Sampathkumar Reddy Matta …… హైదరాబాద్-సింథ్ @ కరీంనగర్
~~~•~~~•~~~•~~~•~~~•~~~
ఇది దేశవిభజననాటి వలసల ముచ్చట…
1947కు ముందున్న అఖండ భారతదేశంలో
హైదరాబాదు పేరుతో రెండు నగరాలు ఉండేవి
రెండూ నదీతీరపు మహాచరిత్రతో పేరుమోసినవే.
Ads
ఒకటవది… హైదరాబాదు దక్కన్
అంటే నిజాం సంస్థానంలోని (భారత) హైదరాబాదు.
రెండవది… హైదరాబాదు సింథ్
అంటే సింథ్ రాష్ట్రంలోని (పాకిస్థానీ) హైదరాబాదు.
నిజాం రాజుల హైదరాబాదు సంస్థాన పరిపాలనలో
రెండు నగరాలకూ రాకపోకలూ బంధుత్వాలూ మెండు.
హైదరాబాద్ దక్కన్ ; హైదరాబాదు సింథ్ అని
దక్కన్ & సింథ్ అనే విశేషణాలతోనే ఇవి గుర్తించబడేవి.
మన దక్షిణ భారతదేశానికి ఈ హైదరాబాదు ముఖద్వారం.
నేటి పాకిస్థాన్ దక్షిణ దేశానికి ఆ హైదరాబాదు ముఖద్వారం.
పాకిస్తాన్ దక్షిణాదినున్న సింథ్, బెలూచిస్తాన్ భూభాగాలలో
ఆనాడు హిందువుల జనాభా చెప్పుకోదగిన స్థాయిలో ఉండేది.
నైజాంలో జమీన్లు వ్యాపారాలు ముస్లిముల చేతిలో వున్నట్టే
సింథులో జమీన్లు వ్యాపారాలు హిందువుల చేతిలో ఉండేవి.
దేశవిభజన సంక్షోభంతో, ఆ తర్వాత నిజాం రాజు పతనంతో
ఇరునగరాలలో ఓడలు బండ్లూ – బండ్లు ఓడలూ అయ్యాయి.
రజాకార్ల చిత్రహింసలకు ఇక్కడ ప్రతీకారపు జ్వాల చెలరేగింది
హిందువుల మీద దౌర్జన్యాలకు ఉసిగొల్పిన ఇక్కడి జాగీరుదార్లు
పోలీసు చర్య తర్వాత తమ దేవిడీలు భూమిజాగలు వదిలేసి
సింథ్ హైదరాబాదుకు పిల్లాజెల్లా-పనివారంతో పారిపోయిండ్రు.
దేశవిభజన బలంతో అక్కడ హిందువుల మీద హింస పెరిగింది.
హైదరాబాదు, కరాచీ నగరాలు వాటి చుట్టుపక్కల ఊర్లల్ల వున్న
హిందువుల మీద, ఆస్తుల మీద దాడులు నిత్యకృత్యమయినయి.
ఆ ఘర్షణల్లోనే సింథ్ ప్రాంతంలోని వేలాది హిందూ కుటుంబాలు
తమ జాగీర్లను, వ్యాపారాలను,పెద్దపెద్ద దేవిడీలను వదులుకుని
కట్టుబట్టలతో దక్కన్ హైదరాబాదు రాష్ట్రానికి వలసలు తీసిండ్రు
దూరపు బంధువులు, మిత్రుల సాయంతో ఇక్కడ కుదురుకున్నరు.
~•~•~•~•~
నేను ఇంటరుమీడియట్ చదివేటపుడు కరీంనగరు శాస్త్రీ రోడ్డులో
ఇప్పుడు ఉన్న రాజు టీ స్టాలుకు ఎదుటి వైపున ఆ కుడి మూలమీద
హైదరాబాదు సింథ్ పేరుతో సింగిల్ షెటర్ బట్టల దుకాణం ఉండేది.
