ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వైరల్ వార్త ఇది… ఏదీ అంటే… హైదరాబాద్ నగర శివారు, మహేశ్వరం నియోజకవర్గంలోని, బడంగపేట మున్సిపల్ ఆఫీసులో ఏసీబీ దాడులు చేసింది, 30 వేలు తీసుకుంటూ టీపీఓ అశోక్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు… ఎవరీ అశోక్..? అప్పట్లో తెలుగు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన బుల్లెట్ బండి పాట తెలుసు కదా… అందులో పెళ్లికొడుకు… ప్రస్తుతం ఫేస్ బుక్, వాట్సపుల్లో ఈ ఏసీబీ దాడి వార్త, వీడియో, ఫోటోలు ఫుల్ వైరల్… పెద్ద పెద్ద చానెళ్లలో వార్తలు వస్తున్నయ్…
ఇదంతా ఒక కోణం… జనానికి బాగా గుర్తుంది… ఆ బుల్లెట్ బండి పాట సోషల్ మీడియాలో బాగా వైరలయ్యాక… ప్రధాన చానెళ్లు కూడా ఆ జంటను పిలిచి ఇంటర్వ్యూలు చేశాయి… పత్రికల్లో కథనాలు వచ్చాయి… కొన్నిరోజులు వాళ్లు హఠాత్తుగా సెలబ్రిటీ హోదా అనుభవించారు… అఫ్‌కోర్స్, ఆ పాటకు ఆ పెళ్లి కూతురు డాన్స్ కనెక్టయ్యేలా ఉంది… అందరూ ఆస్వాదించారు… ఆ పాటలో కూడా లైఫ్ ఉంది, ఓ పెళ్లికూతురి మనస్సుంది… అది అందరికీ హత్తుకుంది… ఒక యూబ్యూబ్ చానెల్‌లో ఈ వీడియోకు రెండు కోట్ల వ్యూస్ వచ్చినట్టు గుర్తు… అమెరికాలో ఉండే ఇద్దరు ఆడపిల్లలు (నైనిక, తాన్యా కావచ్చు బహుశా పేర్లు) ఈ పాటను వీడియో చేస్తే 4 కోట్లపైచిలుకు వ్యూస్…
Ads
ఇప్పుడు అసలు విషయానికి వద్దాం… మన మీడియా ధోరణి తెలుసు కదా… ఆ పెళ్లికూతురు చురుకుదనం, డాన్స్ బాగా ఆకట్టుకున్నాయి తప్ప… సోషల్ మీడియాలో కనిపించడంతో అందరూ కనెక్టయ్యారు తప్ప… అది అప్పటికే అదే యూట్యూబులో పాతబడిపోయిన పాట… తెలంగాణ రచయిత లక్ష్మణ్ రాసి, మోహన భోగరాజు పాడిన పాట ఇది…
ఆ ఒరిజినల్ పాటను మొదట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు గానీ… ఈ పెళ్లిలో పెళ్లికూతురు ఆ పాటకు వేసిన స్టెప్పులు ఫేమస్ అయ్యాక ఇక ఈ వీడియోలే పాపులరయ్యాయి… 300 మిలియన్ వ్యూస్ సాధించిన పాట అంటూ థంబ్ నెయిల్స్ వేసిన వీడియోలు కూడా చూసినట్టు గుర్తు… అంత ఫేమస్ అయిపోయింది వీళ్ల పాట… ఆ పెళ్లికూతురుకు ఎవరో సినిమాలో చాన్స్ కూడా ఆఫర్ చేసినట్టు వార్తలొచ్చాయి… అన్నింటికీ మించి ఓ హాస్పిటల్‌లో ఈ పాట పాడుతూ, ఓ పక్షవాత రోగితో కాళ్లూచేతులు కదిలింపజేసిన ఓ నర్స్ వీడియో ఇంకా ఫేమస్ అయిపోయింది… ఇదంతా ఒక కథ…
అసలు విషయం చెప్పుకుందాం… ఎస్, ఆ పాటలో ఆ పెళ్లికూతురు డాన్స్ బాగుంది… మంచిగుంది… కానీ ఆ పాట వాళ్లది కాదు, ఆ పాటలో సదరు పెళ్లికొడుకు ఓ స్టెప్పయినా బాగా వేసింది లేదు… ఆమె డాన్స్ చేస్తుంటే చూస్తూ నిలబడటం తప్ప…! సరే, అందులో తప్పేముందిలేగానీ… ఏదో దురదృష్టం కొద్దీ ఏసీబీకి దొరికిపోయాడు గానీ… తను చేసిన తప్పేముంది..? మున్సిపల్ ఆఫీసు అంటేనే లంచాలు కామన్… లంచాలు తీసుకోకపోతేనే అది తప్పు… సంస్కృతీరాహిత్యం అవుతుంది… ‘రియల్ సర్వీస్ రూల్స్ ‘ ఒప్పుకోవు… దానికి కట్టుబడే ఉన్నాడు కదా… మరి ఒక్కసారిగా తెలుగు సమాజం తనను చూసి పకపకా నవ్వుతుందేం..? టీవీల్లో గంటల కొద్దీ ఇంత హంగామా దేనికి..?
అసలు తప్పు సమాజానిదే కాదా…? ఎన్నిచోట్ల ఎందరు దొరకడం లేదు ఏసీబీకి..? కోట్లకుకోట్లు కుమ్మేస్తున్న భారీ తిమింగలాల నడుమ ఈ టీపీఓలు ఉత్త పిత్తపరిగెలు కాదా… దయచేసి నవ్వడం ఇక ఆపేయండి… అప్పటి పాటతో పోల్చుకుంటూ ఇప్పుడు వెక్కిరింపుగా నవ్వకండి… అదేమీ నీతిబోధ పాట కాదు, తనెప్పుడూ ఆ నీతులు చెప్పలేదు…! నవ్వుతున్న జనం ఏదో డుగ్గు డుగ్గు డుగ్గుమని శుద్ధ పూసలైనట్టు..!!
Share this Article