మనం ఉత్త(ర) కుమారులమబ్బా!
… ఒక పిట్టకథ! సాక్షి ఆదివారం ఫ్యామిలీ పేజీలో ఇందిర పరిమి గారు ‘డబుల్ ధమాకా’ కాలమ్ నిర్వహించే కాలం అది! (What a Memorable Days). వివిధ రంగాల్లోని ఇద్దరు వ్యక్తుల్ని ఒక చోట చేర్చి వాళ్ల జీవితాల గురించి, వారి స్నేహం గురించి ఇంటర్వ్యూ చేసేవారు. వివిధ రంగాలు అన్నాను కానీ, అందులో సినీరంగ ప్రముఖులే ఎక్కువగా ఉండేవారు.
… ఒకసారి దర్శకుడు త్రివిక్రమ్, నటుడు సునీల్ గార్ల ఇంటర్వ్యూ వేశారు. ఇద్దరూ చాలా మంచి మిత్రులనీ అందరికీ తెలుసు! ఇంటర్వ్యూలో ఒకచోట “మిమ్మల్ని ప్రభావితం చేసిన పుస్తకాలు?” అని ఇందిరగారు అడిగితే, “చాలా ఉన్నాయి. అవి రాయడం మొదలు పెడితే మీ పేపర్ సరిపోకపోవచ్చు!” అన్నారు త్రివిక్రమ్. “నేను పుస్తకాలు ఎక్కువ చదవలేదు. నన్ను అత్యంత ప్రభావితం చేసిన పుస్తకం త్రివిక్రమ్” అని సునీల్ గారు చెప్పారు. (As it is.. ఇలాగే!)
Ads
… ఇది 2009 టైంలో చేసిన ఇంటర్వ్యూ. ఇప్పటికి 14 ఏళ్లు గడిచిపోయాయి. మళ్లీ ఎవరైనా అలా సినిమా వాళ్లని పుస్తకాల గురించి అడుగుతారా? కనీసం పుస్తకాల ప్రస్తావన తెస్తారా అని చూస్తూ ఉన్నాను. ఏళ్ల పాటు నిరాశే! మధ్యలో మొన్న ఒకసారి అనుదీప్ (‘జాతిరత్నాలు’ దర్శకుడు)ని ఒక యూట్యూబ్ ఛానెల్ వాళ్లు ఇంటర్వ్యూ చేస్తూ “మీకు నచ్చిన పుస్తకాలేమిటి?” అని అడిగారు. ఆయన కొన్ని పుస్తకాలు చెప్పారు (అందులో ‘డి.వెంకట్రామయ్య కథలు’ పుస్తకం ఉంది). మొత్తంగా 14 ఏళ్ల తర్వాత ఎక్కడో ఒక దర్శకుడిని పుస్తకాల గురించి అడిగే ఇంటర్వ్యూ కనిపించింది. సంతోషం!
… సాహిత్యం గురించి వదిలేద్దాం కాసేపు! ఒక సృజనాత్మక రంగం(సినిమా)లో ఉండేవారిని మరో సృజనాత్మక రంగం (సాహిత్యం, చిత్రకళ, నృత్యం) గురించి అడగొచ్చని ఈ ఇంటర్వ్యూ చేసేవారికి ఎందుకు అనిపించదు? ఆ ఆలోచన ఎందుకు చేయరు? సినిమా ఇంటర్వ్యూలు సరే, వ్యక్తిగత ఇంటర్వ్యూలు చేసేటప్పుడూ అలాంటి టాపిక్ ఎందుకు రాదు? పుస్తకాలు మాత్రమే కాదు, “పెయింటింగ్ ఇష్టమా? మీకు నచ్చిన చిత్రకారుడు ఎవరు? మీరు అభిమానించే నాట్యకారుడు (సినిమాల్లో కాకుండా) ఎవరు? విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి చిత్ర, శిల్పకళ ఏమైనా అబ్జర్వ్ చేశారా?” ఇలాంటి డెప్త్ ప్రశ్నలు అడిగే ఆలోచన ఉండదు. అలా అడగటం పాపమా? సినిమా వాళ్లని సినిమాల గురించి తప్ప మరో రంగం గురించి అడగటానికి నామోషీనా? సినిమా వాళ్లకి సినిమాలు తప్ప మరేమీ తెలియదు అని బలంగా ఫిక్స్ అయ్యారా?
… సరే! ఇవన్నీ అడగాలంటే ఆ ఇంటర్వ్యూ చేసేవారికి ఇవన్నీ తెలియాలి కదా అనేది అతి పెద్ద ప్రశ్న! నిజమే! లలిత కళల (అమ్మాయిల పేర్లు కాదు, Fine Arts) గురించి కొంచెమైనా తెలియకుండానే ఇంటర్యూయర్ అవతారం ఎత్తడం చాలా ఈజీ అయిపోయిన కాలం ఇది! త్రిపురనేని శ్రీనివాస్ అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ తమ్ముడు అని భ్రమపడే పరిస్థితులున్న కాలం ఇది! కె.ఎన్.వై.పతంజలి అంటే రాందేవ్ బాబా చుట్టం కామోసు అని ఫీలయ్యే తరుణం ఇది! కేశవరెడ్డి అంటే జగన్ మోహన్‌రెడ్డి గారి బంధువేమో (నవ్వొద్దు! అలాగే ఆలోచిస్తారు కొందరు) అని అనుకునే స్థితి ఇది! అందరూ కాకపోయినా చాలావరకు ఇలాగే కనిపిస్తూ ఉన్నారు. ఇలాంటప్పుడు ఎక్కువ ఆశించడం కరెక్ట్ కాదేమో! But, As a Journalist I had the Utmost Pain about it. Don’t Interviewers need Responsibility to Research before Interviewing Someone? అబ్బే! అంత టైం లేదు గురూ! అంతా హడావిడి మంత్రం. వ్యూసే రాచమార్గం!
… తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారు ఓ ఇంటర్వ్యూలో అన్నట్టు, “మనవాళ్లకి గొప్ప కళలు, గొప్ప విషయాలు అవసరం లేదు. మామూలు విషయాలే చాలు!”. అంతేనేమో! మనం ఉత్త(ర) కుమారులమబ్బా!… – విశీ
Share this Article