.
పెరియార్‌కెందుకు అంత గౌరవం: సుమతి మేఘవర్ణం
(‘సుమతి మేఘవర్ణం’ తమిళనాడు బీజేపీ నేత, పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు. ఎంఏ, ఎంఫిల్ చదువుకున్నారు. పబ్లిక్ స్పీకర్‌గా గుర్తింపు పొందారు. అధికార డీఎంకే మీద తన సూటి విమర్శలు, విశ్లేషణలతో విజృంభిస్తారన్న పేరున్న నాయకురాలు. పలు తమిళ ఇంటర్వ్యూలలో ఆమె చెప్పిన విషయాలు ఇవి. ఇవన్నీ పూర్తిగా ఆమె సొంత అభిప్రాయాలు. వీటితో వ్యాసకర్తకు ఏకాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు).
Ads
* హిందీని తమిళనాడు మొత్తం వ్యతిరేకించడం లేదు. కేవలం డీఎంకే చేస్తున్న ప్రచారం అది. ‘హిందీ తెరియాదు పోడా’ (హిందీ తెలియదు పోరా) అనేది వాళ్లు తెచ్చిన నినాదమే! సరే, Red Giant Movies ఉదయనిధి స్టాలిన్‌దే కదా? హిందీ వద్దన్న పార్టీలోనే కదా ఆయన ఉన్నారు. మరి ఆయన తన సంస్థ ద్వారా హిందీ సినిమాలు ఎందుకు చేస్తున్నారు? తమ సినిమాలను హిందీలో ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? అంటే మీ వ్యాపారాల కోసం మీకు హిందీ కావాలి, కానీ రాజకీయాలకు వచ్చేసరికి హిందీని ద్వేషించాలి. ఇదేనా నీతి?
* ప్రతి సంవత్సరం సెప్టెంబరు 14ను ‘హిందీ దివస్’గా జరుపుకుంటారు. ఈసారి ఆ కార్యక్రమం నిర్వహించినందుకు ‘తమిళనాడులో ఆ కార్యక్రమం ఎందుకు? దాని అవసరం ఏంటి?’ అని ముఖ్యమంత్రి స్టాలిన్ కామెంట్ చేశారు. 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు తమిళనాడులో ‘హిందీ దివస్’ జరుపుకున్నారు కదా? అప్పటికి కేంద్ర మంత్రిగా ఉన్న తమిళ నేత చిదంబరం వచ్చి హిందీలో మాట్లాడారు కదా? ఆ సమయంలో స్టాలిన్ కోమాలో ఉన్నారా? అప్పుడెందుకు ప్రశ్నించలేదు? అంటే కాంగ్రెస్ చేస్తే ఒప్పు, బీజేపీ చేస్తే తప్పా?
* హిందీ నేర్చుకుంటే తమిళ అస్తిత్వానికి చేటు కలుగుతుందని డీఎంకే ప్రచారం చేస్తోంది. ఎలా? ఎలాగో నాకు వివరించండి. నన్ను కన్నతల్లి ఉంది. ఆమెకు నా మీద ప్రేమ ఉంటుంది. అలాగే పిన్ని, మేనత్త, పెద్దమ్మ కూడా నా మీద ప్రేమ చూపిస్తారు. అలాగని మా అమ్మకు, నాకు ఉన్న బంధం చెడిపోతుందా? తమిళం మా అస్తిత్వం. హిందీ ఒక భాష. అంతే! ఎన్ని ఎక్కువ భాషలు నేర్చుకుంటే అంత జ్ఞానం పెరుగుతుంది. హిందీ నేర్చుకున్నంత మాత్రాన తమిళవాళ్లంతా ఇప్పటికిప్పుడు తమిళంలో మాట్లాడటం మానేస్తారా? అది సాధ్యం కాదు.
* సనాతన ధర్మం కుల వ్యవస్థను ప్రోత్సహిస్తుందని, తండ్రి చేసిన పనే కొడుకు చేయాలని నిర్బంధిస్తుందని డీఎంకే ఆరోపిస్తోంది. మరి డీఎంకే పార్టీ చేస్తోంది ఏంటి? కరుణానిధి సీఎం అయ్యారు. ఆ తర్వాత ఆయన కొడుకు స్టాలిన్ సీఎం అయ్యారు. ఆయన కొడుకు ఉదయనిధి మంత్రి అయ్యారు. పరంపరగా కుటుంబ రాజకీయాలు చేస్తోంది వీళ్లే కదా? మళ్లీ వీళ్లే వచ్చి సనాతన ధర్మంలో కులం ఉంది అని మాట్లాడితే ఎలా?
