమాట… దేవుడు మనకు బంగళాలు, కార్లు ఇవ్వకపోవచ్చు, ఆస్తులు విలాసాలు మనకు లేకపోవచ్చు… కానీ పనిచేసే సత్తా ఇచ్చాడు, కడుపు నిండా తిండి పెడుతున్నాడు… ఐనా మనకు దక్కినది విస్మరించేసి, మనకేదో దేవుడు ద్రోహం చేస్తున్నట్టు, ఇంకా ఏదో ఇవ్వలేదని తిట్టిపోస్తుంటాం తనను… నువ్వు భిన్నమేమీ కాదు… నీలాగా ఎందరో… పర్లేదు, ఎప్పటిలాగే వచ్చిపోతూ ఉండు…’ (సోషల్ మీడియాలో కనిపించిన ఓ ఇంగ్లిష్ పోస్టుకు నా తెలుగు అనువాదం… శ్రీనివాసరావు మంచాల)
Share this Article