ప్రస్తుతం మార్కెట్ లో కిన్లే, టాటా వంటి వాటర్ బాటిల్స్ ను చూస్తున్నాం కానీ.. అంతకుముందు బజార్లో కొనుక్కునే మంచినీళ్ల బాటిలంటే బిస్లరీనే. అలాంటి బిస్లరీ నష్టాల్లో కూరుకుపోయి టాటాకు అమ్మేద్దామనుకున్నాడు రమేష్ చౌహాన్. అంతవరకూ ఆ కంపెనీ వ్యవహారాలు చూసుకోవాలని తండ్రి కోరినా పట్టించుకోని.. ఒకే ఒక్క కూతురైన జయంతి చౌహాన్.. కంపెనీ నష్టాల్లో ఉందని తెలిశాక మాత్రం సంస్థను హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ఓ ముందడుగేసింది.
ఇప్పుడామె బిస్లరీతో పాటు.. వారి సాఫ్ట్ డ్రింక్స్ వ్యాపారం.. అంబానీతో, తమ కంపెనీని అమ్మేద్దామనుకున్న టాటాతో సరిసమానంగా పోటీ పడుతోంది. అందుకే జయంతీ చౌహాన్ ఓ సక్సెస్ స్టోరీ. ఆమె వ్యాపార సామ్రాజ్యం విలువ ఇప్పుడు ఏకంగా 7 వేల కోట్ల రూపాయల పైమాటే.
ఒకవైపు నష్టాలు.. మరోవైపు ఛాలెంజింగ్.. పైగా తాను స్థాపించిన బిస్లరీ ఇంటర్నేషనల్ సంస్థను ముందుకు తీసుకెళ్లే కొడుకులెవ్వరూ లేరు.. ఆ సమయంలో టాటాకు అమ్మేయాలని చర్చలు కూడా చేశాడు బిస్లరీ సంస్థ అధినేత రమేష్ చౌహాన్. అప్పటివరకూ కూతురును అడిగినా ఆమె తిరస్కరించింది. కానీ, కంపెనీ నష్టాల్లోకి వెళ్లడం.. మరోవైపు తండ్రికి వయస్సు మీద పడటంతో… దాన్నే ఓ ఛాలెంజింగ్ ఫ్యాక్టర్ గా భావించిన జయంతీ చౌహాన్ 2022 నవంబర్ లో బిస్లరీ వ్యాపార బాధ్యతలను చేపట్టింది.
Ads
జయంతి చౌహాన్ నేపథ్యాన్ని ఓసారి పరిశీలిస్తే.. న్యూయార్క్, ఢిల్లీ, ముంబైల్లో పెరిగింది. ఆమె లాస్ ఏంజిల్స్‌లోని ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ మర్చండైజింగ్ (FIDM)లో అండర్ గ్రాడ్యుయేట్ విద్యను అభ్యసించింది. అదనంగా ఫ్యాషన్ స్టైలింగ్ లోనూ, ఫ్యాషన్ ఫోటోగ్రఫీ వంటి విభిన్నమైన రంగాల్లో లండన్ లో అధ్యయనం చేసింది.
వాస్తవానికి తాను వెళ్లాల్సిన రంగం వేరు. కానీ, అనివార్య పరిస్థితుల్లో తండ్రి బాధ్యతలను స్వీకరించి పగ్గాలు చేపట్టాల్సిన సమయంలో.. మార్కెట్ సవాళ్లను అధిగమిస్తూ ఇప్పుడు బిస్లరీ ఇంటర్నేషనల్ సంస్థ ఆదాయాన్ని ఇంతింతై వటుడింతై అన్నట్టుగా తన అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్ స్కిల్స్ తో పురోగమన దిశలో తీసుకెళ్తోంది.
బిస్లరీ శీతల పానీయాల మార్కెట్‌లోకి విస్తరించాలన్న ఆలోచన లేకముందు.. జయంతీ చౌహాన్ బాధ్యతలు చేపట్టేకంటే ముందు.. ఇండియన్ బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్.. కాంపా కోలా బ్రాండ్‌తో తన సొంత శీతల పానీయాలను మార్కెట్ లోకి తీసుకురావాలన్న యోచన చేసింది. కానీ సాఫ్ట్ డ్రింక్స్ విషయంలో.. మార్కెట్ ను క్యాప్చర్ చేసి.. మీడియా, సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించుకుని జయంతీ చౌహాన్ వేసిన అడుగులు.. ఏకంగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకే సవాళ్లు విసిరాయి.
జయంతీ చౌహాన్ నేతృత్వంలోని బిస్లరీ ఇంటర్నేషనల్… బిస్లరీ మినరల్ వాటర్ తో పాటు… హిమాలయాల నుండి వేదికా నేచురల్ మినరల్ వాటర్, ఫిజీ ఫ్రూట్ డ్రింక్స్, స్పైసీ జీరా డ్రింక్, బిస్లరీ హ్యాండ్ ప్యూరిఫైయర్ వంటి మరెన్నో ఉత్పత్తులతో… డిజిటల్, సోషల్ మీడియా వేదికలుగా చేసుకుని దూసుకుపోతోంది బిస్లరీ ఇంటర్నేషనల్ సంస్థ.
అమ్మేద్దామనుకున్న సంస్థను కొనాలనుకున్నవారి ముందు అంతెత్తు నిలబెట్టిన జయంతీ చౌహాన్ స్ఫూర్తిపాఠం.. దూసుకుపోతున్నామనుకున్న పురుషాధిక్య ప్రపంచానికే ఓ సవాల్ విసిరినట్టుగా అనిపించడం లేదూ..? (రమణ కొంటికర్ల)
Share this Article