Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆవకాయ ముక్కలు తరగనే లేదు… ఇంకా మామిడి రసం జుర్రనే లేదు…

May 10, 2023 by M S R

Untimely affect on Mamgo lovers : బండలు పగిలే ఎండలు మెండుగా వస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో చల్లటి అండ కోసం కుండల అన్వేషణ ఇంకా పూర్తవనే లేదు. వడగాడ్పుల వేడి తగ్గించుకోవడానికి ఆస్థాన నిపుణుడితో ఏ సి ల దుమ్ము ఇంకా దులిపించనే లేదు. షరా మామూలుగా ప్రతి వేసవిలో రెండు, మూడు నెలల పాటు తినబోయే రకరకాల మామిళ్ల రుచులను తలచుకుంటూ బంగినపల్లి బుట్టలకు ఇంకా ఆర్డర్ ఇవ్వనే లేదు. పసందయిన హిమాం పసంద్ లను తెచ్చి ఫ్రిడ్జిలో పెట్టుకోవడానికి అర ఖాళీ చేయనే లేదు. రసాలూరు చిన్న రసాలు, చెరుకు రసాలు ఇంకా కొననే లేదు. కాయగా పుల్లగా ఉండి, పండితే మధురంగా ఉండే రాయలసీమ నీలం ఇంకా ఇంటికి చేరనే లేదు. అంటుమామిడి(తోతాపురి) పచ్చడి ఇంకా రోట్లో నలిగి…నోట్లోకి రానే లేదు.

మార్కెట్లో దశ దిశలా ఇంకా దశేరి పండ్ల బళ్లు తిరగనే లేదు. మాటల్లో వర్ణించడం కుదరని సువర్ణరేఖ పండ్లు ఒక డజనయినా తిననే లేదు.

రాయలసీమ పలవరించే మల్గుబా, బేనీషా రుచుల నిషాలో ఇంకా మునిగి తేలనే లేదు.

Ads

పగలూ రాత్రీ పెరుగన్నంలో మామిడి పండు ఇంకా మొదలు పెట్టనే లేదు.

బంగినపల్లి ముక్కల మీద వేసుకోవడానికి తెచ్చిన వెనీలా ఐస్ క్రీమ్ మనసు కరిగి నీరైపోయింది.

వేసవిలో మామిడి పండ్లు, ఐస్ క్రీములు బాధ్యతగా పెంచే బరువును తగ్గించుకోవడానికి బాధ్యతగా చేయాల్సిన వ్యాయామ ప్రణాళికలు ఇంకా సిద్ధం కానే లేదు.

వేడి చేసి ఇబ్బందులొస్తే…చలువ కోసం సిద్ధం చేసుకోవాల్సిన గసగసాల పాయసం, కొబ్బరి నీళ్లు, మజ్జిగల అకడమిక్ డిబేట్ ఇంకా మొదలవ్వనే లేదు.

బండ్ల కొద్దీ మామిడి పండ్లు తిని వచ్చే వేసవి నుండీ మామిడి పండు జోలికే వెళ్లకూడదని ఉల్లంఘనీయ నిర్ణయం ఇంకా తీసుకోనే లేదు.

ఒక్క పూట అయినా చిన్నప్పటిలా నోరు, మొహమంతా మామిడి స్వర్ణ వర్ణం పులుముకుని…చేతుల్లో రసం ఒంటి బట్టల మీద పడి…వేసవి పునీతం అవ్వనే లేదు.

తోటలున్నవారు ప్రేమగా పంపే మామిడి కాయలు ఇంట్లో మాగబెట్టుకోవడానికి ఖాళీ చేసిన స్టోర్ రూము అరల్లో ఇంకా ఎండు గడ్డి పరచనే లేదు.

రోజూ నిద్ర లేవగానే ఉషోదయ వేళ …ఏయే కాయలు ఉషోదయ సంజ కెంజాయ రంగు పులుముకుని ఎరుపెక్కాయో చూసి…పక్కన పెట్టుకుని తినబోయే రుచులను తలచుకుని లొట్టలు వేయనే లేదు.