* డీఎండీకే పార్టీ తమిళనాడును ద్రావిడనాడు అంటుంది. మరో పక్క తమిళభాషకు తామే పరిరక్షకులం అంటోంది. మనది తమిళనాడు. ఆ పేరును డీఎంకేలో ఎంతమంది సరిగ్గా పలకగలరు? కాగితం చూడకుండా ముఖ్యమంత్రి స్టాలిన్ ‘తమిళతాయి వాళ్తు’ (తమిళనాడు రాష్ట్ర గీతం) పాడగలరా? డీఎంకేలో ఉండే ఎంతమంది కాగితం చూడకుండా రాష్ట్ర గీతం పాడగలరు? ఎంతమంది డీఎంకే నేతలు తిరుక్కురల్‌లో పది పంక్తులు చెప్పగలరు? ముందు ఆ విషయం తేల్చండి.
* మా వల్లే తమిళభాష అభివృద్ధి చెందుతోందని డీఎంకే అంటోంది. అంటే ఏంటి? ఎలా అభివృద్ధి చెందుతుందో ఒకసారి చూపించమనండి. సిటీ బస్సుల్లో తిరువళ్లువర్ రాసిన ‘తిరుక్కురల్’లోని వాక్యాలు రాసేస్తే తమిళం గొప్పగా ఉన్నట్టా? రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఎంతమంది తమిళ టీచర్లను రిక్రూట్ చేసుకుంది? తమిళ మీడియం పాఠశాలల్లో పాస్ పర్సెంటేజీ ఎంత? తమిళం ఎంత మేరకు బాగా చదువుతున్నారు? ఇవన్నీ తెలియాలి కదా! తమిళనాడులో సీబీఎస్‌ఈ స్కూల్స్‌లో సెకండ్ లాంగ్వేజ్‌గా తమిళం లేనే లేదు. ఉర్దూ మీడియం స్కూల్లలో అయితే తమిళం అవసరమే లేదని చట్టం చేశారు. మరి ఇంకేంటి వీళ్లు తమిళం కోసం చేస్తున్నది?
* డీఎంకేకి ఒక టీవీ చానెల్ ఉంది. దాని పేరేంటి? ‘సన్ టీవి’. ఏం? సూరియన్ (సూర్యుడు) టీవీ అని తమిళంలో పేరు పెట్టొచ్చు కదా? కరుణానిధి ఇంటి ఆడపిల్ల ఒక స్కూల్ పెట్టింది. దాని పేరేంటి? ‘సన్ షైన్’. దానికి తమిళ పేరు ఎందుకు పెట్టలేదు? వాళ్లు చక్కగా ఇంగ్లీషు పేర్లు పెట్టుకొని వ్యాపారాలు చేసుకోవచ్చు. కానీ బయటకు మాత్రం తమిళం మా వల్లే అభివృద్ధి చెందింది అని చెప్పుకోవాలి. అంతేనా? హిందీని ద్వేషిస్తున్నాం అంటున్న డీఎంకే ప్రభుత్వ జీవోల్లో తమిళ నెలల పేర్లు పెట్టొచ్చు కదా? ఎందుకు చేయరు? ఊరికే ఓ పెయింట్ డబ్బా తీసుకుని, హిందీ పేర్లకు పెయింట్ పూసేయగానే తమిళం వృద్ధి చెందుతుందా?
* పెరియార్ రామస్వామి నాయకర్ ఏనాడూ ఎమ్మెల్యేగానో, ఎంపీగానో గెలవలేదు. ఏ శాఖకూ మంత్రిగా పనిచేయలేదు. ఓటు వేసి నాయకుణ్ణి ఎన్నుకునే రాజకీయాలు వద్దు అని ప్రకటించిన వ్యక్తే కదా ఆయన? మరి ఆయన్ని ఎందుకు తమిళ రాజకీయాల్లో ఓ గొప్ప వ్యక్తిగా చూస్తారు? పెరియార్‌ని ఇంతమంది పొగుడుతున్నారు కదా, ఆయన తన జీవితకాలంలో ఎన్ని స్కూళ్లు కట్టించారు? ఎంతమంది ఆడపిల్లల్ని స్కూల్లో చేర్పించారు? చెప్పండి. తమిళమనేది ఒక ‘అడవి మనుషుల భాష’ అని పెరియార్ అవహేళన చేయలేదా? ‘నీ ఇంటి పనిమనిషితో కూడా ఇంగ్లీషులోనే మాట్లాడు’ అని ఆయన అనలేదా? మరి ఆయనకెందుకు అంత గౌరవం?
