Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పురుషుడిగా మారుతున్న బెంగాల్‌ మాజీ సీఎం బుద్ధదేవ్‌ కూతురు సుచేతన!

June 23, 2023 by M S R

పురుషుడిగా మారుతున్న బెంగాల్‌ మాజీ సీఎం బుద్ధదేవ్‌ కూతురు సుచేతన!

పదేళ్లకు పైగా మార్క్సిస్టు సీఎంగా కొనసాగిన నేత పేరు ఇన్నాళ్లకు మళ్లీ వార్తల్లోకి…

42 ఏళ్ల సుచేతన సర్జరీ తర్వాత సుచేతన్‌–ఎంతైనా కమ్యూనిస్టులే నిజంగా గొప్పోళ్లు

Ads

……………………………………………………………..

‘పురుషుడిగా మారనున్న మాజీ సీఎం కుమార్తె..’ అనే శీర్షికతో బుల్లి వార్త ఈరోజు ఈనాడు 15వ పేజీ కింద ఓ మూలన కనపడింది. రెండు చిన్ని చిన్ని ఫోటోలు చూశాక పశ్చిమ బెంగాల్‌ సీపీఎం చివరి మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్జీ, ఆయన ఒకే ఒక కూతురు సుచేతన అని అర్ధమైంది. రేపొచ్చే జులై 1న 42 సంవత్సరాలు నిండుతున్న సుచేతన.. తాను పురుషుడిగా మారడానికి శస్త్రచికిత్స చేయించుకోబోతున్నానని చెప్పడం ఈ వార్త సారాంశం.

నాకు ఒక్కసారిగా 2006 పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాక బుద్ధదేవ్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాట గుర్తుకొచ్చింది. ‘ తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకురాలు మమతా బెనర్జీ ఈ ఎన్నికల్లో కమ్యూనిస్టులకు ప్రధాన ప్రత్యర్థి. అయినా, ఎన్నికల ప్రచారంలో ఆమె పేరు ఎక్కడా ప్రస్తావించవద్దని ఎంఏ (రాజనీతిశాస్త్రం) చదువుతున్న నా ఏకైక పుత్రిక సుచేతన నాకు సలహా ఇచ్చింది. ఆమె సలహా పాటించాను. మా కమ్యూనిస్టుల నాయకత్వంలోని వామపక్ష ఐక్యసంఘటన ఈ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. మొత్తం 294 స్థానాలకు గాను లెఫ్ట్‌ ఫ్రంట్‌ 23 సీట్లు కైవసం చేసుకుంది,’ అని దాదాపు పదిన్నరేళ్లు బెంగాల్‌ ముఖ్యమంత్రిగా కొనసాగిన పెద్దమనిషి, మంచి మేధావి బుద్ధదేవ్‌ చెప్పిన మాటలు కళ్లముందు కనిపించాయి.

మళ్లీ ఇన్నాళ్లకు ఆమె కూతురు సుచేతన పేరు ఒకే ఒక తెలుగు పేపర్లో చూడడం చాలా బాగుంది. సుచేతన మొన్న తాను లింగ మార్పిడి సర్జరీ చేయించుకునే విషయం వెల్లడిస్తూ ఏం చెప్పిందో చూద్దాం. ఆమె కలకత్తాకు చెందిన ఏబీపీ లైవ్‌ చానల్‌ ప్రతినిధితో మాట్లాడుతూ, ‘నేను మానసికంగా నన్ను మగవాడిగా మారే లక్షణాలున్న వ్యక్తిగానే భావించాను. ఇప్పుడు శారీరకంగా అలాగే పురుషుడిగా మారాలనుకుంటున్నాను. నేను చిన్నప్పటి నుంచీ ఈ విషయంపై మా నాన్నతో మాట్లాడుతున్నాను. కాని ఇప్పటి నా నిర్ణయం పూర్తిగా నాదే,’ అని సుచేతన ప్రకటించి సంచలనం సృష్టించారు.

కమ్యూనిజంతో దీనికి సంబంధం లేదన్న సుచేతన….. ‘లింగ మార్పిడితో పాటు నా పేరు కూడా సుచేతన్‌ అని మార్చుకోవాలనుకుంటున్నా. ఈ పరిణామానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలు కూడా చర్చించాను. వైద్య నిపుణులు, ఇతర నిపుణులతో కూడా మాట్లాడాను. ఆడపిల్లగా పుట్టిన నేను వయసుతోపాటు పెరుగుతూ నన్ను నేను మగాడిగా మానసికంగా గుర్తించడం మొదలెట్టాను. ఈ కారణంగా నేనెన్నో అవమానాలు ఎదుర్కొన్నా. పురుషుడిగా మారాలన్న ఈ నిర్ణయానికి ఇదే అసలు కారణం,’ అని ఆమె వివరించారు.

