గాంధారి పేరిట ఓ మ్యూజిక్ వీడియో రిలీజైంది… సోనీ వాళ్లు నటి కీర్తిసురేష్‌తో చేసిన వీడియో అది… వేంఠనే మన సంకీర్తనాచార్యులందరూ అందుకుని, ఆహారాగాన్ని, ఓహోగానాన్ని ఎత్తుకున్నారు… నిజంగా ఆ మ్యూజిక్ వీడియోకు అంత సీనుందా..? ఏమీ లేదు… పైగా ఆ టీంను చూస్తే జాలేసింది… ప్రత్యేకించి పాటల రచయిత సుద్దాల అశోకుడికి ప్రయాస చూసి మరీ…
ఏమాటకామాట… ఒకప్పుడు కాస్త బొద్దుగా ఉండే కీర్తిసురేష్ సన్నబడింది… బొండుమల్లె వంటి దేహం కాడమల్లెలా కనిపిస్తోంది… తను ఏ సినిమాలోనూ పెద్దగా డాన్స్ చేసినట్టు కనిపించలేదు… కానీ ఈ వీడియోలో అలవోకగా చేసింది డాన్స్… అఫ్‌కోర్స్, అవి సినిమాల్లో మాత్రమే కనిపించే గెంతులు… ఆ స్టెప్పులు కంపోజ్ చేసింది కూడా బృంద అనే కొరియోగ్రాఫర్… కేరాఫ్ చెన్నై…
సంగీతకారుడు పవన్… పుట్టింది చెన్నై… పాట పాడింది అనన్య భట్… కేరాఫ్ కర్నాటక… నిర్మాతలేమో నార్త్… పాట జస్ట్ స్టార్ట్ కాగానే… అప్పట్లో హమ్ ఆప్‌కే హౌ కౌన్ అని ఓ పాపులర్ హిందీ సినిమా వచ్చింది కదా… అందులో మాధురీ దీక్షిత్, సల్మాన్ ఖాన్ పాట… దీదీ తేరా దేవర్ దివానా… లతా మంగేష్కర్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు… ఈ గాంధారి పాట వినగానే అది గుర్తొస్తుంది…
Ads
సేమ్, నీ మరిది చూసినవా… పోయిన ఏడాది దాకా అసలు రైకల వాసన కూడా తెలవనోడు, ఇప్పుడు ఏందేదో చేస్తున్నడు, అదేమంటే రంగుల పండుగ కదా అంటున్నడు….. అంటూ సాగుతుంది ఈ పాట కూడా..! నిజానికి పేరుకే తెలుగు పాట… ఒక్క సుద్దాల తప్ప అందరూ వేరే రాష్ట్రాల వాళ్లే… పర్లేదు, కనీసం పాటలో వీసమెత్తు తెలుగుతనం ఉందా..? లేదు, జీరో..!
అసలు హోళీయే నార్త్ పండుగ… మనమూ జరుపుకుంటున్నాం గానీ, నార్తరన్ వాళ్లు ఇచ్చినంత ప్రయారిటీ మనం ఇవ్వం… భంగు, డాన్సులు, స్వీట్లు, వరసయ్యే వారితో సరసాలు, విందులు, మందు… వాళ్ల ధోరణి వేరు… ఈ పాట కూడా హోళీ పాట… అదీ కాస్త స్థలంలో చుట్టూ కర్టెన్లు కట్టి, ఓ సెట్‌లా వేసి, పది మంది డాన్సర్లతో గ్రూపు డాన్స్ చేయించారు… ఒకే కోణం నుంచి షూట్ చేశారు… వివిధ పండుగల సందర్భంగా మన తెలుగు యూట్యూబ్ చానెళ్లు చేయించే పాటలు వందరెట్లు నయం…
చివరకు కీర్తిసురేష్ డ్రెస్సింగ్ కూడా నార్తరన్ స్టయిలే… లెహంగా… అసలు అన్నింటికన్నా ముఖ్యంగా దీనికి గాంధారీ అనే పేరెందుకు పెట్టినట్టు..? గాంధారీ అనబడే అక్కను ఉద్దేశించి చెల్లెలు పాడుతుందా..? అసలు గాంధారి అనే పేరు ఎవరైనా పెట్టుకుంటారా..? ప్రత్యేకించి సుద్దాల తను ఏం రాశాడో తనకైనా తెలుసా అనేది డౌట్… హోళీ రోజున సిరిగంధం పూసుకుంటారా మాస్టారూ..? ‘‘పిందెలాగా ఉండే లంకెబిందవంటాండే…’’ అట… లంకెబిందె పిందెలా కనిపించడం ఏమిటో…
సినిమా పాటలు రాసీ రాసీ… ఏవో నాలుగు పదాలు ట్యూన్లలో ఇరికించి, ఇదే సాహిత్యం అనేయడం అలవాటైపోతే ఇవే తిప్పలు… పైగా ప్రాసల ప్రయాస సరేసరి… పైగా దీనికి సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్ రేంజులో ఉత్సవం, ప్రసంగాలు, ప్రోమోలు… వామ్మో… ఏదో ఓ నాసిరకం హిందీ పాటకు తెలుగు డబ్బింగ్ చేసినట్టుగా ఉంది… ఒక్క ముక్కలో…!! కాకపోతే ఇప్పుడు ట్రెండ్ తెలంగాణ ఫోక్ కదా… దీనికి కూడా ఆ ఫ్లేవర్ తీసుకురావడానికి ఏదో తిప్పలు పడ్డారు గానీ… తెలంగాణతనం పట్టుకోవడం అంత వీజీ కాదు… సుద్దాల కూడా ఏనాడో మరిచిపోయాడు…!! ఇక జనం సారంగదరియా పాట మరిచిపోతారనీ, ఈ గాంధారి పాటే వినిపిస్తుందని ఒకటే డప్పు కొట్టుకున్నారు… కానీ కీర్తి కీర్తే, సాయిపల్లవి సాయిపల్లవే…
Share this Article