సుడిగాలి సుధీర్ ఇక బుల్లితెరకు బైబై చెప్పినట్టే…. ఇదీ కొన్ని తాజా వార్తల సారాంశం… నిజమేనా..? బైబై చెబితే నష్టమేంటి..? ఈ ప్రశ్నలకు జవాబు కష్టం… సుధీర్ స్వతహాగా కమెడియన్… మంచి పర్‌ఫార్మర్… కామెడీతోపాటు డాన్స్ తనకు బాగా అచ్చొచ్చే అదనపు క్వాలిటీ… అన్నింటికన్నా హైపర్ ఆది వంటి కేరక్టర్లు సైతం తన మీద సెటైర్లు వ్యాఖ్యలు విసురుతున్నా సరే, లైట్ తీసుకుంటాడు తను… పంచులు వేసేవాడి పంచెలే ఊడిపోతాయి, నాదేం పోయింది అని మనస్సులో నవ్వుకుంటాడేమో…
తన టార్గెట్ సినిమా… తనకు ఎవరితో పడలేదో, వెంట ఉన్నవారే కుట్రలు చేశారో గానీ సుధీర్ ఈటీవీలో మొదట పండుగ స్పెషల్ షోల నుంచి, ఢీ డాన్స్ షో నుంచి తప్పుకున్నాడు… ఏమో, తప్పించబడ్డాడేమో… శ్రీదేవి డ్రామా కంపెనీ హోస్టింగు నుంచీ తప్పించారు… ఇక ఇక్కడ ఉండటం వేస్ట్ అనుకుని నిశ్శబ్దంగా జబర్దస్త్ కూడా మానుకుని బయటికి వచ్చేశాడు… సాఫ్ట్‌వేర్ సుధీర్, త్రీమంకీస్ గట్రా సినిమాలు తన ఆశలపై నీళ్లు జల్లాయి…
దాంతో తప్పనిసరిగా సినిమాల్నే నమ్ముకుంటే లాభం లేదనే భావనతో మాటీవీలో ఏదో ప్రోగ్రాం చేశాడు… తన వెంట నడిచిన గెటప్ సీను, ఆటో రాంప్రసాద్‌లను కూడా వాళ్ల ఇష్టానికి వదిలేశాడు… తనకు మంచి పెయిర్‌గా పరిగణించబడిన రష్మిని కూడా వదిలిపెట్టాడు… (టీవీ షోలలో)… ఆహా ఓటీటీలో అనిల్ రావిపూడితో కలిసి చేసిన కామెడీ స్టాక్ ఎక్స్‌చేంజ్ క్లిక్కయింది… ఐనా సరే, ఇక కొత్తగా ఏ టీవీ షో అంగీకరించలేదు… పూర్తిగా గాలోడు సినిమాపై కాన్సంట్రేట్ చేశాడు…
Ads
నిజానికి అది సబ్‌స్టాండర్డ్ సినిమా… అందులో చెప్పుకోవడానికి ఏమీలేదు… కానీ కోట్ల వసూళ్లు కురిశాయి,.. కారణం కేవలం సుధీర్ మాత్రమే… సో, సుడి తిరుగుతోంది… కాలింగ్ సహస్ర అనే సినిమా ఏదో ఆల్‌రెడీ చేతిలో ఉంది… అది పూర్తయ్యే దశలో ఉంది కదా, ఇక మరో ప్రాజెక్టు కూడా సైన్ చేసినట్టు చెబుతున్నాడు… సో, మరికొన్నాళ్లు సుధీర్ టీవీ షోలకు టైమ్ కేటాయించే స్థితి లేదు… దాదాపు కోటిన్నర దాకా రెమ్యునరేషన్ డిమాండ్ చేసే స్థితికి వచ్చిన సుధీర్‌కు నిజంగా ఏదైనా ఓ మంచి పాత్ర పడితే ఇరగదీస్తాడు…
ఇప్పుడు టాలీవుడ్‌లో కాస్త పేరు తెచ్చుకున్నా సరే, కోట్లు కురుస్తున్నాయి… సుహాస్ వంటి యూట్యూబ్ కేరక్టర్లు సైతం అకస్మాత్తుగా క్లిక్కయిపోయి, ఇప్పుడు రెండు కోట్ల దాకా డిమాండ్ చేసే స్థితికి చేరుకున్నారు… సో, ఇదీ టైమ్… మంచో చెడో ఇక ఆ సినిమా కాలువలోనే పొర్లాడాలి కొన్నాళ్లు… టీవీ, సినిమా రెండు గుర్రాల మీద స్వారీ కొన్నాళ్లు కుదరకపోవచ్చు… కానీ పూర్తిగా దూరం అవుతాడని చెప్పలేం… ఎందుకంటే..?
టీవీ షోలు నటుల్ని, తారల్ని ఎప్పుడూ జనంలో ఉంచుతాయి… పెద్ద పెద్ద హీరోలే టీవీ షోలను పట్టుకుంటున్నారు… పైగా ఇవి పాడి బర్రెలాగా ఎంతోకొంత ఆదాయాన్ని స్థిరంగా ఇస్తుంటాయి… ఐనా సినిమాల్లో ప్రస్థానం ఆగిపోతే, కళ తప్పితే మళ్లీ బ్యాక్ టు టీవీ స్టూడియోసే కదా…!! బాలయ్య అన్‌స్టాపబుల్ ఎంత హిట్టయిందో చూశాం కదా, బిజీ కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా అలా మొదలైంది అని ఓ షో స్టార్ట్ చేస్తున్నట్టున్నాడు… ఆలీ నిర్వహించే ఆలీతో సరదాగా ఆగిపోయింది కదా, దాని బదులుగా అన్నమాట… సో, సుధీర్‌కు మంచి షో ఒకటి దొరికితే మళ్లీ టీవీల్లో కనిపిస్తాడు… తన పునాదే టీవీ కదా…!!
Share this Article