అన్ని షాపులకు మనుషుల పేర్లు ఉంటే, దీనికి ఒక్కదానికి ఊరి పేరు
ఎందుకుందో, దాని పక్కన ఆ సింథ్ ఎందుకో ఆలోచనకు అందలేదు
నేను పెరిగి పెద్దవుతున్నక్రమంలో పెద్ద గడియారం చుట్టుపక్కలున్న
దుకాండ్ల మనుషులు వేరే ప్రాంతాల వాళ్లనీ, వాళ్లంతా ఒకటిగాదనీ
మర్వాడీలు గుజరాతీలు సింథీలు ఫార్సీలు వేర్వేరు అని తెలిసింది.
1947 నుండీ ఒక సగటు హిందూ జమీన్దారుగా పోరాటం చేసి చేసి
చివరికి 1958లో ఆస్తిపాస్తులనూ అయినవాళ్లనందరినీ మాత్రమే
గాక జన్మనిచ్చిన మాతృభూమిని వదిలి మతం మీద మమకారంతో ఒక ముప్పయేండ్ల వ్యక్తి దక్కనులోని కరీంనగరును చేరుకున్నడు.
బతుకవచ్చిన ఆ పరదేశీ యువకుడి పేరు నయినూమల్ మోట్వానీ.
తను పెట్టుకున్న బట్టల దుకాణమే హైదరాబాద్ సింథ్ క్లాత్ షోరూం.
సింథ్ హైదరాబాదు చుట్టుపక్కల ఊర్లల్లోని ఒక వూరి పేరు మోట్వా
మోట్వా ప్రాంతపు మల్లులు (పాలక ఆంతరంగికులు) మోట్వానీలు.
నయినూమల్ మోట్వానీ తండ్రి మేఘరాజ్ మల్ మోట్వానీ. ఇతనికి
ఊరిలో రెండు వందల ఎకరాల జాగీరు,పెద్దదైన బంగళా ఉండేదట
అవన్నీ వదలి నయినూమల్ రాత్రికిరాత్రి బతుకువేటలో బైటపడ్ఢడు
కొత్త వృత్తి జీవిక భార్య పిల్లలు ఈ తర్వాత కథంతా కరీంనగరుతోనే.
1960 ప్రాంతంలో తన పుట్టినగడ్డ పేరుతో పెట్టుకున్న క్లాత్ షోరూం
తన ఇద్దరు మగపిల్లలు ముప్పయేండ్ల వయసుకు వచ్చేటప్పటికి
ఇంతింతై కరీంనగర్ల పేరుమోసిన పెద్ద బట్టల దుకాణంగా మారింది.
మార్కెట్ ఏరియాలోని ఇప్పటి అన్నపూర్ణ కాంప్లెక్సులో స్థలం కొని
ఫోటోలోని పెద్ద బట్టల దుకాణం కట్టుకున్నాడు. 1980 ప్రాంతంలో
పెద్దకొడుకు దిలిప్ కుమారు మల్ కోసం పక్కనున్న ఆఫీసు రోడులో
సింథూర్ క్లాత్ షోరూం పేరుతో మరో కొత్త దుకాణం పెట్టి యిచ్చిండు
పాత దుకాణాన్ని చిన్న కొడుకు రాజుకుమార్ మల్ చూసుకుంటడు.
2020 లో మరణించిన నయినూమల్ మోట్వానీది.. సింథ్.
తన వారసులుగా నిలబడ్డ ఇద్దరు కొడుకులది.. ఈ తెలంగాణగడ్డ.
వాళ్లకు తమతాతలు తండ్రులు పుట్టి పెరిగిన ఆనవాళ్లేవీ తెలియవు
కటోర శ్రమ & క్రమశిక్షణ ఇవి రెండే సింథ్ మోట్వానీలకు మూలధనం
పెద్దగ డియారం చుట్టుపక్కలున్న అన్ని షాపులదీ ఇటువంటి కథనే !
ఇది… మన ఊరు – మన చరిత్రలో, మా ఊరికున్న వలసల కథ.
~డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి
———————————————————–
ఎప్పట్నుంచో రాద్దామనుకుంటున్నా… రాజ్మల్ గారిని నిన్న కలిసిన.
Share this Article