ఇండస్ట్రీ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న కల్కి 2898 AD సినిమా రిలీజు దగ్గర పడింది… ముంబైలో ప్రిరిలీజ్ ఫంక్షన్ జరిగింది… ప్రభాస్, అమితాబ్, దీపిక, కమలహాసన్, దిశా పటానీ తదితర అగ్రతారాగణం, అత్యంత భారీ వ్యయం, నాగ్ అశ్విన్ దర్శకుడు కావడంతో బాగా హైప్ ఏర్పడుతోంది… సినిమా కథ ఏ కాన్సెప్టుతో రాయబడితో కూడా దర్శకుడు సంక్షిఫ్తంగా లైన్ చెప్పాడు… ఆసక్తికరం… మన రొటీన్, చెత్తా కథలతో పోలిస్తే ఇలాంటి కథల ఎంపిక, ట్రీట్‌మెంట్ ఓ సాహసమే… రెండు పార్టుల్లో కథ వివరంగా చెప్పడానికి దర్శకుడు ప్రయత్నించాడు…
కథను ప్రేక్షకుడు కనెక్టయ్యేలా చెప్పగలను అనే ధీమా, నమ్మకం ఉన్నవాడే కథను ముందే రివీల్ చేస్తాడు… నాగ్ అశ్విన్ అలాగే చేశాడు… గుడ్… కానీ ఆ కథ విన్న వెంటనే ఇది ఎక్కడో విన్న కథే, చూసిన కథే అనే ఫీలింగ్ చాలామందిలో మొదలైంది… ప్రత్యేకించి ఇంగ్లిష్ సినిమా ప్రేమికులకు వెంటనే మాట్ డామన్ 2013లో తీసిన Elysium గుర్తొచ్చింది… అమెరికావాసి మిత్రుడు శ్రీకుమార్ గోమఠం కూడా అదే అభిప్రాయపడ్డాడు…
Ads
ఎలీసియం సినిమాకు నీల్ బ్లామ్‌కాంప్ దర్శకుడు… ఇదీ కల్కి వంటి సైన్స్ ఫిక్షనే… భూమి అధిక జనాభాతో కలుషితం, చాలామంది పేదరికలో, దుర్భరంగా జీవిస్తుంటారు… మరోవైపు సంపన్నులు ఎలీసియం అనే విలాసవంతమైన, సకల సౌకర్యాల స్వర్గం వంటి అంతరిక్ష కేంద్రంలో నివసిస్తుంటారు… వాళ్లకు అత్యంతాధునిక వైద్యసౌకర్యాలు, సుఖమయమైన జీవనశైలి ఉంటాయి… ప్రధానపాత్ర మాక్స్ పాత్రధారి మాట్ డామన్… తన సొంత జీవితాన్ని కాపాడుకోవడానికి, సమాజంలో సమానత్వాన్ని సాధించడానికి ఎలీసియంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తాడు…
ఒక పెద్ద కంట్రాస్టు… ఒకవైపు దుర్భర పేదరికం… మరోవైపు దానికి పూర్తిగా భిన్నమైన స్వర్గం… సూపర్ స్టోరీ లైన్ ఇది… అఫ్‌కోర్స్, ఈ కోణంలో ఇంగ్లిషులో, ఇతర భాషల్లో పలు సినిమాలు వచ్చినా, ఇండియన్ సినిమాలో బహుశా తొలిసారి కావచ్చు… ఐనా కథదేముంది..? దాన్ని ఎలా ప్రజెంట్ చేశారనేది ముఖ్యం కదా… ఎలీసియం వంటి కథల ప్రేరణతో దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ భారతీయ కథను రచించుకున్నట్టు కనిపిస్తోంది… మన పురాణాల నుంచి అశ్వత్థామ (చిరంజీవి) పాత్రను కూడా తీసుకొచ్చి మరో డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ చేశాడన్నమాట…
తనే ముంబైలో వెల్లడించిన ప్రకారం… మూడు ప్రపంచాల్ని ఈ కథ కోసం ఊహించుకున్నాడు దర్శకుడు… ప్రపంచంలోనే మొదటి నగరంగా గుర్తింపు పొందిన వారణాసి క్రమేపీ దుర్భరనివాస ప్రాంతంగా మారిపోవడం ఒకవైపు… ఆకాశంలో కిలోమీటర్ మేర ఉండే మరో ప్రపంచం కాంప్లెక్స్… ఇక్కడ అన్నీ దొరకుతాయి… నీరు, ఆహారం, పచ్చదనం, ఆరోగ్యం… అన్నీ… అంటే వారణాసికి పూర్తి కంట్రాస్టు ప్రపంచం… వారణాసి మొదటి నగరమే కాదు, చివరి నగరంగా ఓ చిత్రీకరణ… ఊహ… కాశి నుంచి కాంప్లెక్స్‌లోకి అడుగుపెట్టడానికి ప్రయత్నాలు సాగుతుంటాయి… సహజమే కదా…
ఈ రెండూ గాకుండా మరో ప్రపంచం శంబాలా… ఇదేమో ప్రపంచంలోకెల్లా అతి పెద్ద శరణార్థి క్యాంపు… కాంప్లెక్స్‌వాసులు చేసే దాడుల్లో ప్రపంచంంలోని పలు సంస్కృతులు, మతాల శరణార్థులు తలదాచుకునే రహస్య ప్రపంచం… కల్కి అక్కడే ఉద్భవిస్తాడు… కాంప్లెక్స్‌వాసులతో పోరాటం సాగుతూ ఉంటుంది… ఇలా మూడు భిన్నమైన ప్రపంచాల్ని దర్శకుడు ఆవిష్కరించే ప్రయత్నం చేశాడన్నమాట… ఇంట్రస్టింగ్ స్టోరీ లైన్… మూడు ప్రపంచాల నడుమ సాగే అత్యంత సంక్లిష్టమైన కథనే తెర మీద ఎంత సరళంగా, ఎంత బలంగా ప్రజెంట్ చేశాడనేదే ఆసక్తికరం… గుడ్… నాగ్ అశ్విన్ మీద నమ్మకముంది ఇండస్ట్రీకి… ఆల్ ది బెస్ట్ కల్కీ… కమాన్…
Share this Article