బలగం సినిమా అనగానే ‘పిట్ట ముట్టుడు’ అంశం మాత్రమే గుర్తుకురావడం ఓ అబ్సర్డ్… ఓ కాకి, ఓ ప్లేటులో నీసు ఫుడ్, ఓ మందు గ్లాసు… బలగం అంటే ఇదేనా..? ఈటీవీలో ఓ క్రియేటివ్ డైరెక్టర్ అంతకుమించి ఎదగలేకపోయాడు ఫాఫం… శ్రీదేవి డ్రామాకంపెనీ అని ఓ ప్రోగ్రామ్ చేస్తారు కదా ప్రతి ఆదివారం మధ్యాహ్నం… వచ్చే ఆదివారం బాపతు ప్రోమో రిలీజ్ చేశారు…
స్థూలంగా పైపైన చూస్తుంటే బలగం మూవీకి మంచి స్పూఫ్ చేశారురా, దాన్ని బేస్ లైన్‌గా తీసుకుని, కాస్త కామెడీ మెటీరియల్ జతచేశారు… ఓహ్, అంతటి హిట్ సినిమా కదా, ఇప్పటివరకు ఆ సినిమా బేస్డ్ కామెడీ స్పూఫ్‌లు రాలేదేమిటబ్బా అనుకుంటుంటే… ఇదుగో శ్రీదేవి డ్రామా కంపెనీలో దాన్నే మెయిన్ ప్లాటుగా తీసుకున్నారు ఈసారి… మళ్లీ మళ్లీ అదే ఆది పెత్తనం, మొనాటనస్ పంచులతో కాస్త చిరాకెత్తింది కానీ మిగతావాళ్లు బాగానే చేశారు…
ప్రత్యేకించి ఈ షోకు బలగం డైరెక్టర్ వేణును పిలిచారు… నిజానికి వేణు ఆ ఈటీవీ కామెడీ షోల నుంచి, ప్రత్యేకంగా జబర్దస్త్ నుంచి ఎదిగినవాడే… కాబట్టి తను కూడా ఈ స్పూఫ్‌లో కనిపించడం బాగుంది… కానీ ముందే చెప్పుకున్నట్టుగా కేవలం కాకి, అన్నం ప్లేటు, మందు గ్లాసు స్థాయిని దాటలేదు ఈ స్పూఫ్…
Ads
మధ్యలో ఏమైందో ఏమో గానీ హఠాత్తుగా దసరా సినిమాలోని చమ్కీల అంగీ ఏసి వదినె పాటను జొప్పించారు… బలగానికీ, దసరాకు ఏం లింక్..? నిజానికి దసరా మూవీలో తెలంగాణతనం ఆర్టిఫిషియల్… హీరో డిక్షనే నాసిరకం… కానీ బలగం అలా కాదు, ప్యూర్ తెలంగాణ… మళ్లీ చివరకు ప్రవీణ్‌తో ఒగ్గుకథ పెట్టారు… కానీ బుర్రకథకూ ఒగ్గుకథకూ నడుమ ఇంకేదో బుర్రొగ్గుకథగా మార్చేశారు… చివరకు అందులో కూడా హైపర్ ఆది కీర్తన… అసలు ఏమైందిరా మీకు..?
ఆస్తుల పంపకం బిట్ కాస్త వోకే… కాకపోతే అందులో కూడా ‘పెళ్లికి ముందు తిన్న కంచం కాదు, పెళ్లికి ముందు వాడిన మంచం ఉంటే ఇవ్వండి’ అంటూ మళ్లీ ఆది మార్క్ వెగటు పంచ్ ఒకటి… (నిజానికి తెలంగాణలో కంచం అనే పదం వాడరు… తలె లేదా తల్లె అంటారు అన్నం తినే ప్లేటును)… దసరాలో కీర్తి సురేష్ చేసిన స్ట్రీట్ డాన్స్‌ను ఇంద్రజతో చేయించి, దాన్నీ కలిపేశారు ఇక్కడే… వాళ్లిష్టం… ఏది తోస్తే అది… దీన్నే స్పూఫ్ అంటారా..? ఏమో… అది ఈటీవీ కదా… కానీ ఏమాటకామాట ప్రవీణ్ టైమింగు బాగుంటుంది…!
చివరగా… ఈటీవీ ఎప్పుడో మూడో స్థానంలోకి వెళ్లి సెటిలైపోయింది… మొన్నటి బార్క్ రేటింగ్స్ చూస్తే శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ షోలను మించి మంచి రేటింగ్స్ సాధించింది… (అంటే ఈటీవీ స్థాయిలో…) దీన్ని కూడా నాసిరకం షోగా మార్చితే అది ఓవరాల్‌గా ఈటీవీని నాలుగో ప్లేసులోకి నెట్టేయడం ఖాయం…!! శ్రీదేవి డ్రామా కంపెనీ హైదరాబాద్ బార్క్ కేటగిరీలో 4.04 రేటింగ్స్ సాధించగా, జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్ 2.49, 2.51 రేటింగులు మాత్రమే సాధించి చతికిలపడ్డాయ్… నిజంగానే ఆ బూతుల షోలను జనం చూడటం మానేశారు…!! చార్ట్ చూడండి… ఈటీవీ స్టార్ మా రేటింగుల్లో మూడో వంతుకు పడిపోయింది… పిటీ…
Share this Article