ఇండస్ట్రీ ఏదన్నా గానీ.. ఏదో చేయాలన్న తపన.. దాన్నుంచి ఏంచేయాలన్న స్పష్టత పుట్టుకొస్తే.. ఒక చరిత్ర సృష్టించొచ్చని నిరూపించిన వ్యక్తి కథ ఇది. అదీ ఉత్తరాదికి చెందిన ఓ వ్యక్తి.. దక్షిణాదిలో తన వంటకాలతో ఫేమస్సవ్వడమంటే… ఆ జనం రుచికి సంబంధించిన నాడీని పట్టుకోవడం.. దాన్ని కొనసాగించడమే! దశాబ్దాల కాలంగా అలాగే నిర్వహిస్తుండటంతోనే మనం ఇప్పుడు ఆ జగ్గీలాల్ గుప్తా కథ ఓసారి చెప్పుకుంటున్నాం.
నేటి చెన్నై… నాటి మద్రాసంటే.. ఆహారప్రియులందరికీ గుర్తుకు వచ్చేది మొదటగా సాంబారే. అదిగో ఆ సాంబారు తయారీతోనే చరిత్రను తిరగరాశాడు ఉత్తరప్రదేశ్ లోని మధుర నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన ఓ వ్యక్తి. ఆయనే 1948లో రెండు వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన జగ్గీలాల్. జనం తన హోటల్ సాంబార్ ఘుమఘుమలతో గంగవెర్రులెత్తేలా చేశాడు. కాబట్టే.. ఇవ్వాల్టికీ ఆయన నెలకొల్పిన రత్నా కేఫ్ చెన్నైలో ఫుడ్ లవర్స్ బెస్ట్ అండ్ ఫస్ట్ స్టాప్.
వాస్తవానికి చెన్నైలో అద్భుతమైన రుచితో.. చాలా హోటల్స్ లో ఇడ్లీ, సాంబార్, దోసె, వడ, పొంగల్ వంటి టిఫిన్సెన్నో సందు సందుకూ దొరుకుతాయి. కానీ వాటన్నింటిలోనూ రత్నాకేఫ్ ప్రత్యేకంగా నిలవడమంటే ఇంకేదో ఉన్నట్టే లెక్క. సాధారణంగా ఏదైనా హోటల్ లో ఓ ప్లేట్ ఇడ్లీనో, వడనో ఆర్డర్ చేసి.. నాల్గుసార్లు సాంబార్ తెమ్మన్నామంటే… ఐదోసారి వెయిటర్ మనల్ని కిందనుంచి మీదివరకు అదో రకంగా చూస్తాడు. ఇక అభిమానం అడ్డొచ్చి ఐదోసారి అడగాలనుకునే ఆహారప్రియులు కూడా కొంత వెనుకడుగేస్తారు.
Ads
అదిగో అక్కడే జగ్గీలాల్ లిబరల్ గా వ్యవహరించాడు. అదే సంప్రదాయాన్ని తన తర్వాత తరాలకూ అందించాడు. అందుకే, అక్కడ ఎంత సాంబార్ తాగినా ఫ్రీ అన్నట్టుగా… టిఫిన్ ఆర్డర్ చేస్తే చాలు.. బకెట్లలో తెచ్చి పోసే రత్నాకేఫ్ సాంబారే అక్కడికి జనం క్యూ కట్టేందుకు ప్రధాన కారణం. అయితే ఇప్పటికీ చెన్నైలో జగ్గీలాల్ గుప్తా నాల్గో తరమైన 30 ఏళ్ల వారసుడు లోకేష్ గుప్తా ఆధ్వర్యంలో.. అదే టేస్ట్.. అదే క్రేజ్ తో ఆ హోటల్ జనం మన్ననలందుకుంటోంది. ఈ వారసత్వమనేది హోటల్ ను నడిపిస్తున్న జగ్గీలాల్ కుటుంబీకుల వరకే పరిమితం కాకుండా… తినేవారికీ అక్కడ వర్తిస్తుంది. నాడు జగ్గీలాల్ కాలం నుంచి ఆ హోటల్ లో తింటున్నవారంతా.. వారి మనవలు, మనవరాళ్లు, మునిమనవలనూ కూడా తీసుకొచ్చే స్థాయిలో రత్నా కేఫ్ రుచీ, నాణ్యతా కొనసాగుతుండటమే దాని సక్సెస్ ఫార్మూలా!