* పెరియార్‌ని అందరూ స్త్రీ హక్కుల కోసం పోరాడిన వ్యక్తి అని పొగుడుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. తన ఆస్తి మరొకరికి పోకూడదని 75 ఏళ్ల వయసులో 27 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్న వ్యక్తే కదా ఆయన? ఆ సమయంలో ఆయన తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. కేవలం సేవలు చేసే మనిషి కోసమేగా ఆమెను పెళ్లి చేసుకుంది. మొదటి భార్య నాగమ్మ బతికి ఉండగానే మరికొందరు స్త్రీలతో కలిసి ఉన్న వ్యక్తి కాదా ఆయన? అలాంటప్పుడు తన భార్య మనసు ఎంత బాధ పడుతుందో ఆయన ఆలోచించారా? పెరియార్ చేసినట్టు, ఆయన శిష్యులు ముసలి వయసులో చిన్నపిల్లను పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఒప్పుకుంటారా?
* దీపావళి పండుగ రాగానే చాలామంది పర్యావరణ స్పృహ గురించి మాట్లాడతారు. చాలా మంచిది. మరి వాళ్లు జనవరి 1వ తేదీ కాల్చే టపాసుల గురించి ఎందుకు మాట్లాడరు? దీపావళికి టపాసులు కాల్చడం తప్పు అని అనిపిస్తే డీఎంకే ప్రభుత్వం శివకాశిలో టపాసుల తయారీని ఎందుకు కొనసాగనిస్తోంది? సరే! దీపావళి పండుగ జరిగేది ఒకే ఒక్క రోజు. మరి శివకాశి టపాసులు ఏడాదంతా తయారు చేస్తారు. అలా ఏడాదంతా తయారు చేసే టపాసులు ఏమౌతున్నాయి? అవి ఎవరు కాలుస్తున్నారు? ఏ సందర్భంలో కాలుస్తున్నారు? వాటిని అడ్డుకోగలరా?
* పెరియార్ రామస్వామి నాయకర్ పెద్ద స్త్రీవాది అని, ఆయన ఆశయాలతో పార్టీ నడుపుతున్నాం అంటుంది కదా డీఎంకే, మరి ఆ పార్టీలో ఎంతమంది మహిళలకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇచ్చారో లెక్క తీయండి. డీఎంకే పెట్టి 50 ఏళ్లు అయిపోయింది. ఒక్కసారి కూడా ఆ పార్టీకి ఓ మహిళా అధ్యక్షురాలు లేరు. కరుణానిధి కుమార్తె కాబట్టి కనిమొళి మాత్రం అందరికీ తెలిశారు. మరొక మహిళా నాయకురాలి పేరు చెప్పండి చూద్దాం! కష్టం. వీల్‌ఛైర్‌లో ఉన్నప్పుడు కూడా కరుణానిధే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు కానీ మరొకరికి ఆ అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు స్టాలిన్ సీఎం అయ్యారు కదా, కనీసం పార్టీ అధ్యక్షుడి పదవైనా మరొకరికి ఇవ్వొచ్చు కదా? ఇవ్వరు. అదీ ఆ పార్టీలోని పరిస్థితి.
* ‘ఉత్తరాది వాళ్లు ఆర్యులు, దక్షిణాది వాళ్లు ద్రవిడులు’ అని డీఎంకే పార్టీ అంటోంది. భేష్! మరి రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ అంతా ఉత్తరాది వాళ్లు కాదా? మరి వాళ్లతో జోడీ కట్టి ‘ఇండియా’ కూటమిలో ఎందుకు చేరింది ఆ పార్టీ? సరే! వాళ్ల మాట ప్రకారం ఆర్యులంటే ఉత్తరాది బ్రాహ్మణులనే అనుకుందాం, మరి రాహుల్‌గాంధీ ఎన్నికల్లో ఏమన్నారు? ‘నేనొక బ్రాహ్మణుడిని’ అన్నారా లేదా? మరి ఆయన ఆర్యుడు కాదా? లేక అబద్ధం చెప్పారా? ఆయనతో కలిసి కూటమిలో ఎందుకు చేరారు? ఎవర్ని మోసం చేయడానికి ఈ మాటలు? వ్యాసకర్త: విశీ (వి.సాయివంశీ)
Share this Article