ఎవరో అన్నారు… ఊళ్లలో ఉన్న నాన్-ఏసీ థియేటర్లలో ఎకానమీ రేటు కేవలం అయిదు రూపాయలు… అది కప్పు టీ ధరకన్నా తక్కువ… ఇండస్ట్రీ కుప్పకూలడం ఖాయం ఇక అని..! ఎస్, స్థూలంగా ఒక్కసారి జగన్ ప్రభుత్వం ఖరారు చేసిన రేట్లు పరిశీలిస్తే అలా అనిపించడం కరెక్టే… ఆ రేట్లతో థియేటర్లను గ్రామాల్లో, నగర పంచాయతీల్లో నడిపించడం అసాధ్యం… తక్షణం ఆ థియేటర్ల సీట్లు పీకేసి, ప్రొజెక్టర్ ఎవరో తెలంగాణ థియేటర్ వాడికి అమ్మేసి, ఇక థియేటర్లను రైస్ మిల్లులకు, గోదాములకు ఇవ్వడం బెటర్… కడుపులో చల్ల కదలకుండా బతకొచ్చు… నిజంగానే అలా అనిపిస్తుంది… ఈ రేట్లు సమంజసమా, కాదా, రేషనాలిటీ ఏమిటి..? ఏయే అంశాలు, ఏయే ఖర్చులను ఎలా లెక్కించి, ఈ రేట్లు ఖరారు చేశారనేది, ఈ అశాస్త్రీయత ఏ ఉన్నతాధికారి నిర్వాకమో ఎవరికీ అంతుపట్టని ఓ మిస్టరీ… బహుశా రేప్పొద్దున కోర్టుల్లో విచారణకు వస్తే గానీ ప్రభుత్వం ఆ వివరాలు వెల్లడించదేమో… కానీ… నాణేనికి మరో కోణమూ ఉంటుంది…
ఇన్నాళ్లూ థియేటర్ల సిండికేట్… అనగా ఓ నలుగురు పెద్ద తలకాయలు నడిపించే ఎగ్జిబిటర్స్ మాఫియాకు ఇది శరాఘాతం… బెనిఫిట్ షోలతో, అడ్డగోలు టికెట్ల రేట్లతో ఫ్యాన్ల జేబులను కత్తిరించి, కోట్లకుకోట్లు కొల్లగొట్టే స్టార్ హీరోలకు, నిర్మాణంలో భాగస్వామ్యం నెరిపే బడా దర్శకులకు, బలిసిన పెద్ద సినిమా సంస్థలకు బలమైన దెబ్బ… తెలంగాణ అయితే వాళ్లందరికీ స్వర్గధామం… బంగారు తెలంగాణ కాబట్టి, జనం కూడా బాగా ధనికులు, డబ్బు ఏం చేయాలో ఎలా ఖర్చుపెట్టాలో తెలియడం లేదు కాబట్టి పర్లేదు… కానీ పేద ఏపీలోనే సమస్య… అసలు ఎలా స్పందించాలో ఇండస్ట్రీలోని పెద్ద తలకాయలకే అర్థం కావడం లేదు, అవును గానీ, ఒక విషయం పరిశీలించాలి…
Ads
నిజమే, ఒక గ్రామంలో లేదా నగర పంచాయతీ పరిధిలో ఒక నాన్-ఏసీ, ఎకానమీ క్లాస్ రేట్లు మరీ అంత చీపా..? కానీ ఎప్పుడైతే సిండికేట్ రంగంలోకి దిగిందో, అన్ని థియేటర్లతో ఒప్పందాలు చేసుకుని, పైపైన షోపుటప్స్ చేసేసి, మల్టీప్లెక్స్ లుక్కు ఇచ్చేసి, అరకొర ఏసీలు పెట్టేసి, ఇన్నాళ్లూ కుమ్మేశారుగా… అసలు ఎకానమీ సీట్లు ఇన్ని ఉండాలి అనే ఓ నిబంధనం ఉందా..? ఎవరైనా పాటిస్తున్నారా..? మల్టీప్లెక్స్ అంటే నిర్వచనం ఏమిటి..? ఇన్నాళ్లూ ఎవరికీ పట్టలేదు… ఓ మోస్తరు మున్సిపాలిటీల్లో కూడా అంతే కదా..! ఎహె, పొండి, తాగేవాడు కడతాడు తాళ్ల పన్ను… సినిమా చూసేవాడే భరిస్తాడు, వాడి ఇష్టం, వాడి ఖర్మ అంటారా..? మరిక ప్రభుత్వాలు దేనికి..? సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ దేనికి..? ఇన్నాళ్లూ చిన్న సినిమాల్ని విడుదల గాకుండా అడ్డుకున్న రాక్షస హస్తాల మాటేమిటి..? మరిక కొత్త నీరు, కొత్త క్రియేటివిటీ వచ్చేదెలా..? ఎందరి ఉసురు పోసుకున్నారు వీళ్లు..? ఈ పెద్ద తల్కాయల దిక్కుమాలిన సినిమాల్నే ప్రేక్షకుడు నిర్బంధంగా చూడాలా..? అసలు థియేటర్లే మూతపడితే ఇక చిన్న, పెద్ద ఏముంది అంటారా..? సరే, దీన్ని కూడా కాసేపు వదిలేద్దాం…
