.
ప్రపంచంలోకెల్లా అత్యంత ధనికుల్లో ఒకడు… అంత సంపద ఎలా వచ్చిందనే భేతాళ ప్రశ్నను పక్కన పెడితే… డబ్బుకు ఏం కొదువ..? సమాజానికి ఏం తిరిగి ఇస్తున్నాడనేది మరో పెద్ద భేతాళ ప్రశ్న…
కానీ డబ్బుండగానే సరిపోదు… పబ్లిసిటీ కోసం చేసే షోలనైనా కాస్త నాణ్యతతో చేయొచ్చు కదా, ఎలాగూ డబ్బు వెదజల్లుతున్నారు కదా అనేది ప్రస్తుత చిన్న ప్రశ్న… ఈరోజు అన్ని ప్రధాన దినపత్రికల్లో వచ్చిన నీతా అంబానీ యాడ్స్ చదివితే అలాగే అనిపిస్తుంది…
Ads
కొన్నాళ్లుగా ఇదే తంతు… ఆమె కుటుంబం ఏదో ఓ పబ్లిసిటీ షో చేస్తుంది… ఎవడు రాస్తేనేం, రాయకపోతేనేం, మనం అనుకున్నట్టుగా ఎవరూ రాయడం లేదు, సో, మనమే అన్ని పత్రికల్లో యాడ్స్ రూపంలో, అదీ అత్యంత విలువైన ఫస్ట్ పేజీ, హాఫ్ పేజీ కొనేసి అచ్చేయిద్దాం, మనకేమైనా డబ్బులకు కొదవా, పారేద్దాం అన్నట్టుగా యాడ్స్ ఇస్తున్నారు…
దాంట్లో ఒక్క అక్షరం మార్చినా కుబేర్ అంబానీకి కోపం వస్తుంది కాబట్టి పత్రికలు యథాతథంగా అచ్చేసి, చెక్కులు చూసుకుని మురిసిపోతాయి… విషయం ఏమిటంటే..? ఇదీ ఆ యాడ్…

రాణీ అంబానీ, సారీ, నీతా అంబానీ యునైటెడ్ ఇన్ ట్రయింఫ్ (United in Triumph) అని ఓ ప్రోగ్రాం చేసింది, గతంలోనూ ఒకటి చేసినట్టు గుర్తు… అంటే, గెలుపుల్లో ఏకత… ఇందులో క్రికెట్‌లో పురుషుల వరల్డ్ కప్ విజేతలు, మహిళల వరల్డ్ కప్ విజేతలు, అంధ మహిళ వరల్డ్ కప్ విజేతలు, ముఖ్య ప్లేయర్లు, లెజెండరీ గెస్టులతో ఆ ప్రోగ్రాం నిర్వహించింది… వాళ్లను అభినందించింది… గుడ్, అభ్యంతరాలు ఉండాల్సిన పనిలేదు…
కానీ… ఇక్కడ పూర్తి పాఠం ఇవ్వలేను గానీ, ఆసక్తి ఉన్నవాళ్లు ఏ ప్రధాన పత్రిక ఫస్ట్ హాఫ్ పేజీ యాడ్ చూసినా సరే… అందులో ఆ ప్రోగ్రాం గురించో, విజేతల గురించో, గెలుపుల్లో ఏకత గురించో, ఎందుకు వాళ్లను సన్మానించుకోవాలో చెప్పకుండా… 70 శాతం కంటెంటు ఏమిటో తెలుసా..?
పురుషుల వరల్డ్ కప్ ఫినాలే, మహిళల వరల్డ్ కప్ ఫినాలే స్పాట్ వార్తను రాసిపారేశారు… అంటే, ప్రత్యర్థి జట్టు ఎన్ని పరుగులు చేసింది, మనవాళ్ల వికెట్లు ఎలా పడ్డాయి, చివరకు ఎవరెన్ని పరుగులు కొట్టారు… ఇలా… నవ్వొచ్చింది… సరే, భాషాపరమైన నాసిరకం ప్రజెంటేషన్ ఎలాగూ ఉంది… దాదాపు అన్ని అనువాద యాడ్స్ అలాగే తగలడుతున్నాయి కదా…
చివరకు ఆ స్పాట్ కవరేజీలో అంధుల కప్ గురించి అదీ చేతకాలేదు… వేలు, లక్షల కోట్ల డబ్బులున్నా సరే… ఒక క్రియేటివ్ యాడ్, ఒక స్పూర్తిదాయక కంటెంటు కాదు కదా… కనీసం జరిగిన ప్రోగ్రాం ఉద్దేశమేమిటో కూడా సరిగ్గా చెప్పలేని దురవస్థ… అందుకే చెప్పేది బిజినెస్ వేరు, నాణ్యమైన స్వోత్కర్ష వేరు..!!
Share this Article