ఇది మరొక రకం వివాదం… యాంకర్ సుమ ఇరుక్కుంది ఈ వివాదంలో… తెలిసి గానీ, తెలియక గానీ… విషయం ఏమిటంటే..? ఆమె రాకీ అవెన్యూస్ తరఫున యాడ్స్ చేసింది… అది ఇన్ఫ్రా కంపెనీ.. 26 లక్షలకే ట్రిపుల్ బెడ్రూమ్ అనే ప్రచారాన్ని నమ్మి, సుమ చెబుతుంది కదాని నమ్మి, డబ్బులు పెట్టి ఇరుక్కుపోయాం, మోసపోయాం, సుమ స్పందించాలి, ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి అని బాధితుల పేరిట సోషల్ మీడియా పోస్టులు కనిపిస్తున్నాయి…
సరే, ఇలాంటి మోసాల్లో ప్రభుత్వం చేయగలిగేది ఏమీ ఉండదు పెద్దగా… పైగా తను ప్రచారకర్తను మాత్రమే గానీ, వాళ్ల పనితీరుతో నాకేం సంబంధం అని సుమ కూడా వాదించొచ్చు… కానీ చాలా బ్రాండ్లకు సుమ ప్రచారకర్తగా ఉంటోంది… మహిళల్లో మంచి పేరుంది, ఓ పద్ధతిగా ఉంటుంది గనుక ఆమెకు కాస్త క్రెడిబులిటీ కూడా ఉంది… అలాగని రాకీ అవెన్యూస్ బాధితులు సైతం సుమ ఏదో తమకు అన్యాయం చేసింది అనడం లేదు…
Ads
నీ పేరు చూసి నమ్మాం అనేది వాళ్ల ప్రధాన ఆక్షేపణ… దీనికి సుమ కనకాల కూడా ఓ క్లారిటీ ఇచ్చింది… ఈ వివాదం పెద్దగా అవుతే తనకు చికాకు అనే భావనతో ఇన్స్టాలో ఓ క్లారిటీ పోస్ట్ చేసింది… సదరు రాకీ అవెన్యూస్తో తన బంధం నిజమేనని అంగీకరించింది కూడా… కానీ ఆ సంస్థతో తన ప్రొఫెషనల్ బాండ్ కేవలం 2016 నుంచి 2018 వరకు మాత్రమేననీ, ఆ అగ్రిమెంట్ పీరియడ్ దాటాక ఇక నాకు వాళ్లతో ఏ సంబంధమూ లేదని చెబుతోంది ఆమె…
ఇప్పటికీ తన పేరిట ఏమైనా యాడ్స్ కనిపిస్తే అవి అనధికారికమే అని అంటోంది… దీనిపై లీగల్ యాక్షన్ ఆలోచిస్తున్నదట… సదరు సంస్థ నుంచి ప్రాపర్టీస్ కొన్నవాళ్లు కూడా తనకు లీగల్ నోటీసులు పంపిస్తున్నారనీ, వాటికి రిప్లయ్స్ ఇస్తున్నాననీ, పైగా ఆ నోటీసుల్ని సదరు సంస్థకు పంపించి ఇష్యూస్ పరిష్కరించాలని సూచించాననీ సుమ పోస్టులో ఉన్న క్లారిటీ…
ఇక్కడే మరో మాట చెప్పింది… ఏ అడ్వర్ట్టైజ్మెంట్ అయినా సరే అఫీషియల్ చానెల్స్ ద్వారా నిజానిజాలు నిర్ధారించుకోవాలంటోంది… నిజం… కానీ తనకు ప్రస్తుతం లీగల్గా ఆ సంస్థతో ఏ బంధమూ లేకపోవచ్చు, అగ్రిమెంట్ పీరియడ్ ముగిసి ఉండవచ్చు, ఐనా యాడ్స్ కనిపిస్తే అది తప్పు అని చెబుతుండవచ్చుగాక…
కానీ బాధితులు ఎప్పుడు కొన్నారనేది పాయింట్… ఒకవేళ ఆ అగ్రిమెంట్ పీరియడ్లోనే కొని ఉంటే సుమ మీద ఓ లీగల్ రెస్పాన్సిబులిటీ ఉంటుంది… కొత్తగా అమల్లోకి వచ్చిన మార్కెటింగ్, యాడ్స్ రూల్స్ ప్రకారం ప్రచారకర్తలకు కూడా బాధ్యత ఉంటుంది… (Subject to Correction)… ఏ సరుకునైనా సరే ప్రచారకర్తలు ఎండార్స్ చేసేముందు అన్నీ పరిశీలించాలని రూల్స్ చెబుతున్నాయి… సరే, ఈ లీగల్ చికాకులు ఎలా ఉన్నా సరే, సుమ ఏదిపడితే ఆ యాడ్ అంగీకరించకూడదు… అది ఆమె ఇమేజీకే నష్టం, పైగా ఇదులో ఈ చికాకులు కూడా..!!
Share this Article