.
. ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం ) .. …. మహిళలకు బాగా నచ్చిన సినిమా సుజాత…. వాళ్ళు బాగా మెచ్చిన సినిమా . మగ పురుషులకు కూడా బాగుంటుంది . సుజాత ద్విపాత్రాభినయం .
కవలలు . సునీత , సుజాత . సునీత భయస్తురాలు . సుజాత డాక్టర్ , ధైర్యవంతురాలు , ధృడనిశ్చయాలను తీసుకోకలిగిన ధీరురాలు . సుజాత చాలా బాగా నటించింది . మూలకధను జి.వి.జి వ్రాసారని టైటిల్సులో వేసారు . ఈ జివిజి ఎవరో తెలియదు . కధను మాత్రం ట్విస్టుల మీద ట్విస్టులతో నడిపిస్తాడు .
Ads
దాసరి నారాయణరావు స్వంత నిర్మాణ సంస్థ తారక ప్రభు బేనరుపై 1980 మే 29 న విడుదలయిన ఈ సుజాత సినిమా కమర్షియల్ గా కూడా విజయాన్ని సాధించింది . స్క్రీన్ ప్లే , డైలాగులను కూడా ఆయనే అందించారు . క్లైమాక్సులో సుజాత పాత్ర డైలాగులు తల్లి చాటు మగ పురుషుల్ని వాయించేస్తాయి . రమేష్ నాయుడు సంగీతం శ్రావ్యంగా ఉంటుంది .
పిల్లలు కలగకపోతే ప్రపంచం బద్దలయిపోతుందనే పాత తరం వాళ్ళ అనవసర నమ్మకం చుట్టూ అల్లబడిన కధ . పిల్లలు కలగకపోవటానికి మగవాడు కూడా కారణం అవుతాడని తెలియని మూర్ఖుల వలన కోడళ్ళు చాలా ఒత్తిడికి గురవుతుంటారు . అలాంటి ఒత్తిడికి గురయిన ఓ ఇల్లాలు కన్న బిడ్డ పుట్టిన వెంటనే చనిపోతే , అక్కడే మరో బెడ్ మీద ఉన్న బిడ్డను దొంగిలించి , జైలుకు వెళుతుంది .
ఆ సమయంలో అక్క స్థానంలోకి చెల్లెలు వెళుతుంది . ఇలా అక్కచెల్లెళ్ళు ఇద్దరూ అటూఇటూ మారుతుంటారు . ఈ మారటం ప్రేక్షకులకు ఆశ్చర్యం వేసినా , అదే సినిమాని నడిపించేది . సినిమా కదా !
మధ్యలో చెల్లెలు సుజాతను ఆవేశపరుడు , భగ్న ప్రేమికుడు మోహన్ బాబు ప్రేమిస్తాడు . తనను అనుమానించిన మోహన్ బాబుకి క్లాస్ పీకి , వదిలేసి , రోగుల సేవలో కొనసాగేందుకు డా. సుజాత నిష్క్రమిస్తుంది .
కధ ముగింపులో దాసరిని బాలచందర్ ఆవహించి ఉంటాడు . సుఖాంతం చేయకుండా ప్రశ్నార్ధకంగా ముగించారు . అయినా బాగానే ఉంటుంది . కన్విన్సింగానే ఉంటుంది .
తల్లి చాటు తనయుడిగా , పెళ్ళాం అంటే ఇష్టంగా నలిగే పాత్రలో మురళీమోహన్ బాగానే నటించారు . ఆవేశపరుడిగా , భగ్నప్రేమికుడిగా మోహన్ బాబు బాగా నటించారు . ఇతర ప్రధాన పాత్రల్లో నిర్మలమ్మ , కాంతారావు , రాజబాబు , రమాప్రభ , ఝాన్సీ , తదితరులు నటించారు .
సుజాత , సునీతల తల్లిగా మహానటి సావిత్రి నటించింది . సావిత్రిని మరచిపోకుండా తన సినిమాల్లో దాసరి ఏదో ఒక పాత్రను ఇస్తూ ఆదరిస్తూ వచ్చారు . గొప్ప మనసున్న వాడు . లేనప్పుడు ఆదుకున్న వారే గొప్పవారు . ఉన్నప్పుడు కప్పలు చాలా చేరుతాయి చుట్టూ .
ఈ సినిమాలో రాజకీయ నాయకుడి పాత్రలో సత్యనారాయణ హాస్పిటల్లో పేషంటుగా రాజకీయాలపై విసిరే చెణుకులు బాగుంటాయి . కాస్త కాస్త ఫేడవుట్ అవుతున్న విజయలలితకు ఓ క్లబ్ డాన్స్ పెట్టారు . రాజశ్రీ వ్రాసిన ఆడది ఒక పాషాణం అంటూ సాగే పాట విజయలలిత , మోహన్ బాబులపై ఉంటుంది .
దాసరి వ్రాసిన పొద్దులోరి ఇంటికాడ ముద్దులోరి అమ్మాయి పాట అక్క సుజాత , మురళీమోహన్లపై బాగుంటుంది . సి నారాయణరెడ్డి వ్రాసిన ఉంగరం పడిపోయింది ; పోతే పోనీ పాట చెల్లెలు సుజాత , మోహన్ బాబులపై హుషారుగా ఉంటుంది .
దాసరి వ్రాసిందే ఒక చల్లని రాతిరిలో ఒక పున్నమి జాబిలి డ్యూయెట్ చాలా శ్రావ్యంగా ఉంటుంది . సి నారాయణరెడ్డి వ్రాసిందే మరో పాట పట్టపగలు పుట్టింది ఒక నక్షత్రం శ్రావ్యంగా ఉంటుంది . అయ్యప్ప భజన పాట హిట్టయింది . సినిమాలో పాటలన్నీ శ్రావ్యంగా ఉంటాయి .
దాసరి శిష్యుడు దుర్గా నాగేశ్వరరావు గురువు బాటలో బాగా దర్శకత్వం వహించారు . దర్శకుడిగా బహుశా రెండవ సినిమా అనుకుంటా .
సినిమా , పాటల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి . మా తరం మహిళలే కాదు ; ఈతరం మహిళలు కూడా చూసి ఉండకపోతే తప్పక చూడండి . చక్కని సెంటిమెంటల్ , ఫేమిలీ ఓరియెంటెడ్ , మ్యూజికల్ , సంస్కారవంతమైన శుభ్రమైన సినిమా . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు
Share this Article