.
శివుడి కోసం పార్వతి తీవ్రమైన తపస్సు చేస్తుంది. ఆయనేమో ఒక పట్టాన కరుణించడు. కొంతకాలం ఒంటికాలి మీద నిలుచుని తపస్సు చేస్తుంది. కొంతకాలం ఆకో, పండో తింటూ తపస్సు చేస్తుంది. చివరికి ఆకులు కూడా తినకుండా చుట్టూ అగ్నులను పేర్చుకుని వాటి మధ్య మాడిపోతూ తపస్సు చేస్తుంది.
అప్పుడు “అపర్ణ” అయ్యింది. పర్ణ అంటే ఆకు. అపర్ణ అంటే ఆకు కూడా తినకపోవడం. అప్పుడు శివుడు కరుణించి కటాక్షించాడు. అందుకే శంకరాచార్యులు శివానందలహరిలో-
Ads
“కలాభ్యాం చూడాలంకృత-శశి కలాభ్యాం నిజ తపః-
ఫలాభ్యాం భక్తేశు ప్రకటిత-ఫలాభ్యాం భవతు మే;
శివాభ్యాం-అస్తోక-త్రిభువన శివాభ్యాం హృది పునర్-
భవాభ్యాం ఆనంద స్ఫుర-దనుభవాభ్యాం నతిరియమ్”
ఒకరి తపస్సుకు ఒకరు ఫలంగా దొరికినవారు అంటూ శివపార్వతుల పరస్పర నిజ తపః ఫలాన్ని అనన్యసామాన్యంగా స్తోత్రం చేశాడు. అంటే పార్వతి తపః ఫలంగా శివుడు దొరికాడు. శివుడి తపః ఫలంగా పార్వతి దొరికింది. ఈ శ్లోకంలో భక్తి, భావం, కవిత్వం, భాష అందచందాలు తోడుకున్నవారికి తోడుకున్నంత.
ఆదిశంకరుడికే భిక్షగా అన్నం పెట్టగల ఆ తల్లి అన్నపూర్ణ లోకాలను కరుణించడానికి మొదట అన్నం మానేసి… తరువాత ఆకులు కూడా మానేసి తపస్సు చేసింది. శివుడి మనస్సు గెలిచింది. “ప్రపేదిరే ప్రాక్తనజన్మవిద్యాః” అని కుమారసంభవంలో పార్వతి గురించి కవికుల గురువు కాళిదాసు గొప్ప మాటంటాడు. ఈ జన్మలో నేర్చుకున్న విద్యలే కాకుండా గత జన్మల్లో చదువుకున్న చదువులు, నేర్చుకున్న విద్యలు కూడా ఆమెలో ఉన్నాయి లేదా ఆమెను ఆశ్రయించి ఉన్నాయి- అని.
కాబట్టి అపర్ణకు ఆకులు తింటూ, తినకుండా ఎలా బతకాలో ఇంకొకరు చెప్పాల్సిన పనిలేదు. మనకలా కాదు కదా! వాట్సాప్ యూనివర్సిటీ చెబితే చాలు… ఓనమాలు కూడా రాయడం రాని యూట్యూబ్ డాక్టర్లు చెబితే చాలు… అల్లుకుపోతాం. చెలరేగిపోతాం.
… అలా ఇలా జామ ఆకులు తింటే అలా చిటికెలో సకల రోగాలూ మటుమాయమవుతాయని వాట్సాప్ విశ్వవిద్యాలయం చెప్పడమే తరువాయి. ఇప్పుడు దేశంలో జామ ఆకులకు కరువొచ్చింది. చివరకు అమెజాన్ ఆన్ లైన్లో కూడా జామ ఆకులు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.
ఆరోగ్యస్పృహ ఉన్నవారు ఎక్కడ జామ ఆకులు కనపడినా ఆగి… కొని… ఇష్టమున్నా లేకున్నా… రుచిగా లేకున్నా తింటున్నారు. (సాధారణంగా పశువులు గడ్డి తింటాయి. నానా గడ్డి కరిచే రోజుల్లో… పశువులు స్విగ్గీలో పిజ్జాలు తెప్పించుకుని తింటూ ఉంటే… మనుషులు జామ ఆకులు తెప్పించుకుని తినడాన్ని సర్వజీవ ఆహార సమభావంగానే చూడాలి!)
పరిమిత మోతాదులో వైద్యుల సలహా, పర్యవేక్షణలో జామ ఆకులను తింటే మధుమేహం, కొవ్వు తగ్గుతాయని డాక్టర్లు అంటున్నారు. వేలంవెర్రిగా తింటే కొత్త రోగాలు రావడం ఖాయమని అదే డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
# 50 జామ ఆకులు ఆన్ లైన్లో 200 రూపాయలు.
# వంద గ్రాముల ఎండుటాకులు వంద రూపాయలు.
# పావు కిలో ఎండు జామ ఆకుల పొడి 250 రూపాయలు.
# ఎక్కువ ఆర్డర్ చేస్తే 50 శాతం దాకా డిస్కౌంట్లు కూడా ఉన్నాయి.
ఇవన్నీ ఆన్ లైన్లో ప్రస్తుతం కనిపిస్తున్నవి.
నాగరికత ఎంత అధునాతనంగా ముందుకు వెళుతున్నా… ఎక్కడ మొదలుపెట్టామో అక్కడికే వెళుతూ ఉంటాం. ఇది ఒకరకంగా మన మూలాలను వెతుక్కోవడం.
“ఆకులు, అలములు తిని బతికే రోజులు” అని సరైన ఆహారం దొరకని దుర్భర పరిస్థితులకు తెలుగులో వాడుక మాట. ఇప్పుడు అన్నీ దొరుకుతున్నా మనం ఆకులు, అలములు వెతుక్కుంటూ… పచ్చి ఆకులు తింటూ… ఎండు ఆకుల పొడిని చప్పరిస్తూ… సపర్ణులమో, అపర్ణులమో అవుతున్నాం.
ఏమి!
అపర్ణ ఒక్కతేనా తపస్సు చేసేది?
ఆమె ఆకులు తినకుండా తపస్సు చేసింది. మేము జామ ఆకులు తింటూ ఆరోగ్యతపస్సు చేస్తున్నాం. మాక్కూడా శివుడు ప్రత్యక్షమై ఆరోగ్యఫలం ఇవ్వాల్సిందే!
పక్షులు చక్కగా జామ పళ్ళు కొరికి తింటుంటే… మనుషులు చిక్కగా జామ ఆకులు నములుతున్నారు. “చిలక్కొరికిన జామపండు” సామెతకు ఇప్పుడు “మనిషి నమిలిన జామ ఆకు” తోడయ్యింది. జామ ఆకు జావ, జామ బెరడు చిక్కీ, జామ వేళ్ళ సూపు, జామ ఆకు బిస్కట్లు, జామాకు కూరలు, జామ ఆకు కాఫీ, జామ ఆకు టీ లాంటి బృహజ్జామపత్రాహారాలు బహుశా క్యూలో ఉండే ఉంటాయి!
డిస్ క్లైమర్:-
మీడియాలో వచ్చిన, వస్తున్న కథనాల ఆధారంగా అల్లిన కథనమిది. జామ ఆకుల్లో ఆరోగ్యానికి ఈ రాత హామీ కాదు; తిని… అనర్థం జరిగితే బాధ్యత తీసుకోదు!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article