చెన్నైలో పరిచయమున్న నాటి తరానికే కాకుండా.. రత్నాకేఫ్ పరిచయమైన నేటి తరానికైనా ఈ హోటల్ ఎప్పటికీ ఓ నోస్టాల్జియా! జగ్గీలాల్ మనవడైన లోకేష్ యూకేలో ఆర్కిటెక్చర్ పూర్తి చేశాడు. చెన్నైలో ఉద్యోగం కోసం ఓ ఇంటర్వ్యూకి పిలుపు వచ్చినా కనీసం హాజరు కూడా కాలేదు. ఎందుకంటే అప్పటికే తండ్రితో కలిసి రత్నా కేఫ్ వ్యవహారాల్లో పడిపోయాడు లోకేష్. ఇక రత్నా కేఫే లోకేష్ జీవితమైపోయింది. తన తాత స్థాపించి, సృష్టించిన బ్రాండ్ ఇమేజ్ ను ఇప్పటికీ ఆ సాంబార్ రుచిలో కాపాడుతూ ఆహారప్రియుల అభినందనలు అందుకుంటున్నానంటాడు 30 ఏళ్ల యంగ్ టర్క్ లోకేష్.
అంతేకాదు ఎప్పుడైనా తన ఫ్యామిలీతో రెస్టారెంట్ కు వెళ్లినప్పుడు.. కుటుంబీకులు బలవంతపెట్టినా తాను పెద్దగా దక్షిణాది ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడలేకపోయేవాణ్నని.. కానిప్పుడు రత్నా కేఫ్ లో ఎందరికో ఓ ఆత్మీయ అనుబంధంగా, సెంటిమెంట్ గా మార్చిన తన తాత వారసత్వాన్ని కొనసాగించడానికి అవే దక్షిణాది వంటకాల తయారీకి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాన్నది లోకేష్ మాట.
రత్నా కేఫ్ లో సాంబార్ ఇడ్లీలపై నుంచి వరద పారుతుంది. జుర్రినోళ్లకు జుర్రినంత! కావల్సినంత సాంబార్ ఆహా రుచి అని ఆహారప్రియులు జుర్రుకుని తాగేలా.. క్వాలిటీకి క్వాలిటీ.. క్వాంటిటీకి క్వాంటిటీ.. ఇలా రెండూ ఇక్కడ అందుతుండటం కూడా ఇక్కడి ప్రత్యేకతకు కారణమన్నది గత యాభై ఏళ్లుగా రత్నా కేఫ్ లోనే టిఫిన్ చేసేవాళ్లు చెప్పే మాట. అయితే ఒక హోటల్ కు వెళ్లినప్పుడు ఈరోజున్న రుచి రేపుండకపోవచ్చు. పబ్లిసిటీ పెరిగి.. హోటలూ పెరిగి పెద్దైన కొద్దీ ఆ క్వాలిటీ కూడా దొరక్కపోవచ్చు. అప్పుడు అవి కేవలం బ్రాండ్ నేమ్ తో మాత్రమే కొంత కాలం నడిచినా… అవెంతో కాలం ఉంటాయన్న గ్యారంటీ కూడా ఉండదు. కానీ రత్నా కేఫ్ కథ భిన్నమైంది. సాంబార్ నిన్న ఏ రుచైతే ఉందో.. ఇవాళా అదే రుచి ఉంటుంది. ఇలా 1948లో హోటల్ స్థాపించిన్నాట్నుంచీ… ఇప్పటివరకూ అదే రుచి. అందుకే అంత క్రేజీ.