మా ఆవిడ నానా ఆవకాయల కోసం ఎరుపెక్కిన కళ్లతో జల్లెడ పట్టించి పెట్టుకున్న గుంటూరు ఎర్ర కారం ఘాటు ఇంకా ఇంటికొచ్చిన వారి కళ్లల్లో చల్లిన ప్రేమపూర్వక కారంగా పరిణమించనే లేదు. పుల పుల్లటి కాయలకు చల చల్లటి చన్నీటి స్నానాలు చేయించి…పొడిబట్టతో తుడిచి…ఆరబెట్టి కాలనీలో కత్తి వేటుకొక ముక్కగా నరికించుకుని రానే లేదు. తొక్కుళ్ళు, మాగాయలు, విత్ వెల్లుల్లి, వితవుట్ వెల్లుల్లి, ఆవ పాళ్ల ఆద్యంతాలు లేని ఆవకాయ మహా పురాణం చర్చ ఫోన్లలో మొదలే కాలేదు. వంటిళ్లు ఎరుపెక్కి, జాడీలు ఎరుపెక్కి, కంచాల్లో అన్నాలు కొత్తావకాయలతో ఎరుపెక్కి…సకల వర్ణాలు వివర్ణమై…కాయ పచ్చ రంగు; పచ్చడి అరుణ వర్ణం; పండు స్వర్ణ వర్ణం మాత్రమే కంటికి కనిపించే దృశ్యం ఇంకా పూర్తిగా ఆవిష్కారం కానే లేదు.

ఈలోపే…
ఏమిటి ఈ అకాల వర్షాలు?
ఎందుకు ఈ వడగళ్ల వానలు?
ఏయే వింత పేర్ల ఈ తుఫానులు?
ఎవరిని ముంచడానికి ఈ ఆకాశానికి చిల్లులు పడ్డ కుంభ వృష్టులు?

ఇదేమన్నా తొక్కలో అరటి పండా? తొక్క తీసి ఏ రుతువులో అయినా తినడానికి?

పండ్లలో రారాజు అయిన మహారాజా మామిడి పండు.
సర్వం సహా చక్రవర్తి అయిన మామిడి పండు.
ఎండల వేసవిలో తప్ప ఇంకెప్పుడూ మన మొహం కూడా చూడడానికి ఇష్టపడని ఆత్మాభిమానంగల పండు.
వేసవిని ఫలవంతం చేయగల రుతువు పండు.
వేసవి రుతువుకు బతుకు పండు.

“ఇంతకూ-
ఇది ఎండా కాలమా?
వానా కాలమా?
కమాన్!
టెల్ మీ!”
అని వేవిళ్ళకొచ్చిన మావిళ్లు అడుగుతున్నాయి.
ఉగాది, శ్రీరామ నవమి గుమ్మాలకు కట్టిన మామిడి తోరణాలు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక మౌనంగా ఉన్నాయి.

మామిడి పలకరింపుల పులకరింపులు లేక-
మామిడిపూడి ఇంటి పేర్లు…
మామిళ్ల పల్లెల వీధులు…
మామిడి కొమ్మెక్కిన కోయిలలు…
కోయిల పాటలు వినని మామిడి కొమ్మలు…
మావిడాకులు కట్టక విడాకులు తీసుకున్న అసందర్భాలు…
ఎంతగా కుమిలిపోతున్నాయో తెలుసా?

కలియుగారంభంలో ఒంటి స్తంభపు మేడ మీద ఇలాంటి అకాల వర్షాలకు తడిసి…పుచ్చిన మామిడి పండులోకి దూరబట్టే కదా తక్షకుడు పరీక్షిత్తును మింగేయగలిగాడు! దాన్ని కళ్లారా చూసే కదా వ్యాసుడు ఆరోజు నుండి ఈరోజు వరకు మామిడి పండు మొహం చూడాలంటేనే వణికిపోతున్నాడు!

ఇదేమన్నా చిన్న విషయమా?
లైట్ తీసుకోవడానికి!
పార్లమెంటు సంయుక్త సమావేశాలు నిర్వహించి…చర్చించి…ఏ స్థాయీ సంఘాన్నో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి…విచారించాల్సినంత సీరియస్ ఆమ్ర వికృతి వైపరీత్యం కాదా!

పాయె…
ఈ వర్షాలకు మామిడి రైతు మునిగిపాయె.
రుచుల నాలుక పిడచకట్టుకుని పాయె.
బీర్బల్ కథలో మామిడి పండు రుచిలా ఈ వేసవిలో మామిడి రుచి ఒక జ్ఞాపకమాయె!

-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com

మామిడి… వర్షార్పణం

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!
  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…
  • ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!
  • వేలాడదలుచుకోలేదు… క్లియర్ ప్లానింగ్… జస్ట్, అలా వదిలేశాడు…
  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions