పూణెలో ఓ కోళ్ల రైతు… అకస్మాత్తుగా ఓ కష్టమొచ్చి పడింది… తన ఫామ్‌లో ఉన్న కోళ్లు గుడ్లు పెట్టడం మానేశాయి… ఇదేందయ్యో, నేనెప్పుడూ చూళ్లే… జోరున వానలు పడుతున్నా, ఎండలు దంచికొడుతున్నా, చలి వణికించేస్తున్నా కోళ్లు గుడ్లయితే పెడతాయి కదా… కాకపోతే కొన్ని నాగా పెడతాయి, అంతే తప్ప గుడ్లు పెట్టడమే మానేస్తే ఎలా..? అదీ అన్నీ కూడబలుక్కున్నట్టు ఒకేసారి గుడ్లు పెట్టకపోతే ఎలా..? పైగా కరోనా కాలం… ఇమ్యూనిటీ పేరుతో చాలామంది ఎగబడి తింటున్నారు ఈమధ్య… గిరాకీ పెరిగింది, కాస్త రేటూ కలిసొస్తోంది… తలపట్టుకున్నాడు… ఈ గుడ్డు బంద్ ఆందోళన ఏమిటో అర్థం కాలేదు… రెగ్యులర్‌గా కోళ్ల ఫామ్‌కు వచ్చే వెటర్నరీ డాక్టర్‌ను అడిగాడు, కానీ తనూ జుత్తు పీక్కున్నాడు తప్ప రీజన్ తెలియడం లేదు…
ఆలోచించగా, చించగా… ఓ చిన్న పాయింట్ తట్టింది… ఎంతైనా తనదీ గుడ్లు తినే బుర్రే కదా… ఈమధ్య కాలంలో చేసిన మార్పు ఒక్కటే… అంతకుముందు దాణా కొనుక్కొచ్చే కంపెనీని మార్చి, పక్కనే ఉన్న అహ్మద్‌నగర్ జిల్లాలోని మరో దాణా కంపెనీ నుంచి కొంటున్నాడు… అంటే, ఆ దాణాలోనే ఏదో తేడా ఉండి ఉండాలి… అంతకుమించి వేరే రీజనే లేదు… ఆ కంపెనీ వాడిని అడిగితే ఫోఫోవోయ్, అన్ని కంపెనీలు వాడే ముడి సరుకులే మేమూ వాడుతున్నాం, మేమేమైనా ఆకాశం నుంచి దాణాను దిగుమతి చేసుకుని అమ్ముతున్నామా అని కొట్టిపారేశాడు… సదరు కోళ్ల రైతు గుడ్లు తేలేసే రకం కాదు కదా… లోని కల్బార్ అని దగ్గరలోని పోలీస్ స్టేషన్ వెళ్లాడు… ఆ కంపెనీ మీద కంప్లయింట్ ఫైల్ చేసేశాడు…
Ads
‘‘నా కోళ్లు గుడ్లు పెట్టడం లేదు, నాకు న్యాయం చేయండి… తగు చర్యలు తీసుకొండి’’ ఇదీ ఫిర్యాదు… ఇది చదివి పోలీసులు తలలు పట్టుకున్నారు… ఇదేం కేసురా బాబోయ్ అనుకున్నారు… సదరు రైతును కూర్చోబెట్టి, చాయ్ తాపించి, అసలు కథేమిటో చెప్పరా బాబూ అనడిగారు… తన సందేహం ఏమిటో చెప్పి, శాస్త్రీయంగా అదే కారణమని నేను చెప్పలేను కాబట్టి ఫిర్యాదులో ఆ కంపెనీ పేరు రాయలేదు అని చెప్పాడు… అదేసమయంలో మరికొందరు రైతులూ వచ్చారు అక్కడికి… వాళ్లు కూడా ఈ రైతు పరిసరాల్లో కోళ్లు పెంచే బాపతే… సేమ్, ఫిర్యాదు… వాళ్లకూ కలల్లోనూ గుడ్లు కనిపిస్తున్నయ్… అదే సమస్యను ఫేస్ చేస్తున్నారు…
సదరు ఠాణా సీనియర్ పోలీస్ ఆఫీసర్ రాజేంద్ర మోకాషి ఆ దాణా కంపెనీ ఓనర్‌ను పిలిచాడు… నా తప్పేముంది..? నేనేమైనా విషం సప్లయ్ చేస్తున్నానా అని ఉల్టా మాట్లాడాడు ఆ దాణా కంపెనీ ఓనర్… ఆ బ్లాక్ లెవల్ పశుసంవర్ధక శాఖ అధికారిని పిలిచి రిపోర్ట్ అడిగాడు పోలీసు అధికారి… కోడి చనిపోతే పోస్ట్ మార్టం రిపోర్టులో ఏమైనా కారణాలు రాయొచ్చు గానీ, గుడ్లు పెట్టకపోతే కారణాలు ఏం రాయాలి, నేను రాయనుపో అంటాడు ఆ అధికారి… అకస్మాత్తుగా దాణా మారితే, అది కోళ్లకు నచ్చకపోతే గుడ్లు పెట్టకపోవడం సహజమే, కానీ అధికారికంగా ఆ రిపోర్టు ఇవ్వలేను అన్నాడు… ఇక దిక్కుతోచని ఆ పోలీసాయన ‘‘నేను నీమీద కేసు పెడతాను, వెళ్లి కోర్టులో నిరూపించుకో, ఒకసారి కోర్టుకు వెళ్లావంటే చాలు, ఇప్పటిదాకా నీ దాణా కొంటున్న ఒక్క రైతు కూడా ఇక నీ దాణా కొనరు, ఆలోచించుకో’’ అని పోలీస్ మార్క్ ఝలక్ ఇచ్చాడు.. అలాగే కోళ్ల రైతులను పిలిచి, దాణా కోళ్లకు పడకపోతే మార్చేయండి, దీంట్లో ఇష్యూ ఏముంది అన్నాడు… మార్చేశాం, మళ్లీ గుడ్లు పెడుతున్నాయి, కానీ ఇన్నాళ్ల గుడ్ల నష్టం ఎవడిస్తాడు అంటారు ఆ కోళ్ల రైతులు… చివరకు ఆ నాలుగైదు ఫామ్స్ కోళ్ల రైతులకు ఆ గుడ్ల నష్టానికి పరిహారం ఇప్పించి, హమ్మయ్య అని చేతులు దులిపేసుకున్నారు పోలీసులు… అబ్బే, ఇందులో పెద్ద వార్తేముందోయ్ అంటారా..? లేకేం… కోళ్లకైనా సరే… డిక్కీ కాలినా సరే, నచ్చిన దాణాను మాత్రమే తింటయ్, గుడ్లు పెడతయ్… ఏది పెడితే అది తినవు…!! పైగా ఫుల్లు గిరాకీ ఉన్న సీజన్… గుడ్లు పెట్టడం మానేస్తే, ఆందోళనకు దిగితే ‘నచ్చిన దాణా’ రాకతప్పదు… ‘‘సప్లయ్స్’’ మానేస్తేనే సమస్యలు తీరుతాయ్… అదీ కథ…
Share this Article