అయితే, తన ‘వ్యక్తిగత గుర్తింపు’ను తన కుటుంబానికి ఉన్న పేరుప్రఖ్యాతులతో లంకె పెట్టవద్దని సుచేతన అభ్యర్థించారు. ‘ఆలస్యమైనాగాని నా నిర్ణయమే మంచిది. వారం పది రోజుల్లో 42 ఏళ్లు నిండుతున్నాయి కాబట్టి ఎట్టకేలకు పెద్ద నిర్ణయం తీసుకున్నా. ఇది పూర్తిగా నా నిర్ణయం. నా తండ్రి, నేనూ ఎప్పుడూ అభ్యుదయ భావాలున్న మనుషులమే. నా నిర్ణయానికి కమ్యూనిజానికి ఎలాంటి సంబంధం లేదు. కమ్యూనిజం అనే పదానికి అర్ధం తెలియని వారు సైతం ఈ విషయాన్ని అర్ధం చేసుకోవాలి,’ అని బుద్ధదేవ్‌ ఏకైక సంతానం సూటిగా తేల్చిచెప్పేశారు.

ఇకపోతే, సుచేతన మానసిక, శారీరక స్థితిపై మొదట ఎల్జీబీటీక్యూ (ట్రాన్స్‌ జెండర్లు) సముదాయం కోసం ఉద్యమిస్తున్న కార్యకర్త సుప్రవా రాయ్‌ తొలుత ప్రపంచానికి వెల్లడించారు. ద్విలింగ లేదా లింగమార్పిడి చేయించుకున్న ట్రాన్స్‌ జెండర్స్‌ ఉపాధిపై జరిగిన చర్చాగోష్ఠిలో సుచేతనా భట్టాచార్య ప్రసంగించిన్పటి ఫోటోను సుప్రవా రాయ్‌ అప్లోడ్‌ చేయడంతో మార్క్సిస్టు నేత కూతురు వ్యక్తిగత విషయం ప్రపంచానికి తెలిసింది.

ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమంటే… 1950 నుంచీ పశ్చిమ బెంగాల్‌ కు 8 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. వారిలో కేవలం ముగ్గురు మాత్రమే వివాహితులు. ప్రస్తుత సీఎం మమతా బెనర్జీ అవివాహిత అనే విషయం తెలిసిందే. మాజీ సీఎంలలో కాంగ్రెస్‌ నేత సిద్ధార్థ శంకర్‌ రాయ్‌ (1972–77), మార్క్సిస్టు నేతలు జ్యోతి బసు (1977–2000), బుద్ధదేవ్‌ భట్టాచార్య (2000–2011) మాత్రమే పెళ్లయిన నేతలు. జ్యోతి బసుకు ఒక్క కొడుకు ఉంటే, సిద్ధార్థ శంకర్‌ రాయ్‌కు పిల్లలు లేరు. బుద్ధదేవుడి ఒక్క కూతురు ఇలా లింగ మార్పిడి నిర్ణయంతో ఇప్పుడు కొద్దిగా వార్తల్లోకి ఎక్కడం విశేషం… By Nancharaiah Merugumala

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కొత్త ఎఐ పంచాయితీ… కథలూ, క్లైమాక్సులూ మార్చేసి రీరిలీజులు…
  • కుకూ జాతిరత్నాలు… టీవీ సెలబ్రిటీలు సరదాగా రక్తికట్టిస్తున్నారు…
  • ఆ చెత్త మొహాల పారితోషికాల్ని కట్ చేయండి, వందల మంది బతుకుతారు…
  • యోగీ భాయ్… ఎవరో గానీ నిన్ను ముందుజాగ్రత్తగా తొక్కేస్తున్నారు భయ్యా…
  • ‘‘గతేడాది బతికే ఉన్నానేమో గుర్తులేదు.., ఇప్పుడయితే బతికే ఉన్నా.,.‘‘
  • బీసీ రిజర్వేషన్లు… క్రెడిట్ రేవంత్‌రెడ్డిది… ఎవరెవరో హైజాక్ ప్రయత్నాలు…
  • కీచక ప్రజ్వల్ కేసు..! న్యాయవ్యవస్థపై ఆశల్ని బతికించే తీర్పు..!!
  • వినుడు వినుడు విజయవాడ వెతలూ… వినుడీ జనులారా..!!
  • ఎవరు నిజమైన జర్నలిస్టు అనే ప్రశ్న సరే… అసలు జర్నలిస్టు అంటే ఎవరు..?
  • ఆహ్లాదానికీ అసభ్యతకూ నడుమ గీత చెరిపేశాడు రాఘవేంద్రుడు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions