గతంలో కాదు గానీ కొన్నేళ్లుగా రాంగోపాల్‌వర్మ అందరిలాగే తన సినిమాలకు టీజర్లు, ట్రెయిలర్లు వంటివి రిలీజ్ చేస్తున్నాడు… కానీ మిగతా సినిమాలతో పోలిస్తే తన టీజర్లు భలే పంచ్‌తో ఉంటాయి… కానీ తీరా సినిమా విడుదలయ్యాక అందులో ఏమీ ఉండదు… ఉత్త చెత్త… అందుకే అంటుంటారు వర్మ సినిమాలు చూడనక్కర్లేదు, ట్రెయిలర్లు చూస్తే చాలు అని…
అసలు వర్మ మాత్రమే కాదు… కొన్ని ఇతరత్రా సినిమాలు కూడా అంతే… అంతెందుకు, టీవీ ప్రోగ్రాములు, సీరియళ్లలో ఈ రోగం మరీ ఎక్కువ… ప్రోమోల్లో అదరగొడతారు, ఏవో ట్విస్టులతో ఊదరగొడతారు… ఏదో జరగబోతోందన్న కలర్ ఇస్తారు… తీరా చూస్తే ఆ సీరియళ్లు లేదా ప్రోగ్రాముల్లో అసలు జరిగేది వేరు, అది తుస్… ఉత్త నాసిరకం రొటీన్ పెంట యవ్వారమే…
మరి బిగ్‌బాస్ కూడా ఆ టీవీ సంస్కృతిలో పుట్టి, దాని మీద బతుకుతున్నవాడే కదా… ఆ రోగం తనకూ అంటకుండా ఉంటుందా..? ఇంకాస్త ఎక్కువే అంటింది… దీనికి శివాజీ హౌజు నుంచి బయటికి వెళ్లిపోవడం అనే ఎపిసోడ్… ఆదివారం నాగార్జున వీకెండ్ షో అయిపోగానే ఓ టీజర్ వదిలారు… అందులో శివాజీని హౌజు నుంచి పంపించేస్తున్నట్టుగా… మిగతా హౌజుమేట్స్ అందరూ వద్దూవద్దంటూ శివాాజీకి అడ్డం పడుతున్నట్టు… షాక్‌కు గురైనట్టు… యావర్ అయితే గేటు నుంచి పోతున్న శివాజీని వెనక్కి లాగుతాడు…
Ads
నిజానికి జరిగిందంతా వేరు… సోమవారం రాత్రి ఎఫిసోడ్‌లో నిండా ఐదు నిమిషాలు కూడా లేదు ఆ డ్రామా అంతా… (పూర్తిగా డ్రామా అనలేమేమో… శివాజీది డ్రామా కాదు, బిగ్‌బాస్‌దే ఓ ఫేక్ ఓవరాక్షన్… అదే టీవీల ప్రోమోల టైపు అన్నమాట…) విషయం ఏమిటంటే, శివాజీ సరిగ్గా ఆడలేడు, టాస్కులు చేతకావు, ఎంటర్‌టెయిన్ చేయలేడు, డాన్సులు రావు, అందరితో సమానంగా మింగిల్ కాలేడు… మొన్న చెప్పుకున్నాం కదా, పొలం గట్టు మీద కుర్చీ వేసుకుని, పెత్తనం చేసే కామందులా ఉంటున్నాడు…
దీనికితోడు తరచూ నేను పోతా, నన్ను పంపించేయండి అని బిగ్‌బాస్‌కు ఆఫర్ ఇస్తుంటాడు… అలా పోయేవాడైతే ఎందుకు వచ్చినట్టు..? బయటికి వెళ్లడానికీ కొంత కసరత్తు, యాతన ఉంటాయి, తనకు తెలియదేమో… ఈలోపు తన చేతికి ఏదో అయ్యింది… అదే బిగ్‌బాస్‌కు చెప్పుకున్నాడు… ఇలాంటి విషయాల్లో రిస్క్ తీసుకోలేరు కదా… చేతికి ఎక్స్‌రే తీయించి, ఏవైనా మెడిసిన్స్ ఇప్పించడానికి బయటికి తీసుకెళ్లారు… మళ్లీ వెంటనే తీసుకొస్తామనీ శివాజీకి చెప్పారు…
హౌజుమేట్స్‌కు ఈ విషయం చెప్పాలని కూడా బిగ్‌బాస్ చెప్పాడు… శివాజీ అలాగే చెప్పాడు… ఐనా సరే, బిగ్‌బాస్ ఉల్టాపుల్టా చేస్తున్నాడు అన్నీ, ఇదీ అందులో ఒకటేమో, నిజంగానే శివాజీని పంపించేస్తున్నారేమో అనుకుంటూ అందరూ ప్రేమగా అడ్డుపడ్డారు… అన్నా, పోవద్దు అన్నా అని అడ్డుగా నిలబడ్డారు… ఒకసారి బిగ్‌బాస్ బయటికి తీసుకెళ్లాలని ఫిక్సయ్యాక అది ఫేక్ అయినా, నిజమైన సమస్యే అయినా ఆగదు కదా… తెలిసీ అందరూ అడ్డుపడటం ఎట్సెట్రా డ్రామా నడిచింది…
తీరా కొంతసేపటికి శివాజీని తిరిగి హౌజులో ప్రవేశపెట్టారు… కథ ఒడిసింది… ఈమాత్రం దానికి నిన్నటి నుంచీ శివాజీని ఏదో హౌజు నుంచి తరిమేసినట్టు ప్రోమోలతో చంపేశారు… అసలు ఆటను రక్తికట్టించండ్రా బాబూ, ఈ సీజన్ కూడా చూడబోతే తన్నేసేలా ఉంది అని బిగ్‌బాస్ అభిమానులు చెబుతుంటే, ఈ దిక్కుమాలిన ప్రోమోలతో సగటు నాసిరకం టీవీ సీరియల్‌ను తలపింపజేస్తూ బిగ్‌బాస్ టీం మరింత దిగజారుస్తోంది…!!
Share this Article