Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చావుకొచ్చిన చదువులు… ఉపద్రవం… ప్రమాదం… ఓ సామాజిక విపత్తు…

August 31, 2024 by M S R

జనాభా పెరుగుదల నిష్పత్తిని దాటేసిన విద్యార్థుల ఆత్మహత్యలు

మనం చదవకూడని, చదివినా ప్రయోజనం లేని ఒక వార్త ఇది. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యాబోధనకు పేరుపొందిన ఫిన్లాండ్ లో తొమ్మిదేళ్ల వయసు దాకా పిల్లలకు ప్రత్యేకంగా ఒక సబ్జెక్ట్ ఏదీ చెప్పరట. ప్రపంచ జ్ఞానానికి సంబంధించిన అన్ని మౌలికమయిన విషయాలను చెబుతారట. వినడానికే మనకు చాలా విచిత్రంగా ఉంది కదా? స్వేచ్ఛగా, హాయిగా, ఇష్టంగా పిల్లలు ఎలా చదువుతారో ఫిన్లాండ్ ఎప్పుడో పసిగట్టింది. విద్యాబోధనలో ప్రయోగాలు చేసింది. పిల్లలకు బరువు తగ్గించింది. పిల్లల ఊహా శక్తికి రెక్కలు తొడిగింది. అద్భుతాలు సాధించింది. మిగతా ప్రపంచం అందుకోలేనంత ఎత్తుకు చేరింది.

మనదగ్గర చదువుల గొడ్ల చావిళ్ళలో మోతుబరి అయ్యవార్లు పశువులను బాదినట్లు విద్యార్థులను కొడుతున్నారని, మార్కుల కోసం దుర్మార్గమయిన హింస పెడుతున్నారని, బాగా మార్కులు రానివారు రాలేదని, వచ్చినవారు జీవంలేని మార్కులు వచ్చాయని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారు బతికి ఉండి ఆవిష్కరించాల్సిన కొంగొత్త విషయాలు దిక్కులేనివి అవుతున్నాయి. వారు బతికి ఉండి తుళ్లుతూ… గడపాల్సిన ఘడియలు దిగులుపడుతున్నాయి. వారు పోయి ఎన్ని జీవితాలు జీవం లేనివైపోతున్నాయో!

Ads

భారతదేశంలో జననాల సంఖ్యను విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య దాటేసిందట. అంటే పుట్టేవారికంటే పోయేవారే ఎక్కువ. మన చదువుల దాహం చావులతో కూడా తీరడం లేదు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు మరీ ఎక్కువగా ఉన్నాయి. బతకడం నేర్పి పైపైకి ఎదిగేలా చేయలేని చదువులు…చావును నేర్పి…పైకి పంపుతున్నాయి.

చదువంటే మార్కులు.
చదువంటే ర్యాంకులు.
చదువంటే దిక్కులు పిక్కటిల్లే ఒకటే అంకె.
చదువంటే ఒకటి నుండి వందలోపు అంకెల పక్కన ఫోటోగా మిగలడం.
చదువంటే ఐ ఐ టి.
చదువంటే నీట్.
చదువంటే ప్రభుత్వాలకు దండగ.
చదువంటే కార్పొరేట్ విద్యా కంపెనీలకు పండగ.
చదువంటే ప్రభుత్వ బడులను ఎండబెట్టి ప్రయివేటు బడులను పెంచి పోషించడం.
చదువంటే తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకోవాల్సిన అగత్యం.
చదువంటే బతుకుతెరువు చూపని గుండె చెరువు.
చదువంటే రాతలో పాస్ చేసి…బతుకులో ఫెయిల్ చేసే గోడకు వేలాడేసుకోవాల్సిన సర్టిఫికేట్.
చదువంటే చచ్చే చావు.

ప్రాపంచిక విషయాలను పిల్లల పాఠ్యపుస్తకాల్లో ఫిన్లాండ్ ఎందుకు పెట్టిందో మనకెందుకు?
ఆడుతూ పాడుతూ చదువుకోవడానికి ఫిన్లాండ్ ఎందుకంత ప్రాధాన్యమిస్తోందో మనకెందుకు?
బతుకులో ఎదురయ్యే ప్రతి సందర్భానికి ఒక విశాల తాత్విక భూమిక ఉందని…బతుకు ఒక నిత్య వసంతంగా ప్రవహించే వర్ణ శోభిత పూల రుతువు అని అడుగడుగునా తెలియజెప్పే ఫిన్లాండ్ పాఠం మనకెందుకు?
జీవితమంటే బతుకు పాదులో ఆశల నీరు పోసి…ప్రతి క్షణాన్ని ఆనందమయంగా జీవించడమనే ఫిన్లాండ్ పాఠశాల విద్య మనకెందుకు?
బెల్ మోగుతోంది…
కర్ర పట్టుకుని చైతన్యరహిత విద్యా వ్యవస్థీకృత పెనుభూతం పిలుస్తోంది.

పదండి..పోదాం…
చదువుల చీకటి గదుల్లోకి.
పదండి…పోదాం…
ర్యాంకుల అంకెలు రంకెలేసే గొడ్ల చావిట్లోకి.
పదండి…పోదాం…
అర్థం కాని శ్మశానాల చదువుల నిఘంటువుల్లోకి!

చెట్టంత ఎదిగి శాఖోపశాఖలుగా విస్తరించాల్సిన పిల్లలు;
వారి మేధస్సు పూలుగా పుష్పించి…కాయలై…ఫలించాల్సిన పిల్లలు;
భవిష్యత్తును నిర్మించాల్సిన పిల్లలు-
మన కళ్లముందే చదువులకు బలి అవుతుంటే…సామూహికంగా బాధపడే ఓపిక, తీరిక కూడా లేని మనం…
సామూహికంగా సిగ్గుపడే నైతిక హక్కును కూడా ఏనాడో కోల్పోయాం.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రియా హరి..! తనే నిర్మాత, తనే హీరోయిన్… ఓ కృత్రిమ ప్రేమకథ…
  • వంశీ, శ్రీలక్ష్మి, ఆంజనేయులు… వాళ్ల అనుభవాలు చెప్పే పాఠమేంటనగా…
  • రవితేజ సినిమా అయితేనేం… సూపర్ ఫ్లాప్, చివరకు టీవీల్లో కూడా…
  • రియల్ కల్‌ప్రిట్ పాకిస్థాన్ కాదు… దాని వెనుక అమెరికా ట్రంపు…
  • ఆ మంత్రి చిల్లర వ్యాఖ్యలపై పార్టీ మౌనం ఏం సంకేతాలు ఇస్తున్నట్టు..!?
  • Decaplets..! ఒకే కాన్పులో పదిమంది… నెవ్వర్.., ఇప్పటికీ జరగలేదు…!!
  • *రెండు జెళ్ల’తో అర్జెంటుగా కుర్రాళ్ల మనసుల్ని పిచ్చెక్కించేసింది…!!
  • ఆ రాజ్ సీతారామ్ ఏమయ్యాడు చివరకు..? కృష్ణ ఎందుకు వదిలేశాడు..?!
  • బిగ్‌బాస్… బిగ్‌లాస్… కళ్లు నెత్తికి ఎక్కడం తప్ప వేరే ఫాయిదా లేదు..!!
  • ట్రంపు చెప్పాడని ఐఫోన్ గుడ్డిగా వినదు… అది పక్కా వ్యాపారం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions