కేరళ, ఈశాన్య రాష్ట్రాలు మినహా దేశమంతా ఓ రోగం ప్రబలి ఉండేది కదా… ఆడపిల్ల అని తెలిస్తే కడుపులోనే చంపేయడం, కొన్నిచోట్ల పుట్టగానే చంపేయడం, కాదంటే ఆ తల్లిని వదిలేయడం, ఇంట్లో నుంచి గెంటేయడం, విధి లేక పెంచుతున్నా వివక్ష చూపించడం ఎట్సెట్రా… కొన్ని కులాల్లో, కొన్ని జాతుల్లో, కొన్ని ప్రాంతాల్లో స్త్రీపురుష నిష్పత్తి దారుణంగా పడిపోవడం కూడా తెలిసిందే కదా…
అలాంటిది బీహార్‌లో ఒక తండ్రి తన ఏడుగురు బిడ్డల్ని జాగ్రత్తగా పెంచి, విద్యాబుద్ధులు నేర్పించిన ఓ స్టోరీ కనిపించింది, బాగుంది… ఆ ఏడుగురు బిడ్డలూ ఖాకీ యూనిఫారమ్స్ ఇప్పుడు… బీహార్‌లోని ఛప్రా జిల్లా అది… కమల్‌సింగ్‌కు 9 మంది పిల్లలు, వారిలో ఒక అబ్బాయి, మిగతావాళ్లు అమ్మాయిలు… ఒక అమ్మాయి అనారోగ్యంతో చిన్నప్పుడే మరణించింది…
వరుసగా ఆడపిల్లలే జన్మిస్తుండటంతో ఆ ఊరివాళ్లు కమల్ సింగ్‌ను వెక్కిరించేవాళ్లు… ఆ మెంటల్ టార్చర్ భరించలేక పిల్లలతో తన స్వగ్రామం సరన్ జిల్లాలోని నాచాప్ నుంచి మొత్తానికే వెళ్లిపోయాడు… వెళ్లి చప్రా జిల్లాలోని ఎక్కాలో స్థిరపడ్డాడు… అదీ ఆయన కథ… బిడ్డల్ని పెంచడంలో ఎక్కడా వీసమెత్తు వివక్ష చూపించలేదు… ఆడపిల్లలనే తేలిక భావన లేదు… నా పిల్లలు బాగా చదువుకోవాలి, బాగా స్థిరపడాలి అనుకున్నాడు…
Ads
అందరినీ చదివించాడు… ఓ చిన్న పిండి గిర్నీ ఉంది ఆయనకు… ఆ ఆదాయంలోనే జాగ్రత్తగా కుటుంబాన్ని పోషించుకున్నాడు… ఓ ఏజ్ రాగానే ఒక్కొక్కరికీ పెళ్లి చేసేయవయ్యా, లేకపోతే అందరూ భారమైపోతారు అని హితవు పలికేవాళ్లు ఊరోళ్లు… కానీ ఆయన ఎవరి మాటా వినలేదు… వచ్చిన ఆదాయాన్నే అడ్జస్ట్ చేస్తూ అందరినీ చదివించాడు… ఆ ఏడుగురికీ తమ కుటుంబం, తన తండ్రి ప్రేమ తెలుసు…
తమ వ్యవసాయ పొలంలోనే ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు… వేరే కోచింగ్ ఏమీ లేదు… అంత డబ్బూ లేదు… 2006లో మొదటిసారి పెద్ద కూతురు సశస్త్ర సీమాబల్ (ఎస్ఎస్‌బి)లో కానిస్టేబుల్‌గా ఎంపికైంది… అది మిగతా వాళ్లకు స్పూర్తిగా మారింది… పెద్దక్కే ఆదర్శం… రెండో సోదరి రాణి 2009లో పెళ్లి తరువాత బీహార్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా చేరింది… ఒకరి తరువాత మరొకరుగా అందరూ ఆ బాపతు పోస్టుల్లోనే చేరారు… ఎక్సయిజు, సీఆర్‌పీఎఫ్, జీఆర్ఫీ ఎట్సెట్రా…
తండ్రికి ఏదైనా కానుక ఇవ్వాలని అనుకున్నారు అందరూ కలిసి… నాన్న గౌరవంగా బతకాలి, అందుకని తమ పొదుపు సొమ్మంతా ఖర్చు చేసి ఏకంగా నాలుగు అంతస్థుల భవనాన్ని నిర్మించి ఇచ్చారు… వాటి కిరాయిల ద్వారా నెలకు 20 వేల దాకా వస్తాయి… వృద్దాప్యంలో ఆ డబ్బే తండ్రికి ఆసరా అనుకున్నారు…
వీళ్ల సోదరుడి పేరు రాజీవ్ సింగ్… మా అక్కలు బంగారం, వాళ్ల ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే అని సంబరపడిపోతున్నాడు… అక్కలూ మీరు గ్రేట్…!
Share this Article