బహుళ జాతి కంపెనీ అంటేనే బైరూపి… అంటే బహురూపి… రకరకాల వేషాలు… అందులో కోల్గేట్ వాడు అందరికన్నా ఫస్ట్… దశాబ్దాలుగా మన నోళ్లను రసాయనాలతో నింపీ నింపీ, మన జేబుల్ని ఖాళీ చేసీ చేసీ… ఈమధ్య ఇంకా కొత్త కొత్త ప్రచారాలు చేస్తున్నాడు… ఇంకెలా మాయచేయాలో ఆలోచిస్తున్నాడు… నిజానికి వేపపుల్లలు, బొగ్గుపొడి మాత్రమే కాదు… రకరకాల దంత మంజన్లు… చివరకు ఊక కాల్చిన తరువాత మిగిలే బూడిద కూడా మన పళ్లను తోమింది… ఉప్పు, తినే సోడా కూడా..! అవన్నీ మరిచిపోయాం కదా, కోల్గేట్ వాడు ఇప్పుడు మళ్లీ అవే మనకు చెబుతున్నాడు… టూత్ పేస్టులో ఉప్పు ఉంటే గొప్ప ప్రయోజనాలు అని సమంతతో ఉప్పు జ్ఞానాన్ని బోధిస్తున్నాడు… బొగ్గు ఉన్న టూత్ పేస్టు ఎంత సూపరో వివరిస్తున్నాడు… కాలాన్ని వెనక్కి తిప్పుతున్నాడు… పతంజలి దెబ్బకు వేదశక్తి అని ఆమధ్య ఆయుర్వేదాన్ని, మూలికల్ని, వేదాల్ని కలిపి కొట్టాడు… అవన్నీ వర్కవుట్ కావడం లేదని ఈమధ్య తెలుగు టీవీ సీరియళ్ల రచయితలను తీసుకున్నట్టున్నాడు…
సాధారణంగా టీవీ సీరియళ్లు రాసే వాళ్లకు లాజిక్కులతో పనిలేదు… జస్ట్, మన ప్రేక్షకులు పిచ్చిగాడిదకొడుకులు అని మనసులో బలంగా అనుకుంటారు, అంతే, చకచకా రాసేస్తుంటారు… సేమ్, మా వినియోగదారులు ఉత్త ఎడ్డోళ్లు అని కోల్గేట్ వాడు అనుకుంటాడు… వాళ్లకు తగినట్లు వీళ్లు క్రియేటివ్ వర్క్ చేసిపెడుతున్నట్టున్నారు… అదేలెండి, కోల్గేల్ వాడి తెలుగు భాషలో ‘‘సృజనాత్మక దృశ్యీకరణ’’… అంటే ఏమిటని జుట్టు పీక్కోకండి… ‘‘మా ఇష్టమొచ్చింది తీస్తాం- చచ్చినట్టు చూడండి’’ అన్నమాట… ఈమధ్య కనిపిస్తున్న యాడ్స్ గమనించారా..? పిల్లలు ఆడుకుంటుంటారు, షటిల్ కాక్ ఒకటి చెట్టు కొమ్మలో ఇరుక్కుంటుంది, కొందరు పిల్లలు చెట్లును ఊపడానికి ప్రయత్నించి అలిసిపోతారు, ఓ పిల్ల వచ్చి అలా బలంగా ఊపేస్తుంది… తరువాత చెబుతుంది… నా టూత్ పేస్టే నా బలం అని…!!
Ads
ఇదేమిటీ… టూత్ పేస్టుకు ఒంట్లో బలానికీ ఏం సంబంధం అని ఆశ్చర్యపోవద్దు మనం… నోళ్లు వెళ్లబెట్టి, దంతాలన్నీ బయటపడేలా అలా చూస్తూ ఉండిపోవాలి, అంతే… వాడేం చెబుతాడంటే… టూత్ పేస్టు బాగుంటే పళ్లు బాగుంటయ్, పళ్లు బాగుంటే అన్నీ ఎంచక్కా నమిలి తింటారు, దాంతో మీ ఒంట్లో బలం ఇక పుష్కలం… థూవీడిబతుకుచెడ… ఇదేం లింకురా అని కూడా మనం తిట్టుకోవద్దు… ఎందుకంటే..? రేప్పొద్దున యాడ్స్ క్వాలిటీ నియంత్రణ విభాగం వాళ్లు కేసు పెడతారేమో అని సందేహించి, ముందుజాగ్రత్తగా ఆ యాడ్‌లో ఓ డిస్‌క్లెయిమర్ సంధిస్తాడు మన మీదకు… ‘‘అబ్బే, టూత్ పేస్టు పోషణకు మూలం కాదు, మంచి పోషణ కావాలంటే మంచి ఫుడ్ తీసుకొండి, బాగా నమిలి తినండి, అదేదో దిక్కుమాలిన సర్వే కూడా అదే చెప్పింది’’ అంటాడు… ‘‘Only then will you get all the right nutrients”… అబ్బ, ఏం తెలివిరా మీది..? ఇంకా ఇలాంటి ఐడియాలు కుప్పలుకుప్పలు ఉన్నట్టున్నాయి కదా… కానివ్వండి, ఏ రాళ్లయితేనేం, రాలేది మా పళ్లే కదా…!!
Share this Article