ఒక థియేటర్‌కు ఒక సగటు ప్రేక్షకుడు వచ్చేలా ఉందా పరిస్థితి..? పార్కింగ్ దగ్గర నుంచి, క్యాంటీన్‌లో సమోసా దాకా ప్రతిదీ దోపిడీయే… ఫ్యామిలీతో వస్తే సగం జేబు ఖాళీ… పైగా సినిమా విడుదలైన కొత్తలో రేట్ల పెంపు, వారం పది రోజుల్లో కుమ్మేసుకుని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ సేఫ్… అసలు సినిమా టికెట్ల ధరలకు ఒక పద్థతి అంటూ ఉందా ఇన్నాళ్లూ..? అన్నట్టు, టికెట్ల రేట్లు తగ్గితే ప్రభుత్వానికి వచ్చే స్లాబ్ ఆదాయం కూడా తగ్గుతుందండోయ్… ఇక శ్రీమాన్ దిగ్దర్శకుడు రాఘవేంద్రరావు శోకం ఏమిటో చూద్దాం…
1) నేను ఈరోజు ఇలా ఉండటానికి ప్రేక్షకులు, థియేటర్లు… వీళ్లు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది…
– అదే కదా సమస్య, కేవలం థియేటర్లు, మీ కోణంలోనే ఆలోచిస్తూ, మీరు బాగుపడటమేనా ఇండస్ట్రీ బాగుండటం అంటే..?
2) షోలు తగ్గిస్తే, టికెట్ల ధర తగ్గిస్తే అందరూ నష్టపోతారు… డీటీఎస్, 3డీ అనుభూతి టీవీల్లో రాదు…
– మరి మీ సినిమాలు థియేటర్లలో అంతగా అలరించే పక్షంలో ఓటీటీలకు, టీవీలకు ఎందుకు అమ్ముతున్నట్టు సినిమాలను అమ్ముతున్నట్టు సార్..?
3) 10 శాతం హిట్స్ కూడా ఉండవు, 10 శాతం యావరేజ్…
– పోనివ్వండి సార్, ఈ తొక్కలో పదిశాతం హిట్స్ గురించి ఈ వయస్సులో మీకు ఈ శోకం దేనికి..? మిగతా 90 శాతం తొక్కలో నాసిరకం సినిమాలే కదా, థియేటర్లలో చూస్తే ఎంత..? చూడకపోతే ఎంత..?4) ప్రేక్షకుడు మంచి సినిమా చూడాలనుకుంటే టికెట్ ధర 500 ఐనా చూస్తాడు, సినిమా నచ్చకపోతే రూపాయి ధర పెట్టినా చూడడు…
– ఇదే మీతో సమస్య… టికెట్లు రేట్లు ఇంకాస్త పెంచండి, ఇప్పటి పరిస్థితులకు ఖర్చులు గిట్టుబాటు కావు అని అడగడం వేరు, అది రీజనబుల్ వాదన… ఏ ధరైనా పెట్టుకుంటాం, చూసేవాడు చూస్తాడు అనే తొండి వాదన వేరు…
5) ఆన్‌లైన్‌లో ఇన్‌ఫ్లుయెన్స్ ఉన్నవాళ్లు బ్లాక్ చేసుకుని, దందా చేస్తారు… కానీ రేట్లు పెంచి, ఆన్‌లైన్‌లో అమ్మితే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది…
– రేట్లు పెంచితే మాత్రం అదే ఇన్‌ఫ్లుయెన్స్ ఉన్నవాళ్లు బ్లాక్ చేయలేరా..? భయపడతారా..? దందా చేయరా..? ఇదెక్కడి వాదన..? ఐనా ప్రభుత్వ ఆదాయం గురించి మనకేల..?
సో… ఏరకంగా చూసినా అటు ప్రభుత్వం, ఇటు ఇండస్ట్రీ… ఎవరికీ అమికబుల్ సొల్యూషన్ పట్టడం లేదు… నిజమే, ఇండస్ట్రీ దెబ్బతినడం మంచిది కాదు… అదేసమయంలో రెగ్యులేషన్ లేకపోవడమూ కరెక్టు కాదు… ప్రేక్షకుడి బలహీనతల్ని సొమ్ము చేసుకోవడమూ సరికాదు… రేసులు, పేకాట, కోడిపందేలు, బెట్టింగులు, జూదం ఇవి కూడా మనిషి బలహీనతలపై ఆటలే కదా… రెగ్యులేషన్ అవసరమే… కానీ అది మరీ చావుదెబ్బ తీసి, ప్రాణం తీసేలా ఉండకూడదు…!! ఐనా మీరు చూస్తూ ఉండండి, ఎక్కువ రేట్లున్న ప్రీమియం క్లాసే మిగిల్చి, మొత్తం పీకేసి, కథ నడిపించేస్తారు… శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు…!!
Share this Article