సుధామూర్తి… ఇన్ఫోసిస్ కోఫౌండర్ ఎన్ఆర్‌నారాయణమూర్తి భార్య… నిజానికి ఆయన భార్యగా కాదు, చాలామందికి ఆమె రచయితగా తెలుసు, మోటివేషనల్ స్పీకర్‌గా, టీచర్‌గా, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్‌గా తెలుసు… కొందరైతే సుధామూర్తి భర్తగా నారాయణమూర్తిని గుర్తిస్తారు… అంతేకదా, ఆయనకు ఎన్ని వందలు, వేల కోట్లుంటే మనకేం..? ఆమెకు ఆమధ్య పద్మశ్రీ కూడా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం…
ఎవరో ఏదో అనుకుంటారని సెక్యులర్ ముద్రల కోసం తాపత్రయపడదు ఆమె… సమాజానికి ఏది మంచిదని తను భావిస్తుందో అదే చెబుతుంది… కృత్రిమత్వాన్ని ఇష్టపడదు… 35 వేల కోట్ల ఆస్తుల కుటుంబమైనా సరే, ఓ మధ్యతరగతి మహిళలా, నిరాడంబరంగానే ఉంటుంది… విషయానికివస్తే మొన్న మంగళవారం కేరళకు వచ్చింది… ఎందుకో తెలుసా..? అట్టుకల్ భగవతీ దేవి ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చింది…
ఇలా రావడానికి ఓ నేపథ్యం ఉంది… 2019లో కేరళను వరదలు ముంచెత్తినప్పుడు తమ ఫౌండేషన్ తరపున చేపట్టిన సహాయచర్యల పర్యవేక్షణకు వచ్చిందామె… ముఖ్యమంత్రిని కూడా కలిసింది… అప్పుడే ఆమె ఈ పొంగల ఉత్సవం గురించి విన్నది… ఒక్కసారైనా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అనుకుందామె… కానీ వరద సహాయ చర్యల బిజీలో అప్పుడు పాల్గొనలేదు… తరువాత కోవిడ్ మహమ్మారి రావడంతో వీలు కాలేదు… ఇప్పుడు తీరికగా వచ్చింది… ఆనందంగా ఆ పండుగలో పాల్గొంది…
Ads
అప్పుడే చెప్పిపెట్టింది తన పీఎస్ లీనా గోపకుమార్‌కు… ఎప్పుడు పరిస్థితులు చక్కబడితే, అప్పుడు ఏర్పాట్లు చేసి, తనకు చెప్పాలని..! ఆమెది కేరళే… చకచకా ఏర్పాట్లు చేసి, తన బాస్‌ను తీసుకెళ్లింది… అంతర్జాతీయ మహిళా ఉత్సవానికి ముందురోజు ఇందులో పాల్గొంది ఆమె… వేల మంది ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు, ఆమె పాల్గొనడంలో విశేషమేముంది అంటారా..? ఓ సాధారణ మహిళలా ఆ పొగలు, ఆ కట్టెల పొయ్యిల నడుమ స్వయంగా పొంగల వండింది ఆమె… చిన్నప్పుడు ఇలాంటి వాతావరణంలోనే పెరిగాను, పెద్ద కష్టమేం అనిపించలేదు అన్నదామె… నడమంత్రపు సిరితో మిడిసిపడే చాలామంది ఈ ఉత్సవాలకు దూరంగా ఉంటుంటే, ఒక కేరళేతర మహిళ ఆ ఉత్సవాన్ని ఓన్ చేసుకోవడం విశేషమే కదా…
ఒక రచయిత్రిగా అట్టుకల్ పొంగల (Attukal Pongala) గురించి రాస్తానని, సందర్భం వచ్చినప్పుడు దాని గురించి తప్పగా ప్రజల్లోకి తీసుకెళ్తానని చెబుతున్నాదామె… ఎందుకంతగా నచ్చిందీ అనడిగితే… ఈ ఉత్సవం కుల భేదాలు, అంతస్థుల తేడాల్ని పట్టించుకోకుండా, అందరూ కలిసి జరుపుకునే సమానత్వ పండుగ అనిపిస్తోందని బదులిచ్చింది… స్వయంగా వండటం, అమ్మవారికి నైవేద్యం పెట్టడం మీద మాట్లాడుతూ… భిన్నమైన అనుభూతి, ఇది నారీశక్తికి ప్రతిబింబం, బాగుంది కదా అంటోంది…
ఆమె ఈ ఉత్సవంలో కట్టెల పొయ్యి మీద ఎర్ర బియ్యం, బెల్లం, నెయ్యి, డ్రైఫ్రూట్స్, కొబ్బరి కలిపి కేరళ స్టయిల్‌లో వండింది… ప్రస్తుతం భర్త ఈ దేశంలో లేడు… అందుకని ఈ నైవేద్యాన్ని, ప్రసాదాన్ని కొడుకు రోహన్, కోడలు అపర్ణల కోసం తీసుకుపోతున్నానంది ఆనందంగా…!!
Share this Article