రత్నా కేఫ్ లో నిత్యం తినే ఓ వృద్ధ మహిళ ఓసారి ఆసుపత్రి పాలైతే… పదిరోజుల పాటు ఆమె రత్నా కేఫ్ టిఫిన్ కు దూరంగా ఉండలేకపోయిందట. ఆమె డిశ్ఛార్జ్ కాగానే.. ఆమె మొట్టమొదటి స్టాప్.. రత్నా కేఫ్ ఐందంటేనే ఈ హోటల్ వినియోగదారులతో ఎలాంటి ఎమోషనల్ బాండే ఏర్పర్చుకుందో అర్థం చేసుకోవచ్చు.
ప్రతీరోజు సాంబార్ తయారుకాగానే ముందుగా రుచి చూశాకే.. దాన్ని కస్టమర్స్ కి వడ్డిస్తారు. అందులో ఏ ఇన్ గ్రేడియంట్స్ తగ్గినా… ఎప్పుడో ఒకసారి కొద్దిగా టేస్ట్ లో తేడా అనిపించినా… కస్టమర్స్ ఇచ్చే ఫీడ్ బ్యాక్ తో అలాంటి పొరపాట్లు మళ్లీ జరక్కుండా చూసుకుంటుంది ఈ హోటల్ యాజమాన్యం. 1948 నుంచి ఇప్పటికి మారిందేంటంటే.. నాడు కట్టెల పొయ్యి మీద చేసిన వంటకాల నుంచి నేటి గ్యాస్ సిలిండర్లు, ప్రెషర్ కుక్కర్స్ వంటి ఆవిరి యంత్రాల సాయంతో చేయడమే. నాణ్యతా ప్రమాణాలు రుచి, క్వాంటిటీ వరకే పరిమితం కాలేదిక్కడ. పరిశుభ్రతకూ ఎనలేని ప్రాధాన్యత ఉండటమూ కస్టమర్స్ ని ఆకట్టుకునేందుకు మరో ప్రధాన కారణం.
రోజూ 2 వేల లీటర్ల సాంబార్ ఇక్కడ తయారవుతుండగా.. ప్లేట్ ఇడ్లీకి ప్రస్తుత ధర 60 రూపాయలుంది. నల్గురికి కలిసి తీసుకెళ్లే భోజనం పార్సిల్ 500 రూపాయలకు లభిస్తుంది. 1948లో కేవలం పది ఐటమ్స్ మాత్రమే మెనూలో కనిపించగా… ఇప్పుడు వాటి సంఖ్య పెరిగింది. ఇడ్లీ, సాంబార్ తర్వాత వడ, ఫిల్టర్ కాఫీ, బాదంపాలు, బాసుంది, గులాబ్ జామ్, రసమలై వంటివెన్నో ఈ హోటల్ లో ప్రత్యేక వంటకాలుగా గుర్తింపు పొందాయి.
చెన్నైలో ప్రస్తుతం నాల్గు ఔట్ లెట్లతో నడుస్తున్న రత్నా కేఫ్ ను ఇంకా దేశవ్యాప్తంగా విస్తరించాలనున్నా… విస్తరించే క్రమంలో ఏ మాత్రం క్వాలిటీ కోల్పోయినా, రుచి లేకపోయినా.. ఇంతకాలం నుంచి వచ్చిన బ్రాండ్ నేమ్ దెబ్బతినే అవకాశముందన్న యోచనలో రత్నా కేఫ్ యాజమాన్యముంది. మొత్తంగా సాంబార్ రుచితో.. అంత పెద్ద మెట్రోపాలిటన్ నగరమైన చెన్నైలో ఒక బ్రాండ్ ఇమేజ్ ను సృష్టించుకుని… జనం సాసర్ లో టీ, కాఫీలాగా సాంబార్ ను జుర్రుకుని తాగేలా చేసి.. దాన్నింకా అలాగే కొనసాగిస్తున్న రత్నా కేఫ్ నిర్వహణ నిజంగా ఓ సక్సెస్ స్టోరీనే….. (రమణ కొంటికర్ల)
Share this Article